- District News
- Ranga Reddy
- రాజేంద్ర నగర్ నియోజకవర్గం అక్రమార్కులకు అడ్డాగా మారుతుంటే స్థానిక ఎమ్మెల్యే ఏమి చేస్తున్నాడు...?.
రాజేంద్ర నగర్ నియోజకవర్గం అక్రమార్కులకు అడ్డాగా మారుతుంటే స్థానిక ఎమ్మెల్యే ఏమి చేస్తున్నాడు...?.
శంషాబాద్ మండల పరిధిలో రూ.1000 కోట్ల భూకుంభ జరుగుతుంటే కిమ్మనకపోవడంలోని ఆంతర్యం ఏమిటి..!
రాజేంద్ర నగర్, (లోకల్ గైడ్ ): రాజేంద్రనగర్ నియోజకవర్గం అక్రమార్కులకు అడ్డాగా మారిందని శంషాబాద్ మండల పరిధిలోని పెద్ద షాపూర్ లో జరిగిన 1000 కోట్ల భూకుంభకోణమే అందుకు నిదర్శమని బిజెపి రాష్ట్ర కార్యవర్గ సభ్యులు, రాజేంద్రనగర్ నియోజకవర్గం ఇన్చార్జి తోకల శ్రీనివాస్ రెడ్డి ఆరోపించారు. శుక్రవారం కాటేదాన్ లోని తన కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో శంషాబాద్ మండలంలోని పెద్ద షాపూర్ రెవెన్యూ పరిధిలో జరిగిన వెయ్యికోట్ల భూ కుంభకోణం అయన మాట్లాడారు. మరి ఈ భూకుంభ కోణం పై స్థానిక ఎమ్మెల్యే టి ప్రకాష్ గౌడ్ తనకేమీ తెలియనట్లు నటిస్తున్నాడా.... లేదా ఇందులో తనకేమైనా వాటా తీసుకున్నాడా అనే అనుమానం కలుగుతుందన్నారు. తన నియోజకవర్గంలో ఈ భారీ కుంభకోణం తనకు తెలియకుండా ఎలా జరుగుతుందని ప్రశ్నించారు. ఈ భూ కుంభకోణంలో సీఎం పేరు చెప్పుకుని తిరిగే ఓ బ్రోకర్ వెనుక ఉన్న అసలు హస్తం ఎవరిదో నియోజకవర్గ ప్రజలకు సమాధానం చెప్పాల్సిన అవసరం ఎంతైనా ఉందన్నారు.
రాజేంద్రనగర్ నియోజకవర్గంలోని శంషాబాద్ మండలంలో రూ.1000 కోట్ల విలువైన ప్రభుత్వ భూమి అడ్డగోలుగా చేతులు మారిపోతుంటే స్థానిక ఎమ్మెల్యే ప్రకాష్ గౌడ్ ఏం చేస్తున్నారన్నారు. ఆయనకు తెలియకుండానే ఈ వ్యవహారం నడిచిందా? లేక తెలిసి కూడా నిమ్మకు నీరెత్తినట్లు కూర్చున్నారా? అనేది తేలాలన్నారు.
ఎవరో ఒక సొసైటీ వైస్ చైర్మన్ "నేను సీఎంకి అత్యంత సన్నిహితుడిని, నా వెనుక పెద్దలున్నారు" అని చెప్పుకుంటూ నియోజకవర్గంలో ఇష్టారాజ్యంగా చక్రం తిప్పుతుంటే, నాలుగు సార్లు గెలిచిన ప్రకాష్ గౌడ్ తన ఉనికిని కోల్పోయారా? ఆయన కేవలం డమ్మీ ఎమ్మెల్యేగా మిగిలిపోయారా? అనేది అంతు చిక్కని ప్రశ్నగా మిగిలిందన్నారు. ఇంత పెద్ద కుంభకోణంలో స్థానిక అధికార పార్టీ ప్రజాప్రతినిధి ప్రమేయం లేకుండా తహశీల్దార్ అంత సాహసం చేయగలరా? అనేది అనుమానం కలుగుతుందన్నారు. శంషాబాద్ మండలంలోని సర్వే నంబర్లు 172 నుండి 180 వరకు ఉన్న వివాదాస్పద ప్రభుత్వ భూములను, అలాగే సర్వే నంబర్ 626/1 పరిధిలోని క్రిమినల్ కేసులు ఉన్న భూములను ప్రైవేట్ వ్యక్తులకు కట్టబెట్టడం అత్యంత దుర్మార్గమన్నారు.
ప్రభుత్వ భూమిపై నిర్ణయం తీసుకోవాలంటే కలెక్టర్ ద్వారా ప్రభుత్వ దృష్టికి వెళ్లాలి. కానీ ఇక్కడ శంషాబాద్ తహశీల్దార్ తానే 'సీసీఎల్ఏ అనుకుని ఫిబ్రవరి 28న అడ్డగోలుగా ప్రొసీడింగ్స్ జారీ చేయటంలో ఎవరి ప్రోద్బలం ఉందో తేలాల్సిన అవసరం ఉందన్నారు.
కోర్టు పేరు చెప్పి ఈ ఉత్తర్వులు ఇవ్వడం వెనుక ఉన్న అసలు సూత్రధారులు ఎవరు అని ప్రశ్నించారు.
ఇప్పటికే 94 ఎకరాల భూమిని ప్రైవేట్ వ్యక్తులకు ధారాదత్తం చేయగా మరో 176 ఎకరాల ప్రభుత్వ భూమిని కూడా అన్యాక్రాంతం చేయడానికి ఫైల్ సిద్ధం చేయడం చూస్తుంటే శంషాబాద్‌ను దోచుకోవడానికి ఒక పెద్ద గ్యాంగ్ తయారైందో ఇట్టే అర్థమౌతుందన్నారు.
ఏసీబీ విచారణ ఎక్కడి వరకు వచ్చింది?: ఈ వ్యవహారంపై ఇప్పటికే ఏసీబీ దృష్టి సారించిందని, తహశీల్దార్‌ను పిలిపించి విచారిస్తున్నారని తెలుస్తోందన్నారు.
మరి ఈ విచారణను నీరుగార్చకుండా దీని వెనుక ఉన్న ఆ "సొసైటీ వైస్ చైర్మన్" ఎవరు....? ఆ పెద్ద తలకాయలు ఎవరివో ఏసీబీ బయటపెట్టాలని డిమాండ్ చేశాడు.
ప్రభుత్వ పెద్దల ఆగ్రహం డ్రామానా?
పత్రికల్లో వార్తలు వచ్చాక ప్రభుత్వ పెద్దలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నట్లు లీకులు ఇవ్వడం కాదు, తక్షణమే ఆ తహశీల్దార్‌పై క్రిమినల్ కేసులు పెట్టి సస్పెండ్ చేయాల్సిన అవసరం ఉందన్నారు అంతే కాకుండా ఆ వివాదాస్పద ఉత్తర్వులను రద్దు చేసి సిట్టింగ్ జడ్జితో లేదా సీబీఐ తో విచారణ చేయాలన్నారు.
తన నియోజకవర్గంలో ఇంత పెద్ద ల్యాండ్ స్కామ్ జరుగుతున్నా అడ్డుకోలేకపోయినందుకు ఎమ్మెల్యే ప్రకాష్ గౌడ్ నైతిక బాధ్యత వహించాలి, లేదా ఈ స్కామ్‌లో ఆయనకు సంబంధం లేదని నిరూపించుకోవాలని సవాల్ విసిరారు. అక్రమంగా ప్రైవేట్ వ్యక్తులకు బదలాయించిన 94 ఎకరాల ప్రొసీడింగ్స్‌ను వెంటనే రద్దు చేసి, మిగిలిన 176 ఎకరాల ప్రభుత్వ భూమి చుట్టూ రక్షణ గోడ, బోర్డులు ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు. ఈ సమావేశంలో బిజెపి నాయకులు బుచ్చిరెడ్డి, ఎల్ వీ రెడ్డి, భోమ్మరాజు నర్సింహా, సంతోష్ గౌడ్, టి. చిన్న. శ్రీకాంత్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.
