- District News
- Khammam
- డీజే హంగామా వద్దు.. నిబంధనలు ముద్దు
డీజే హంగామా వద్దు.. నిబంధనలు ముద్దు
గణేష్ మండపాల నిర్వాహకులు, డీజే నిర్వాహకులకు సీఐ సాగర్, ఎస్సై గోపి సూచనలు
కారేపల్లి (సింగరేణి), సెప్టెంబర్ 9, లోకల్ గైడ్ న్యూస్ :
సింగరేణి మండలంలో గణేష్ నవరాత్రి ఉత్సవాలను భక్తిశ్రద్ధలతో, శాంతియుత వాతావరణంలో నిర్వహించాలని కారేపల్లి పోలీస్ అధికారులు సూచించారు. గణేష్ నవరాత్రుల సందర్భంగా మండపాల నిర్వాహకులు, డీజే నిర్వాహకులు, ప్రజాప్రతినిధులతో కారేపల్లి పోలీస్ స్టేషన్‌లో సీఐ సాగర్, ఎస్సై గోపి అవగాహన సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా అధికారులు మాట్లాడుతూ గణేష్ మండపాల ఏర్పాటుకు సంబంధించి నిర్వాహకులు తప్పనిసరిగా అనుమతులు తీసుకోవాలని, పోలీస్ శాఖ సూచించే నిబంధనలను కచ్చితంగా పాటించాలని తెలిపారు. మండపాల వద్ద భద్రతకు సంబంధించిన అన్ని ముందస్తు చర్యలు తీసుకోవాలని, విద్యుత్ వైర్లు, విద్యుత్ పరికరాల విషయంలో నిర్వాహకులు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. డీజే వినియోగంలో నిబంధనలు తప్పనిసరిగా పాటించాలని సీఐ సాగర్, ఎస్సై గోపి స్పష్టం చేశారు. అధిక శబ్దంతో ప్రజలకు ఇబ్బందులు కలిగించరాదని, నిర్ణీత సమయాల్లోనే డీజేను వినియోగించాలని సూచించారు. నిబంధనలు ఉల్లంఘిస్తే చర్యలు తప్పవని హెచ్చరించారు. గణేష్ విగ్రహాల ఊరేగింపు సమయంలో ట్రాఫిక్‌కు అంతరాయం కలగకుండా నిర్వాహకులు ముందస్తు చర్యలు తీసుకోవాలని తెలిపారు. ప్రధాన రహదారుల్లో వాహనాల రాకపోకలకు ఇబ్బందులు కలగకుండా పోలీసులకు సహకరించాలని కోరారు. మండపాల వద్ద ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు చోటుచేసుకోకుండా నిర్వాహకులు ప్రత్యేక జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. గణేష్ నవరాత్రి వేడుకలను ప్రశాంతంగా, సోదరభావంతో నిర్వహించేందుకు ప్రతి ఒక్కరూ పోలీసులకు సహకరించాలని సీఐ సాగర్, ఎస్సై గోపి కోరారు. ప్రజలు కూడా పోలీసుల సూచనలు పాటిస్తూ ఎలాంటి అవాంఛనీయ సంఘటనలకు తావులేకుండా ఉత్సవాలను విజయవంతంగా నిర్వహించాలని సూచించారు.
