చుక్కలనంటుతున్న ధరలు - బెంబేలెత్తుతున్న పేదలు 

అశ్వారావుపేటలో సీపీఐ(ఎంఎల్‌) మాస్ లైన్ భారీ ధర్నా

Published On
చుక్కలనంటుతున్న ధరలు - బెంబేలెత్తుతున్న పేదలు 

 

 

లోకల్ గైడ్ : ​అశ్వారావుపేట

మార్కెట్‌కు వెళ్లాలంటేనే సగటు సామాన్యుడి గుండె గుభిల్లుమంటోంది. నిత్యావసర వస్తువుల ధరలు రోజురోజుకూ ఆకాశాన్ని తాకుతుండటంతో పేద, మధ్యతరగతి ప్రజలు జీవనం సాగించలేక తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఈ అడ్డగోలు ధరల పెరుగుదలను నిరసిస్తూ భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అశ్వారావుపేట మండల కేంద్రంలో బుధవారం సీపీఐ(ఎంఎల్‌) మాస్ లైన్ మరియు ప్రజా సంఘాల ఆధ్వర్యంలో స్థానిక తహశీల్దార్ కార్యాలయం ఎదుట భారీ ధర్నా నిర్వహించారు. ​కార్యక్రమంలో ముఖ్య అతిథులుగా పాల్గొన్న ఏఐపీకేఎంఎస్ జిల్లా అధ్యక్షులు గోకినపల్లి ప్రభాకర్, ఏఐయూకేఎస్ జిల్లా గౌరవ అధ్యక్షులు కంగాల కల్లయ్య మాట్లాడుతూ కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల ప్రజా వ్యతిరేక విధానాలపై తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం కార్పొరేట్ శక్తులకు పెద్దపీట వేస్తూ బ్లాక్ మార్కెటింగ్‌ను ప్రోత్సహిస్తోందని నేతలు మండిపడ్డారు.
ఆదాయం శూన్యం – వ్యయం భారం
సామాన్యుల రోజువారీ ఆదాయాలు పెరగకపోగా, సరుకుల ధరలు మాత్రం చుక్కలనంటుతుండటంతో పేదల బతుకులు దుర్భరంగా మారాయని ఆవేదన వ్యక్తం చేశారు. ఇప్పటికైనా ప్రభుత్వాలు స్పందించి నిత్యావసర సరుకుల ధరలను అదుపులోకి తెచ్చి పేదలకు తక్షణ ఊరట కల్పించాలని డిమాండ్ చేశారు.
​ధర్నా అనంతరం సమస్య పరిష్కారం కోరుతూ తహశీల్దార్‌కు వినతిపత్రం అందజేశారు. ఈ నిరసనలో సీపీఐ(ఎంఎల్) మాస్ లైన్ మండల కార్యదర్శి వాసం బుచ్చిరాజు, పీవైఎల్ డివిజన్ కార్యదర్శి బాడిస లక్ష్మణ్ రావు, పీఓడబ్ల్యు మండల కార్యదర్శి కంగాల భూలక్ష్మిలతో పాటు నాయకులు కుంజా అర్జున్, కారం మల్లేష్, ధర్ముల శ్రీరాములు, కొమరం చిన్న లక్ష్మి, కొమరం సింగమ్మ, కబ్బాడి కవిత, కుర్సం పోతురాజు, తెల్లం సత్యం, కంగాల కన్నయ్య, మడివి ముత్యాలు, పూర్రే చెల్లమ్మ, ముయ్యబోయిన లక్ష్మి, సోడెం రామమ్మ తదితరులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.

Tags:

About The Author

Latest News