- District News
- Khammam
- కారేపల్లి ప్రభుత్వ ఆసుపత్రిని 50 పడకల ఆసుపత్రిగా అప్‌గ్రేడ్ చేయాలి
కారేపల్లి ప్రభుత్వ ఆసుపత్రిని 50 పడకల ఆసుపత్రిగా అప్‌గ్రేడ్ చేయాలి
హైస్కూల్, జూనియర్ కళాశాలకు ప్రహరీ గోడ నిర్మించాలి
ఖమ్మం జిల్లా, కారేపల్లి : ఆగస్టు 17 (లోకల్ గైడ్) :
ఏజెన్సీ మండలమైన కారేపల్లిలో ప్రజలకు మెరుగైన విద్య, వైద్యం, రవాణా, మౌలిక వసతులు కల్పించాలని కోరుతూ సీపీఐ(ఎం) సింగరేణి మండల కమిటీ ఆధ్వర్యంలో సోమవారం ప్రజావాణిలో అధికారులకు వినతిపత్రం అందజేశారు. మండల పరిషత్ కార్యాలయంలో నిర్వహించిన ప్రజావాణి కార్యక్రమంలో ప్రజా సమస్యలను అధికారుల దృష్టికి తీసుకెళ్లారు.
ఈ సందర్భంగా సీపీఐ(ఎం) జిల్లా కమిటీ సభ్యులు కొండబోయిన నాగేశ్వరరావు, మండల కార్యదర్శి కె. నరేంద్ర మాట్లాడుతూ కారేపల్లి మండలంలో 41 గ్రామపంచాయతీలు, 86 శివారు గ్రామాలు, సుమారు 70 వేల జనాభా ఉందని తెలిపారు. ఇంత పెద్ద జనాభా ఉన్న మండలానికి అనుగుణంగా విద్య, వైద్యం, రవాణా తదితర మౌలిక సదుపాయాలు అందుబాటులో లేవని పేర్కొన్నారు. ప్రజల అవసరాలను దృష్టిలో ఉంచుకుని ప్రభుత్వం తక్షణమే ప్రత్యేక చర్యలు చేపట్టాలని కోరారు.
50 పడకల ఆసుపత్రిగా మార్చాలి
మండల కేంద్రంలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని కమ్యూనిటీ హెల్త్ సెంటర్‌గా అప్‌గ్రేడ్ చేసి 50 పడకల ఆసుపత్రిగా మార్చాలని డిమాండ్ చేశారు. దీంతో మండలంలోని గిరిజనులు, పేదలు, మారుమూల గ్రామాల ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందుబాటులోకి వస్తాయని తెలిపారు. అదేవిధంగా మండలంలోని మరో ప్రాంతంలో ప్రభుత్వ ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని ఏర్పాటు చేయాలని కోరారు.
ఆసుపత్రిలో ఖాళీగా ఉన్న మహిళా వైద్యురాలు, ఫార్మసిస్ట్, సూపర్‌వైజర్ పోస్టులను వెంటనే భర్తీ చేయాలని డిమాండ్ చేశారు. వైద్య సిబ్బంది కొరత కారణంగా ప్రజలు ఇబ్బందులు పడుతున్నారని, అత్యవసర వైద్యం కోసం దూర ప్రాంతాలకు వెళ్లాల్సి వస్తోందని పేర్కొన్నారు.
విద్యాసంస్థలకు ప్రహరీ గోడలు నిర్మించాలి
మండల కేంద్రంలోని ప్రభుత్వ హైస్కూల్, జూనియర్ కళాశాలకు ప్రహరీ గోడ నిర్మించాలని కోరారు. విద్యార్థుల భద్రతతో పాటు విద్యాసంస్థల ఆస్తుల పరిరక్షణకు ప్రహరీ గోడ ఎంతో అవసరమని తెలిపారు. ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థులకు సౌకర్యవంతమైన వాతావరణం కల్పించేందుకు అవసరమైన వంట షెడ్లను నిర్మించాలని కోరారు.
అలాగే ఎస్సీ, బీసీ విద్యార్థుల కోసం నిర్వహిస్తున్న హాస్టళ్లకు సొంత భవనాలు మంజూరు చేసి, విద్యార్థులకు మెరుగైన వసతులు కల్పించాలని విజ్ఞప్తి చేశారు.
అసంపూర్తి రోడ్డు పనులు పూర్తి చేయాలి
మాణిక్యారం నుంచి మోట్లగూడెం వరకు మెటల్ వేసి అసంపూర్తిగా ఉన్న బీటీ రోడ్డు నిర్మాణాన్ని వెంటనే పూర్తి చేయాలని సీపీఐ(ఎం) నాయకులు డిమాండ్ చేశారు. రహదారి పూర్తికాకపోవడంతో ప్రజలు, విద్యార్థులు, రైతులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని తెలిపారు. మండలంలోని అన్ని గ్రామాలకు ఆర్టీసీ బస్సు సౌకర్యం కల్పించాలని కోరారు.
మండల ప్రజల సమస్యలను ప్రభుత్వం ప్రాధాన్యతగా తీసుకుని పరిష్కరించాలని, ప్రజావాణిలో అందజేసిన వినతిపత్రంలోని డిమాండ్లపై సంబంధిత అధికారులు త్వరితగతిన చర్యలు తీసుకోవాలని సీపీఐ(ఎం) నాయకులు కోరారు.
ఈ కార్యక్రమంలో మండల నాయకులు వజ్జా మారావు, కొండబోయిన ఉమావతి, యనమనగండ్ల రవి, ముండ్ల ఏకాంబరం, కేసగాని ఉపేందర్, రేగళ్ల మంగయ్య, గంగా ధరణి, ఉపేందర్, భాగ వెంకట అప్పారావు తదితరులు పాల్గొన్నారు.
