- District News
- Khammam
- స్నేహమే కాదు.. ఆపదలో అండగా నిలిచిన 2004 బ్యాచ్ మిత్రులు
స్నేహమే కాదు.. ఆపదలో అండగా నిలిచిన 2004 బ్యాచ్ మిత్రులు
మాజీ సర్పంచ్ అజ్మీరా నరేష్ కుమార్, డాక్టర్ భాదవత్ రవి ఆధ్వర్యంలో రూ.27 వేల ఆర్థిక సాయం
ఖమ్మం జిల్లా, కారేపల్లి (సింగరేణి):లోకల్ గైడ్, ఆగష్టు 8 : స్నేహబంధానికి నిజమైన అర్థాన్ని చాటుతూ మిత్రుడి కష్టకాలంలో అండగా నిలిచారు మాదారం కే.వి. విద్యానికేతన్ 2004 పదో తరగతి బ్యాచ్ పూర్వ విద్యార్థులు. సింగరేణి మండలం మాదారం గ్రామపంచాయతీకి చెందిన తమ మిత్రుడు రమేష్ తల్లి లక్ష్మి అనారోగ్యంతో మృతి చెందిన విషయం తెలుసుకున్న మాదారం మాజీ సర్పంచ్ అజ్మీరా నరేష్ కుమార్, డాక్టర్ భాదవత్ రవి తదితర 2004 బ్యాచ్ స్నేహితులు దశదినకర్మ కార్యక్రమానికి హాజరై రమేష్ కుటుంబాన్ని పరామర్శించారు.
ఈ సందర్భంగా మిత్రుడి కుటుంబానికి తమ వంతు సహాయంగా పూర్వ విద్యార్థులంతా కలిసి రూ.27 వేల ఆర్థిక సహాయాన్ని అందజేశారు. తల్లి మృతితో విషాదంలో ఉన్న రమేష్ కుటుంబానికి ధైర్యం చెబుతూ, ఎలాంటి కష్టకాలంలోనైనా మిత్రులంతా కుటుంబ సభ్యుల మాదిరిగా అండగా ఉంటామని భరోసా కల్పించారు.
మాజీ సర్పంచ్ అజ్మీరా నరేష్ కుమార్, డాక్టర్ భాదవత్ రవి మాట్లాడుతూ.. చిన్ననాటి నుంచి కొనసాగుతున్న తమ స్నేహబంధం కేవలం కలుసుకోవడం వరకే పరిమితం కాదని, మిత్రుల్లో ఎవరికి కష్టం వచ్చినా అందరం ఒక్కటై అండగా నిలవడమే తమ లక్ష్యమని తెలిపారు. స్నేహితుల కుటుంబాలకు ఆపద సమయంలో చేతనైన సహాయం అందించడం తమ బాధ్యతగా భావిస్తున్నామని పేర్కొన్నారు.
గతంలోనూ సేవా కార్యక్రమాలు
2004 బ్యాచ్ పూర్వ విద్యార్థులు గతంలోనూ అనేక సేవా కార్యక్రమాలు చేపట్టినట్లు తెలిపారు. కొద్ది నెలల క్రితం అకాల మరణం చెందిన గుంపెలగూడెం గ్రామానికి చెందిన తమ స్నేహితుడు వీరన్న కుమార్తె పేరుపై రూ.1.10 లక్షలు డిపాజిట్ చేసి ఆ కుటుంబానికి భరోసాగా నిలిచారు. తమ బ్యాచ్‌లోని మిత్రుల కుటుంబాలకు ఎప్పుడు అవసరం వచ్చినా సమష్టిగా స్పందిస్తూ మానవత్వాన్ని చాటుతున్నారు.
గురువుకు ఘన సన్మానం
తమకు విద్యాబుద్ధులు నేర్పిన కే.వి. విద్యానికేతన్ కరెస్పాండెంట్ కె.వి. రంగారావును పూర్వ విద్యార్థులు ఘనంగా సన్మానించారు. శాలువా కప్పి గురువుపట్ల తమ గౌరవాన్ని చాటుకున్నారు. తమ జీవితాలను తీర్చిదిద్దడంలో గురువు అందించిన మార్గదర్శకత్వాన్ని వారు గుర్తుచేసుకున్నారు.
2004 బ్యాచ్‌కు చెందిన పలువురు ప్రస్తుతం ఎన్‌ఆర్‌ఐలుగా, పాఠశాల చైర్మన్లుగా, బ్యాంకు మేనేజర్లుగా, వివిధ ఉద్యోగాల్లో, రాజకీయ రంగంలో, సర్పంచులు, వార్డు సభ్యులుగా కొనసాగుతూ సమాజానికి సేవలు అందిస్తున్నారు. చిన్ననాటి స్నేహాన్ని నేటికీ కొనసాగిస్తూ సేవా కార్యక్రమాల్లో పాల్గొంటున్న పూర్వ విద్యార్థులను పలువురు అభినందించారు.
ఈ కార్యక్రమంలో బోడా రమేష్ నాయక్, అజ్మీర సురేష్ నాయక్, బట్టు వీరు, బాలు, లచ్చు, బానోత్ నాగేష్, దుప్పటి గోవిందు, పోతనబోయిన ఉమా, రావు రాంబాబు, అజ్మీర రజిని తదితరులు పాల్గొన్నారు.
