సిద్దిపేట, ఆగస్టు 5(లోకల్ గైడ్):
సీజనల్ వ్యాధులు ప్రబలకుండా ముందస్తు జాగ్రత్తలు తీసుకోవడంతో పాటు గురుకుల విద్యార్థులకు మెనూ ప్రకారం నాణ్యమైన, రుచికరమైన భోజనం అందించాలని జిల్లా కలెక్టర్ కే. హైమావతి అధికారులను ఆదేశించారు. బుధవారం దుబ్బాకలోని తెలంగాణ సాంఘిక సంక్షేమ బాలుర గురుకుల పాఠశాల, జూనియర్ కళాశాలను ఆకస్మికంగా సందర్శించిన ఆమె మధ్యాహ్న భోజన ఏర్పాట్లు, వంటశాల, స్టోర్‌రూమ్‌ను క్షేత్రస్థాయిలో పరిశీలించారు.విద్యార్థులకు అందిస్తున్న బిర్యానీ రైస్, బాయిల్డ్ గుడ్డు కూర, ఆలూ కుర్మా, రసం, పెరుగును పరిశీలించిన కలెక్టర్, బిర్యానీ నాణ్యత సంతృప్తికరంగా లేదని అసంతృప్తి వ్యక్తం చేశారు. క్యారెట్, పుదీనా, బగారా దినుసులు సమపాళ్లలో వేసి నాణ్యతతో వండి విద్యార్థులకు అందించాలని ప్రిన్సిపాల్‌ను హెచ్చరించారు.స్టాక్ రిజిస్టర్‌ను తనిఖీ చేసిన కలెక్టర్, ప్రతిరోజూ కామన్ డైట్ మెనూను తప్పనిసరిగా అమలు చేయాలని, విద్యార్థుల హాజరు ఆధారంగా ఫుడ్ కమిటీ సమక్షంలో వంట సరుకులు పంపిణీ చేసి నాణ్యమైన ఆహారం తయారు చేయాలని సూచించారు. వంటగది, స్టోర్‌రూమ్ పరిసరాలను పరిశుభ్రంగా ఉంచి, మురుగునీరు నిల్వ కాకుండా, ఈగలు, దోమలు రాకుండా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు.విద్యార్థులు సీజనల్ వ్యాధుల బారిన పడకుండా ప్రత్యేక చర్యలు చేపట్టాలని, జ్వరం లేదా జలుబు లక్షణాలు కనిపిస్తే పూర్తిగా కోలుకునే వరకు పర్యవేక్షించాలని, అవసరమైతే వెంటనే ఆసుపత్రికి తరలించి చికిత్స అందించాలని కలెక్టర్ సూచించారు.గురుకులంలో బియ్యం నాణ్యతపై ఫిర్యాదు రావడంతో వెంటనే డీసీఎస్‌ఓతో ఫోన్‌లో మాట్లాడి నాణ్యమైన బియ్యం సరఫరా చేయాలని ఆదేశించారు. అలాగే గురుకులంలో ఉన్న ఇతర సమస్యలను గుర్తించి వెంటనే పరిష్కరించాలని సంబంధిత అధికారులకు దిశానిర్దేశం చేశారు.