- District News
- Khammam
- అన్ని రంగాల్లో అభివృద్ధి పథంలో తెలంగాణ… రాష్ట్ర డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క మల్లు
అన్ని రంగాల్లో అభివృద్ధి పథంలో తెలంగాణ… రాష్ట్ర డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క మల్లు
వ్యవసాయానికి ప్రాముఖ్యత.. రైతుల సంక్షేమానికి వెన్నుదన్ను
ఖమ్మం, సెప్టెంబర్ - 17: లోకల్ గైడ్:
ఈ సందర్భంగా డిప్యూటి సీఎం మాట్లాడుతూ, సెప్టెంబర్ 17న భారతదేశంలో అంతర్భాగంగా మారి ప్రజాస్వామ్య పాలనలోకి అడుగుపెట్టిన తెలంగాణ 1,000 రోజుల ప్రజా పాలనలో సంక్షేమం, అభివృద్ధికి పెద్దపీట వేసిందన్నారు. ప్రజాస్వామిక స్వేచ్ఛ కోసం ఉద్యమించిన యోధుల వెలకట్టలేని త్యాగాలను స్మరించుకోవడం మనందరి బాధ్యత అని పేర్కొన్నారు.
ప్రజా ప్రభుత్వం పూర్తి చేసుకున్న పాలనలో పేదలు, రైతులు, మహిళలు, యువత, విద్యార్థుల సంక్షేమానికి అత్యున్నత ప్రాధాన్యతనిచ్చామని డిప్యూటీ సీఎం తెలిపారు.
మహాలక్ష్మి పథకం ద్వారా ఉచిత ఆర్టీసీ ప్రయాణం, రూ. 500 కే గ్యాస్ సిలిండర్లను అందిస్తున్నట్లు తెలిపారు. ఖమ్మం జిల్లాలో మహిళలు ఉచిత ఆర్టీసీ ప్రయాణాల ద్వారా రూ. 343.44 కోట్లు ఆదా చేసుకున్నారని వివరించారు.
రైతు భరోసా ద్వారా ఖమ్మం జిల్లాలోని 3,41,913 మంది రైతులకు రూ. 427.96 కోట్లు అందించామని, పంట రుణమాఫీ కింద 1,31,760 మంది రైతులకు రూ. 912.61 కోట్ల రుణభారం నుంచి విముక్తి కల్పించామని తెలిపారు.
గృహజ్యోతి కింద 200 యూనిట్లలోపు విద్యుత్ వినియోగించే 2.49 లక్షల కుటుంబాలకు ఉచిత విద్యుత్ అందిస్తున్నామన్నారు. 2030 నాటికి 20,000 మెగావాట్ల పునరుత్పాదక ఇంధన సామర్థ్యమే లక్ష్యంగా తెలంగాణను హరిత ఇంధన రాష్ట్రంగా తీర్చిదిద్దుతున్నామని పేర్కొన్నారు.
సీతారామ ఎత్తిపోతల పథకం, పాలేరు లింక్ కాలువ, మున్నేరు-పాలేరు లింక్ కాలువ, జవహర్ లిఫ్ట్ ఇరిగేషన్ పనులను వేగవంతం చేశామని తెలిపారు. ఖమ్మం నగరాన్ని వరదల నుంచి రక్షించేందుకు రూ. 525.36 కోట్లతో వరద రక్షణ గోడ నిర్మిస్తున్నామన్నారు.
జిల్లాలో యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ స్కూళ్లు, అడ్వాన్స్‌డ్ టెక్నాలజీ సెంటర్లు, ఇంజినీరింగ్, నర్సింగ్ కళాశాలలను ఏర్పాటు చేస్తున్నట్లు చెప్పారు. రాజీవ్ ఆరోగ్యశ్రీని బలోపేతం చేస్తూ ఆసుపత్రులలో అత్యాధునిక వైద్య వసతులను కల్పిస్తున్నామని తెలిపారు.
జిల్లాలో తొలి దశలో 16,597 ఇందిరమ్మ ఇళ్లు మంజూరు చేసి రూ. 491.8 కోట్ల ఆర్థిక సాయం అందించామన్నారు. అలాగే పేదలకు ప్రతి నెలా ఉచిత సన్నబియ్యం సరఫరా చేస్తున్నట్లు పేర్కొన్నారు. టీ-ఐపాస్, పీఎమ్‌ఈజీపీ ద్వారా రూ. 577 కోట్లకు పైగా పెట్టుబడులను ఆకర్షించి యువతకు నైపుణ్య శిక్షణ, ఉపాధి అవకాశాలు కల్పిస్తున్నామని తెలిపారు.
సంక్షేమం, అభివృద్ధిని సమన్వయం చేస్తూ ప్రతి కుటుంబ సంక్షేమం, ప్రతి ప్రాంత సమగ్ర అభివృద్ధే లక్ష్యంగా ప్రజా ప్రభుత్వం ముందుకు సాగుతోందని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క స్పష్టం చేశారు.
వేడుకల్లో భాగంగా పీఎంశ్రీ జెడ్పీహెచ్ ఎస్, పందిళ్లపల్లి విద్యార్థినులు ప్రదర్శించిన ప్రజాపాలన పాట, ఎంజేపీటీబిసి, డబ్ల్యూఆర్జేసి, లంకపల్లి, దానవాయిగూడెం విద్యార్థినులు ప్రదర్శించిన తెలంగాణ ఆవిర్భావ దినోత్సవ పాట, టీజీఎస్డబ్ల్యుఆర్ఎస్, జేసి టేకులపల్లి విద్యార్ధులు ప్రదర్శించిన పొడుస్తున్న పొద్దు మీద నడుస్తున్న గానమా పాటపై నృత్యాలు ఆహుతులను ఆకట్టుకున్నాయి.
తెలంగాణ అమరవీరులు జర్పుల సురేష్, మీనా వేణు, వెంపడి రామకృష్ణ, ఎస్కే. మహమూద్ పాషా, యన్మందుల వేణుగోపాల్ ల కుటుంబ సభ్యులను ఘనంగా సత్కరించారు.
అనంతరం వ్యవసాయ, ఉద్యానవన, డిఆర్డిఎ, సంక్షేమం, వైద్య ఆరోగ్య, అటవీ, విద్యా, ఎస్సీ/ఎస్టీ/బిసి/మైనారిటీ సంక్షేమం, విద్యుత్, సైబర్ నేరాలు, టిజి ఆర్టీసీ, పౌరసరఫరాలు, మోడల్ స్కూల్స్ శాఖలచే ఏర్పాటుచేసిన స్టాళ్లను డిప్యూటీ సిఎం పరిశీలించారు.
ఈ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ దివాకర టిఎస్, పోలీస్ కమీషనర్ సునీల్ దత్, సుడా చైర్మన్ పువ్వాళ్ల దుర్గాప్రసాద్, ఖమ్మం మునిసిపల్ కార్పొరేషన్ కమిషనర్ అభిషేక్ అగస్త్య, అదనపు కలెక్టర్లు డా. పి. శ్రీజ, పి. శ్రీనివాస రెడ్డి, జిల్లా రెవెన్యూ అధికారి రాంమూర్తి, వివిధ శాఖల జిల్లా అధికారులు, ప్రజాప్రతినిధులు, తదితరులు పాల్గొన్నారు.
