- District News
- పేదల పొట్ట కొట్టే కేంద్ర విధానాలను తిప్పికొడదాం
పేదల పొట్ట కొట్టే కేంద్ర విధానాలను తిప్పికొడదాం
జైల్‌భరోను జయప్రదం చేద్దాం – వ్యకాస జిల్లా ఉపాధ్యక్షులు కొండబోయిన నాగేశ్వరరావు
ఖమ్మం జిల్లా, కారేపల్లి (సింగరేణి ) : లోకల్ గైడ్, ఆగష్టు 7 : కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం అనుసరిస్తున్న ప్రజా, కార్మిక, రైతు వ్యతిరేక విధానాలను తిప్పికొట్టేందుకు ప్రజలు ఐక్యంగా పోరాడాలని తెలంగాణ వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా ఉపాధ్యక్షులు కొండబోయిన నాగేశ్వరరావు పిలుపునిచ్చారు. గ్రామీణ పేదలకు ఉపాధి కల్పిస్తున్న మహాత్మాగాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ చట్టాన్ని బలహీనపరిచే కేంద్ర ప్రభుత్వ చర్యలకు నిరసనగా ఆగస్టు 10న నిర్వహించనున్న జైల్‌భరో కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని కోరారు.
ఈ సందర్భంగా శుక్రవారం కారేపల్లిలో నిర్వహించిన ప్రచార కార్యక్రమంలో నాగేశ్వరరావు మాట్లాడుతూ.. కేంద్రంలోని మోడీ ప్రభుత్వం వ్యవసాయ రంగాన్ని దెబ్బతీసే విధంగా రైతాంగ వ్యతిరేక విధానాలను అమలు చేస్తోందని విమర్శించారు. గ్రామీణ పేదలకు కొంతమేర ఉపాధి కల్పిస్తున్న ఉపాధి హామీ పథకాన్ని బలహీనపరిచేందుకు కొత్త బిల్లులను తీసుకువస్తూ ఉపాధి అవకాశాలను కుదించే ప్రయత్నం జరుగుతోందని ఆరోపించారు.
కార్మికులు, ఉద్యోగులు, ఉపాధ్యాయులకు రక్షణగా ఉన్న కార్మిక చట్టాలను మార్చి నాలుగు లేబర్ కోడ్‌లుగా తీసుకురావడం ద్వారా కార్మిక హక్కులను హరించేందుకు కేంద్రం ప్రయత్నిస్తోందని అన్నారు. ప్రభుత్వ రంగ సంస్థలను ప్రైవేటీకరించే విధానాలతో ఉద్యోగ, ఉపాధి అవకాశాలకు ముప్పు కలిగిస్తోందని విమర్శించారు.
కేంద్ర ప్రభుత్వ విధానాల వల్ల పేదలు, రైతులు, వ్యవసాయ కార్మికులు, కార్మికులు, ఉద్యోగులు, ఉపాధ్యాయులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని నాగేశ్వరరావు తెలిపారు. ప్రజా హక్కుల పరిరక్షణ కోసం అన్ని వర్గాల ప్రజలు ఐక్యంగా ఉద్యమించాలని పిలుపునిచ్చారు.
క్విట్ ఇండియా ఉద్యమ స్ఫూర్తితో ఆగస్టు 10న నిర్వహించే జైల్‌భరో కార్యక్రమంలో ప్రజలు పెద్ద సంఖ్యలో పాల్గొని కేంద్ర ప్రభుత్వ ప్రజా వ్యతిరేక విధానాలను నిరసించాలని కోరారు. పేదల ఉపాధి, కార్మికుల హక్కులు, రైతుల ప్రయోజనాల పరిరక్షణ కోసం జరిగే ఈ పోరాటాన్ని జయప్రదం చేయాలని విజ్ఞప్తి చేశారు. ఈ కార్యక్రమంలో సీఐటీయూ మండల కన్వీనర్ కే. నరేంద్ర, రైతు సంఘం మండల కార్యదర్శి వజ్జా రామారావు, వ్యవసాయ కార్మిక సంఘం మండల అధ్యక్ష, కార్యదర్శులు కేసగాని ఉపేందర్, ఎనమనగండ్ల రవి, ముండ్ల ఏకాంబరం, పాసిని నాగేశ్వరరావు, నాగమణి, కమల, రాధ, హుస్సేన్, రాంబాబు తదితరులు పాల్గొన్నారు.
