విద్యార్థుల క్రీడా ప్రోత్సాహానికి చంద్రు ఫౌండేషన్ చేయూత

గేట్ కారేపల్లి ఎంపీపీఎస్‌కు క్రీడా దుస్తుల పంపిణీ – ఫౌండేషన్ సేవలు ఆదర్శనీయం: ఎంఈవో దుగ్గిరాల జయరాజు

Published On
విద్యార్థుల క్రీడా ప్రోత్సాహానికి చంద్రు ఫౌండేషన్ చేయూత

 




ఖమ్మం జిల్లా, కారేపల్లి (లోకల్ గైడ్) : లోకల్ గైడ్, ఆగష్టు 5 : విద్యార్థుల్లో క్రీడాస్ఫూర్తిని పెంపొందించడంతో పాటు విద్యా రంగంలో మెరుగైన అవకాశాలు కల్పించాలనే లక్ష్యంతో చంద్రు ఫౌండేషన్ ఆధ్వర్యంలో గేట్ కారేపల్లి మండల పరిషత్ ప్రాథమిక పాఠశాల (ఎంపీపీఎస్) విద్యార్థులకు ఒక జత క్రీడా దుస్తులను అందజేశారు. ఈ కార్యక్రమంలో సింగరేణి మండల విద్యాశాఖ అధికారి (ఎంఈవో) దుగ్గిరాల జయరాజు, స్థానిక గేట్ కారేపల్లి సర్పంచ్ పూసం ఎలయ్య ముఖ్య అతిథులుగా పాల్గొని పాఠశాల ప్రధానోపాధ్యాయురాలు రాధాకు క్రీడా దుస్తులను అందించారు.
ఈ సందర్భంగా ఎంఈవో దుగ్గిరాల జయరాజు మాట్లాడుతూ, ప్రభుత్వ పాఠశాలల అభివృద్ధికి స్వచ్ఛంద సంస్థలు ముందుకు రావడం అభినందనీయమన్నారు. విద్యార్థులకు విద్యతో పాటు క్రీడలు కూడా ఎంతో అవసరమని, క్రీడల ద్వారా క్రమశిక్షణ, నాయకత్వ లక్షణాలు, ఆరోగ్యకరమైన జీవన విధానం అలవడుతాయని పేర్కొన్నారు. చంద్రు ఫౌండేషన్ విద్యార్థుల సంక్షేమం కోసం నిరంతరం నిర్వహిస్తున్న సేవా కార్యక్రమాలు సమాజానికి ఆదర్శంగా నిలుస్తున్నాయని కొనియాడారు. ప్రతి ఒక్కరూ తమ వంతు సామాజిక బాధ్యతగా ప్రభుత్వ పాఠశాలలకు అండగా నిలవాలని పిలుపునిచ్చారు.
స్థానిక సర్పంచ్ పూసం ఎలయ్య మాట్లాడుతూ, గ్రామంలోని ప్రభుత్వ పాఠశాల అభివృద్ధికి సహకరిస్తున్న చంద్రు ఫౌండేషన్ సభ్యులను ప్రత్యేకంగా అభినందించారు. గ్రామీణ ప్రాంత విద్యార్థులకు అవసరమైన సౌకర్యాలు కల్పించేందుకు ఇలాంటి సేవా కార్యక్రమాలు ఎంతో ఉపయోగపడతాయని, భవిష్యత్తులో కూడా ఫౌండేషన్ మరిన్ని సేవా కార్యక్రమాలు చేపట్టాలని ఆకాంక్షించారు.
చంద్రు ఫౌండేషన్ చైర్మన్ భూక్యా వీరన్న మాట్లాడుతూ, విద్యార్థుల సమగ్ర అభివృద్ధే తమ ఫౌండేషన్ ప్రధాన లక్ష్యమని తెలిపారు. విద్య, క్రీడలు, ఆరోగ్యం వంటి రంగాల్లో సేవా కార్యక్రమాలను మరింత విస్తరించి, ప్రభుత్వ పాఠశాలలకు అవసరమైన సహాయ సహకారాలు అందిస్తామని చెప్పారు.
ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయులు చిరంజీవి, శంకర్, గేట్ కారేపల్లి జెడ్పీహెచ్‌ఎస్ ప్రధానోపాధ్యాయులు లక్ష్మీ ఆనంద్, చంద్రు ఫౌండేషన్ సభ్యులు రవి, వినోద్, రమేష్, విద్యార్థుల తల్లిదండ్రులు, గ్రామ పెద్దలు, గ్రామస్తులు పాల్గొన్నారు. కార్యక్రమం అనంతరం ఫౌండేషన్ ప్రతినిధులకు పాఠశాల సిబ్బంది కృతజ్ఞతలు తెలిపారు.

Tags:

About The Author

Latest News