- District News
- మద్దూరు మున్సిపాలిటీ, తహసీల్దార్, ఎంపీడీవో కార్యాలయాల ఆకస్మిక తనిఖీ చేసిన కలెక్టర్
మద్దూరు మున్సిపాలిటీ, తహసీల్దార్, ఎంపీడీవో కార్యాలయాల ఆకస్మిక తనిఖీ చేసిన కలెక్టర్
నారాయణపేట ఆగస్టు 27:
మద్దూరు మున్సిపాలిటీ, తహసీల్దార్, ఎంపీడీవో కార్యాలయాలను గురువా రం జిల్లా కలెక్టర్ ప్రియాంక ఆకస్మికంగా తనిఖీ చేశారు. కార్యాలయాల్లో ప్రజలకు అందుతున్న సేవలు, రికార్డుల నిర్వహణ, సంక్షేమ పథకాల అమలు తీరును ఆమె పరిశీలించారు.
ముందుగా మున్సిపాలిటీ కార్యాలయాన్ని సందర్శించిన కలెక్టర్ కార్యాలయంలోని సిబ్బంది క్యాడర్ స్ట్రెంగ్త్, ఖాళీలు తదితర వివరాలను అడిగి తెలుసుకున్నారు. మున్సిపాలిటీ పరిధిలోని వార్డుల వారీగా ఇప్పటివరకు వచ్చిన ఆసరా పింఛన్లు, ఒంటరి మహిళా పింఛన్ల దరఖాస్తుల వివరాలను పరిశీలించారు. వచ్చిన దరఖాస్తులను ఆన్‌లైన్‌లో నమోదు చేస్తున్నారా లేదా అని ఆపరేటర్‌ను అడిగి తెలుసుకున్నారు.
మున్సిపాలిటీకి సంబంధించిన ఆస్తి పన్ను వసూలు లక్ష్యం, ఇప్పటివరకు సాధించిన ప్రగతి, ఇతర ఆదాయ వనరులపై కమిషనర్‌ను వివరాలు అడిగి తెలుసుకున్నారు. కార్యాలయంలోని వివిధ రికార్డులను క్షుణ్ణంగా పరిశీలించి, రికార్డులను ఎప్పటికప్పుడు సక్రమంగా నిర్వహించాలని సూచించారు.
తహసీల్దార్ కార్యాలయంలో....
అనంతరం తహసీల్దార్ కార్యాలయాన్ని తనిఖీ చేసిన కలెక్టర్, భూముల రిజిస్ట్రేషన్ ప్రక్రియను పరిశీలించారు. రోజువారీగా ఎన్ని రిజిస్ట్రేషన్లు జరుగుతున్నాయి, ఏ రోజైనా రిజిస్ట్రేషన్లు నిలిచిపోతున్నాయా అనే వివరాలను అధికారులను అడిగి తెలుసుకున్నారు. ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా రిజిస్ట్రేషన్ ప్రక్రియను ఆలస్యం చేయకుండా సకాలంలో పూర్తి చేయాలని ఆదేశించారు.
ఎంపీడీవో కార్యాలయంలో...
ఎంపీడీవో కార్యాలయంలో ఉపాధి హామీ పనుల అమలు, జలసిరి, మస్టర్ నిర్వహణ తదితర అంశాలపై కలెక్టర్ సమీక్షించారు. వీబీజీ రామ్‌జీ అమలులోకి వచ్చిన తర్వాత ఉపాధి హామీ పనుల్లో వచ్చిన మార్పులు, పురోగతిని అడిగి తెలుసుకున్నారు. చెక్‌డ్యామ్‌ల నిర్మాణాలు, బుష్ క్లియరెన్స్, మెటీరియల్ కాంపోనెంట్ పనులు, గ్రామ పంచాయతీల్లో చేపట్టిన సెల్ఫ్ వర్క్ తదితర వివరాలను అధికారులను అడిగి తెలుసుకున్నారు.
బాలికల పాఠశాల, అంగన్‌వాడీ కేంద్రం సందర్శన...
మద్దూరులోని బాలికల ప్రాథమికోన్నత పాఠశాలను కలెక్టర్ సందర్శించి విద్యార్థుల సంఖ్య, హాజరు వివరాలను తెలుసుకున్నారు. హాజరు రిజిస్టర్‌ను పరిశీలించీ ఉన్న 6 మంది ఉపాధ్యాయుల్లో ఒకేరోజు ముగ్గురు ఉపాధ్యాయులు హెచ్ ఎం తో సహా సెలవు పెట్టడంపై కలెక్టర్ ఒకింత అసహనం వ్యక్తం చేశారు. ఒకేసారి విద్యార్థులతో ముచ్చటించారు. విద్యార్థుల చదువు, పాఠశాలలో అందుతున్న సౌకర్యాలపై వివరాలు అడిగి తెలుసుకున్నారు.
అనంతరం పక్కనే ఉన్న అంగన్‌వాడీ కేంద్రాన్ని సందర్శించి చిన్నారుల సంఖ్య, కేంద్రం నిర్వహణ, సమయపాలన, ప్రతిరోజూ పిల్లలకు అందిస్తున్న పౌష్టికాహారం తదితర వివరాలను అడిగి తెలుసుకున్నారు. కేంద్రంలో టీచర్ లేకపోవడంపై విచారణ చేసి, అవసరమైన చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు.
ప్రభుత్వ కార్యాలయాల్లో సిబ్బంది సమయపాలన పాటిస్తూ, ప్రజలకు పారదర్శకంగా, వేగవంతంగా సేవలు అందించాలని జిల్లా కలెక్టర్ ప్రియాంక సూచించారు. ఈ కార్యక్రమంలో మద్దూరు మున్సిపల్ చైర్ పర్సన్ సరస్వతీ, కమిషనర్ శ్రీకాంత్, తహశీల్దార్ మహేష్, ఎంపీడీవో భార్గవ్ పాల్గొన్నారు.
ఫోటో రైట్ అప్:3.తనిఖీ చేస్తున్న కలెక్టర్
--------------------------------------
