- District News
- Nalgonda
- ఎల్‌నినో ప్రభావం కారణంగా తాగునీటి సమస్య రాకుండా చర్యలు తీసుకోవాలి.
ఎల్‌నినో ప్రభావం కారణంగా తాగునీటి సమస్య రాకుండా చర్యలు తీసుకోవాలి.
పంచాయతీ కార్యదర్శులు ప్రజలకు అందుబాటులో ఉండాలి. నిర్లక్ష్యం చేస్తే కఠిన చర్యలు తీసుకుంటాం-
నల్లగొండ ఉమ్మడి జిల్లా ప్రతినిధి . లోకల్ గైడ్ .
జిల్లా కలెక్టర్ కలెక్టర్ కార్యాలయం నుండి ఎంపీడీవోలు, ఎంపీఓలతో వివిధ అంశాలపై బుధవారం వీడియో కాన్ఫెరెన్సు నిర్వహించారు.ఎంపీడీవో, ఎంపీఓ, గ్రామ పంచాయతీ కార్యదర్శులు క్షేత్రస్థాయిలో విస్తృతంగా పర్యటించి ప్రజల సమస్యలను తెలుసుకుని వెంటనే పరిష్కరించాలని ఆదేశించారు.గ్రామాల్లో పారిశుద్ధ్యం, తాగునీటి సరఫరా, వాటర్ వర్క్స్‌ను నిరంతరం పరిశీలిస్తూ సీజనల్ వ్యాధులు ప్రబలకుండా ప్రత్యేక దృష్టి సారించాలని చెప్పారు.గ్రామ పంచాయతీ కార్యదర్శులు ప్రతిరోజూ సమయపాలన పాటిస్తూ విధులకు హాజరై, గ్రామాల్లో పర్యటిస్తూ ప్రజలకు అందుబాటులో ఉండాలని ,
కార్యాలయాలకు పరిమితం కాకుండా క్షేత్రస్థాయిలో సమస్యలను గుర్తించి పరిష్కరించాలని, విధుల పట్ల నిర్లక్ష్యం వహించే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.చేయూత పింఛన్లకు సంబంధించి వికలాంగులు, వితంతువులు, ఒంటరి మహిళలు తదితర అర్హుల వివరాలను క్షేత్రస్థాయిలో పరిశీలించాలని ఆదేశించారు.అర్హులకు పింఛన్లు అందుతున్నాయో లేదో అన్న విషయాన్ని గ్రామాల్లో విచారించి వివరాలను తన దృష్టికి తీసుకురావాలని సూచించారు. వి.బి.జి. రాంజీ కింద చేపడుతున్న పనుల్లో ప్రతిరోజూ కూలీల సంఖ్యపై నివేదిక సమర్పించాలని ,ఎల్‌నినో ప్రభావంతో వ్యవసాయ పనులు తగ్గే అవకాశం ఉన్నందున రైతు కుటుంబాలకు ఉపాధి కల్పించేలా విబిజి రాంజీ పనులను విస్తృతంగా చేపట్టాలని,ప్రతి ఫీల్డ్ అసిస్టెంట్ క్షేత్రస్థాయికి వెళ్లి కూలీలను సమీకరించాలని, కూలీల సంఖ్య తక్కువగా ఉన్న ప్రాంతాల్లో ఎంపీడీవోలు ప్రత్యేకంగా దృష్టి పెట్టాలని సూచించారు.ఎల్ నినో కారణంగా ప్రజలకు తాగునీటి సమస్యలు రాకుండా చూడాలని, గ్రామాల్లోని బోర్లు, నీటి సరఫరా వ్యవస్థలను గ్రామీణ తాగునీటి సరఫరా అధికారులు స్వయంగా పరిశీలించాలని, పనిచేయని బోర్లు, నీటి సరఫరాలో ఉన్న సమస్యలను వెంటనే పరిష్కరించాలని కలెక్టర్ ఆదేశించారు. ఈ అంశాన్ని అత్యంత సీరియస్‌గా తీసుకుని పనిచేయాలని చెప్పారు. ఇందిరమ్మ ఇండ్ల ఫోటో క్యాప్షన్ కానివి వెంటనే ఫోటో క్యాప్షన్ చేయాలని, పెండింగ్లో ఉన్న ఇండ్ల నిర్మాణాన్ని త్వరగా పూర్తి చేయాలని తెలిపారు. త్వరలో జరగనున్న గణేష్ నవరాత్రి ఉత్సవాలకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా గ్రామాల్లో పారిశుద్ధ్యం, తాగునీరు, ఇతర మౌలిక సదుపాయాలపై ముందస్తు చర్యలు చేపట్టాలని అధికారులను ఆదేశించారు. ప్రభుత్వ పాఠశాలల్లో నిర్మాణంలో ఉన్న మూత్రశాలలు, ఇతర భవన నిర్మాణ పనులను త్వరితగతిన పూర్తి చేయాలని కలెక్టర్ చెప్పారు. పెండింగ్‌లో ఉన్న పనులకు సంబంధించి సంబంధిత శాఖలతో సమన్వయం చేసుకుని వెంటనే శాంక్షన్ ప్రక్రియ పూర్తి చేసి పనులను ప్రారంభించాలని ఆదేశించారు. ఈ వీడియో కాన్ఫరెన్స్ కు స్థానిక సంస్థల ఇంచార్జ్ అదనపు కలెక్టర్ ప్రేమ్ కరణ్ రెడ్డి, జిల్లా గ్రామీణ అభివృద్ధి అధికారి శేఖర్ రెడ్డి, డిపిఓ తరుణ్ చక్రవర్తి, ఎంపీడీవోలు, ఎంపీ ఓలు హాజరయ్యారు.
