- District News
- రాజీవ్ గృహకల్పలో ఆక్రమమాల తొలగింపు: జేసీబీలతో కూల్చివేసిన మున్సిపల్ సిబ్బంది
రాజీవ్ గృహకల్పలో ఆక్రమమాల తొలగింపు: జేసీబీలతో కూల్చివేసిన మున్సిపల్ సిబ్బంది
వికారాబాద్ జిల్లా కేంద్రంలోని రాజీవ్ గృహకల్ప కాలనీలో రహదారిని ఆక్రమించి అక్రమంగా నిర్మించిన నిర్మాణాలపై మున్సిపల్ అధికారులు ఉక్కుపాదం మోపారు. ప్రజల రాకపోకలకు తీవ్ర విఘాతం కలిగిస్తున్న బాత్‌రూమ్‌లు, ప్రహరీ గోడలను మున్సిపల్ సిబ్బంది జేసీబీ యంత్రాల సహాయంతో గురువారం తొలగించారు.
కాలనీలోని ప్రధాన రహదారిపై కొంతమంది నివాసితులు ఆక్రమణలకు పాల్పడి ప్రహరీ గోడలు, బాత్‌రూమ్‌లను నిర్మించుకోవడంతో రోడ్డు ఇరుకుగా మారి కాలనీవాసులు, వాహనదారులు నిత్యం తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. దీనిపై కాలనీవాసుల నుండి అందిన ఫిర్యాదుల మేరకు స్పందించిన మున్సిపల్ అధికారులు స్థలాన్ని పరిశీలించి ఆక్రమణలను గుర్తించారు.
ఈ నేపథ్యంలో మున్సిపల్ సిబ్బంది జేసీబీలతో ఘటనా స్థలానికి చేరుకుని అక్రమ నిర్మాణాలను నేలమట్టం చేశారు. రహదారి ఆక్రమణలను పూర్తిగా తొలగించి, మార్గాన్ని సుగమం చేయడంతో స్థానిక ప్రజలు హర్షం వ్యక్తం చేశారు.
ఈ సందర్భంగా మున్సిపల్ అధికారులు మాట్లాడుతూ... "ప్రజా ప్రతినిధులు, ప్రజలు సౌకర్యార్థం కేటాయించిన రోడ్లను ఆక్రమిస్తే కఠిన చర్యలు తప్పవు. భవిష్యత్తులో కూడా కాలనీల్లో ఆక్రమణలకు పాల్పడితే ముందస్తు నోటీసులు లేకుండానే తొలగిస్తాం. సజావుగా రాకపోకలు సాగించేందుకు ప్రజాలందరూ సహకరించాలి" అని హెచ్చరించారు.
