- District News
- వికారాబాద్ జిల్లా లైబ్రరీ పార్కులో స్వచ్ఛంద సేవ..
వికారాబాద్ జిల్లా లైబ్రరీ పార్కులో స్వచ్ఛంద సేవ..
వివేకానంద విగ్రహం వెనుక పేరుకుపోయిన చెత్త!
వికారాబాద్ జిల్లా కేంద్రంలోని గ్రంథాలయం (లైబ్రరీ), జిల్లా పరిషత్, ఎంపీడీవో కార్యాలయం మరియు వ్యవసాయ శాఖ కార్యాలయం ఎదురుగా ఉన్న పార్కులో స్వచ్ఛంద సేవ పేరిట జరుగుతున్న హడావుడి కేవలం ఫొటోలు, సోషల్
మీడియా ప్రచారానికే పరిమితమవుతోందనే విమర్శలు వ్యక్తమవుతున్నాయి.
పార్కులోని స్వామి వివేకానంద విగ్రహం ముందు భాగాన్ని మాత్రమే ఊడ్చి శుభ్రం చేసినట్లు కొందరు నిర్వాహకులు ఫొటోలకు ఫోజులిస్తున్నారు. కానీ విగ్రహం వెనుక భాగంలో భారీగా పేరుకుపోయిన చెత్తాచెదారాన్ని మాత్రం అలాగే వదిలేస్తున్నారు. ముందు భాగం శుభ్రంగా కనిపిస్తే చాలు అన్నట్లుగా వ్యవహరిస్తూ, వెనుక ఉన్న వ్యర్థాలను పట్టించుకోకపోవడం వారి బాధ్యతారాహిత్యానికి అద్దం పడుతోంది.
సమాజానికి మార్గదర్శిగా నిలిచిన స్వామి వివేకానందుని విగ్రహ ప్రాంగణంలోనే ఇలాంటి "పబ్లిసిటీ చేయడంపై స్థానికులు, పాఠకులు తీవ్ర అసహనం వ్యక్తం చేస్తున్నారు. కేవలం పబ్లిసిటీ కోసం చేసే ఇటువంటి కార్యక్రమాల వల్ల పారిశుధ్య సమస్య తీరకపోగా, పార్కు అందాలు పూర్తిగా దెబ్బతింటున్నాయని ఆవేదన చెందుతున్నారు.
విష సర్పాల భయంతో విద్యార్థులు!పార్కులో చెత్తాచెదారం, పొదలు పెరిగిపోవడంతో విషసర్పాలు సంచరించే ప్రమాదం ఏర్పడింది. లైబ్రరీకి వచ్చే విద్యార్థులు, పౌరులు పార్కులో కూర్చోవాలంటేనే భయాందోళనకు గురవుతున్నారు.
అధికారులు తక్షణమే స్పందించాలి:
కేవలం ఫొటోల కోసం కాకుండా నిజమైన సామాజిక బాధ్యతతో పనిచేయాలని స్థానికులు కోరుతున్నారు. ఇప్పటికైనా జిల్లా మున్సిపల్ అధికారులు, సంబంధిత శాఖల వారు తక్షణమే స్పందించి, పార్కులోని చెత్తను పూర్తిగా తొలగించి, ప్రాంగణాన్ని నిరంతరం పరిశుభ్రంగా ఉంచేలా చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేస్తున్నారు.
