- District News
- Nalgonda
- నల్లగొండ జిల్లా పోలీస్ కార్యాలయంలో ఘనంగా బతుకమ్మ సంబరాలు.
నల్లగొండ జిల్లా పోలీస్ కార్యాలయంలో ఘనంగా బతుకమ్మ సంబరాలు.
మహిళల సాంస్కృతిక వైభవానికి ప్రతీక బతుకమ్మ .
నల్లగొండ జిల్లా పోలీస్ కార్యాలయంలో తెలంగాణ
సంస్కృతి, సంప్రదాయాలకు ప్రతీకగా నిలిచే బతుకమ్మ సంబరాలను ఘనంగా నిర్వహించారు. ఈ వేడుకల్లో జిల్లా ఎస్పీ శరత్ చంద్ర పవార్ ఆయన సతీమణి పూజా పవార్, పోలీస్ కుటుంబ సభ్యులు, మహిళా పోలీస్ సిబ్బంది, ఇతర అధికారులు, సిబ్బంది ఉత్సాహంగా పాల్గొన్నారు. రంగురంగుల పూలతో అందంగా అలంకరించిన బతుకమ్మల చుట్టూ మహిళలు సంప్రదాయబద్ధంగా ఆడిపాడుతూ పండుగ సందడిని నింపారు. తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాలు ఉట్టిపడేలా పాటలు పాడుతూ, నృత్యాలు చేస్తూ బతుకమ్మ వేడుకలను ఆనందోత్సాహాల మధ్య జరుపుకున్నారు.ఈ సందర్భంగా జిల్లా ఎస్పీ శరత్ చంద్ర పవార్ ఐపీఎస్ మాట్లాడుతూ బతుకమ్మ పండుగ తెలంగాణ ఆడపడుచుల ఆత్మగౌరవానికి, మన సంస్కృతి, సంప్రదాయాలకు ప్రతీక అని పేర్కొన్నారు.ప్రకృతిని ఆరాధిస్తూ, పూలను పూజిస్తూ, మహిళల ఐక్యతను చాటిచెప్పే గొప్ప పండుగ బతుకమ్మ అని తెలిపారు.తరతరాలుగా వస్తున్న తెలంగాణ సాంస్కృతిక వారసత్వాన్ని భావితరాలకు అందించడంలో ఇలాంటి పండుగలు కీలక పాత్ర పోషిస్తాయని అన్నారు.బతుకమ్మ పండుగ మహిళల మధ్య ఐక్యతను, ఆత్మీయతను, సోదరభావాన్ని పెంపొందిస్తుందని, కుటుంబ సభ్యులందరినీ ఒకచోట చేర్చి ఆనందాన్ని పంచుతుందని పేర్కొన్నారు. ప్రకృతిలో లభించే వివిధ రకాల పూలతో బతుకమ్మను పేర్చి, ప్రకృతిని పూజించడం మన తెలంగాణ సంప్రదాయంలోని విశిష్టత అని వివరించారు. తెలంగాణ రాష్ట్ర సంస్కృతి, సంప్రదాయాలు, కళలు, ఆచారాలను కాపాడుకుంటూ భవిష్యత్ తరాలకు అందించాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉందన్నారు.పోలీసు శాఖలో విధులు నిర్వహించే అధికారులు, సిబ్బంది ప్రజల భద్రత కోసం నిరంతరం శ్రమిస్తూ, అనేక సందర్భాల్లో పండుగలు, కుటుంబ వేడుకలకు దూరంగా ఉండాల్సి వస్తుందని తెలిపారు. పోలీసు సిబ్బంది కుటుంబ సభ్యుల త్యాగాలు, సహకారం ఎంతో విలువైనవని, వారి మద్దతుతోనే పోలీసులు మరింత అంకితభావంతో విధులు నిర్వహించగలుగుతున్నారని అన్నారు.పోలీసు కుటుంబ సభ్యులందరూ ఇలాంటి వేడుకల్లో కలిసిమెలిసి పాల్గొనడం ద్వారా పరస్పర ఆత్మీయత, ఐక్యత మరింత బలపడతాయని పేర్కొన్నారు.పండుగలు మన జీవితాల్లో సంతోషాన్ని నింపడమే కాకుండా, మన సంస్కృతి పట్ల గౌరవాన్ని పెంపొందిస్తాయని తెలిపారు. మహిళలు అన్ని రంగాల్లో ముందుకు సాగుతూ, సమాజ అభివృద్ధిలో కీలక పాత్ర పోషించాలని ఆకాంక్షించారు. జిల్లా ప్రజలందరికీ బతుకమ్మ పండుగ, దసరా పండుగ శుభాకాంక్షలు తెలియజేస్తూ, ప్రతి కుటుంబంలో సుఖసంతోషాలు, ఆయురారోగ్యాలు, శాంతి సౌభాగ్యాలు వెల్లివిరియాలని జిల్లా ఎస్పీ ఆకాంక్షించారు.జిల్లా పోలీస్ కార్యాలయంలో నిర్వహించిన ఈ బతుకమ్మ సంబరాలల్లో అడిషనల్ ఎస్పి రమేష్, ఎస్బి డిఎస్పీ మల్లా రెడ్డి, ఉమేన్ పోలీస్ స్టేషన్ సీఐ మంజుల,మహిళా ఎస్.ఐలు శ్రావణి, అమ్రీన్, మమత,సీఐ నాగరాజు, ఆర్. ఐ లు సంతోష్, సూరపు నాయుడు, కళ్యాణ్ రాజ్,మహిళా సిబ్బంది,పోలీసు కుటుంబ సభ్యుల మధ్య ఆనందోత్సాహాలను నింపగా, తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాల గొప్పతనాన్ని చాటిచెప్పాయి. సంప్రదాయబద్ధమైన పాటలు, ఆటలతో వేడుకలు ఉత్సాహంగా సాగాయి.
