- District News
- క్రైమ్ పార్టీ పోలీసులపై ఫిర్యాదు.. చర్యలేవి?
క్రైమ్ పార్టీ పోలీసులపై ఫిర్యాదు.. చర్యలేవి?
రూ.20 వివాదంలో మహిళపై దాడి చేశారన్న ఆరోపణలు పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు నమోదైనా ముందుకు సాగని విచారణ?
లోకల్ గైడ్/తాండూరు.
వికారాబాద్ జిల్లా తాండూరు పట్టణంలో ఇద్దరు క్రైమ్ విభాగానికి చెందిన పోలీసు సిబ్బందిపై గత రెండు రోజుల క్రితం నమోదైన ఫిర్యాదు వ్యవహారం చర్చనీయాంశంగా మారింది. రూ.20 వివాదంలో ఓ మహిళపై దాడి చేశారన్న ఆరోపణలతో సంబంధిత పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు నమోదైనప్పటికీ, ఇప్పటివరకు సంబంధిత పోలీసు సిబ్బందిపై ఎలాంటి శాఖాపరమైన చర్యలు తీసుకున్నారన్న దానిపై స్పష్టత లేకపోవడం పలు ప్రశ్నలకు తావిస్తోంది.
ఘటనకు సంబంధించి ఫిర్యాదు అందిన తర్వాత విచారణ ఏ దశలో ఉందనే విషయాన్ని పోలీసులు వెల్లడించలేదు. ఆరోపణలు ఎదుర్కొంటున్న పోలీసు సిబ్బందిని విచారించారా? శాఖాపరమైన చర్యలకు సిఫారసు చేశారా? లేక కేసు విచారణ ఇంకా కొనసాగుతోందా? అనే అంశాలపై అధికారిక సమాచారం బయటకు రాలేదు.
ఇదిలా ఉండగా, ఈ వ్యవహారాన్ని పై అధికారుల దృష్టికి వెళ్లకుండా రాజీ చేసేందుకు ప్రయత్నాలు జరిగాయన్న ప్రచారం స్థానికంగా చర్చకు దారితీసింది. ఫిర్యాదు నమోదైన కేసులో పారదర్శకంగా విచారణ జరిపి, వాస్తవాలను వెలికితీసి, తప్పు నిర్ధారణ అయితే సంబంధిత పోలీసు సిబ్బందిపై క్రమశిక్షణ చర్యలు తీసుకోవాలని స్థానికులు కోరుతున్నారు.
