- District News
- Ranga Reddy
- ప్రజల వద్దకే ఆమనగల్లు మున్సిపాలిటీ
ప్రజల వద్దకే ఆమనగల్లు మున్సిపాలిటీ
తండాల్లో పర్యటించి సమస్యలు తెలుసుకున్న చైర్మన్ పత్య నాయక్, వైస్ చైర్‌పర్సన్ గీతా ఆచారి
లోకల్ గైడ్
ఆమనగల్లు, ఆగస్టు 20:
ప్రజల సమస్యలను క్షేత్రస్థాయిలో తెలుసుకుని, వాటి పరిష్కారానికి తక్షణ చర్యలు చేపట్టే లక్ష్యంతో ఆమనగల్లు మున్సిపాలిటీ పాలకవర్గం తండాల బాట పట్టింది. మున్సిపల్ చైర్మన్ నేనావత్ పత్య నాయక్, వైస్ చైర్‌పర్సన్ తల్లోజు గీతా ఆచారి ఆధ్వర్యంలో మూడో వార్డు పరిధిలోని పలు తండాల్లో గురువారం పర్యటించారు.
మున్సిపాలిటీ మేనేజర్ ఆంజనేయులు, సిబ్బందితో కలిసి సాకీబండ ఎనకాడి తండా, వేములకుంట తండా, ఎర్రబిక్య తండా, కట్ట్యా తండా, ఊరబాయ్ తండా, నుచ్చుగుట్ట తండా ప్రాంతాల్లో పర్యటించిన పాలకవర్గం.. ఆయా తండాల ప్రజలను నేరుగా కలిసి స్థానిక సమస్యలను అడిగి తెలుసుకుంది.
తండాల్లో పర్యటించిన సందర్భంగా తాగునీరు, పారిశుద్ధ్యం, రహదారులు, డ్రైనేజీ, వీధి దీపాలు తదితర మౌలిక వసతులకు సంబంధించిన సమస్యలను స్థానికులు మున్సిపల్ పాలకవర్గం దృష్టికి తీసుకువచ్చారు. ప్రజలు తెలిపిన సమస్యలను క్షేత్రస్థాయిలో పరిశీలించిన చైర్మన్ పత్య నాయక్, వైస్ చైర్‌పర్సన్ గీతా ఆచారి.. సాధ్యమైన మేరకు వెంటనే పరిష్కరించేందుకు చర్యలు తీసుకోవాలని సంబంధిత సిబ్బందికి సూచించారు.
ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. ప్రజలు మున్సిపల్ కార్యాలయం చుట్టూ తిరగాల్సిన అవసరం లేకుండా, మున్సిపాలిటీ పాలకవర్గమే ప్రజల వద్దకు వెళ్లి సమస్యలను తెలుసుకునే విధానానికి ప్రాధాన్యత ఇస్తున్నామని తెలిపారు. ప్రతి వార్డులో ప్రజలకు అవసరమైన మౌలిక వసతులను మెరుగుపరిచేందుకు ప్రణాళికాబద్ధంగా చర్యలు చేపడతామని పేర్కొన్నారు.
ప్రజల నుంచి నేరుగా సమస్యలను తెలుసుకోవడం ద్వారా వాటి తీవ్రత, అవసరాన్ని అర్థం చేసుకుని ప్రాధాన్యత క్రమంలో పరిష్కరించేందుకు అవకాశం ఉంటుందని తెలిపారు. మున్సిపాలిటీ పరిధిలోని ప్రతి ప్రాంతం సమానంగా అభివృద్ధి చెందేలా కృషి చేస్తామని హామీ ఇచ్చారు.
ఈ పర్యటనలో నాగర్‌కర్నూల్ పార్లమెంట్
బీజేవైఎం
కో-కన్వీనర్ రవి రాథోడ్, ఆయా తండాల గ్రామ నాయకులు, తండావాసులు, మున్సిపాలిటీ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.
