పెద్దపల్లి, ఆగస్టు 7:(లోకల్ గైడ్ )
తెలంగాణ రాష్ట్ర సాధన ఉద్యమంలో ఆట, పాటలతో ప్రజలను చైతన్యపరిచిన కళాకారులకు ‘సాంస్కృతిక సారథి’లో ఉద్యోగ, ఉపాధి అవకాశాలు కల్పించాలని తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ (టీపీసీసీ) సాంస్కృతిక సేన పెద్దపల్లి జిల్లా కమిటీ విజ్ఞప్తి చేసింది. ఈ మేరకు పెద్దపల్లి ఎమ్మెల్యే చింతకుంట విజయరమణారావుకు శుక్రవారం వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా టీపీసీసీ సాంస్కృతిక సేన జిల్లా అధ్యక్షుడు పిట్టల రమేష్ రచించి ఆలపించిన ‘ *పెద్దపల్లి ముద్దుబిడ్డ మన విజన్న* ’ అనే పాటను ఎమ్మెల్యే విజయరమణారావు ఆవిష్కరించారు. అనంతరం కళాకారుల సమస్యలను ఎమ్మెల్యే దృష్టికి తీసుకువెళ్లిన పిట్టల రమేష్ మాట్లాడుతూ, తెలంగాణ మలిదశ ఉద్యమంలో గజ్జె కట్టి, పల్లెపల్లె తిరుగుతూ ధూం ధాం వేదికలపై ప్రదర్శనలు ఇచ్చి ప్రత్యేక రాష్ట్ర సాధన కోసం కళాకారులు విశేషంగా కృషి చేశారని గుర్తు చేశారు. గత బీఆర్ఎస్ ప్రభుత్వం ఏర్పాటు చేసిన సాంస్కృతిక సారథిలో కేవలం 550 మంది కళాకారులకు మాత్రమే ఉద్యోగాలు కల్పించి, వేలాది మంది ఉద్యమ కళాకారులను విస్మరించిందని ఆరోపించారు. ఈ అంశంపై పలుమార్లు ప్రభుత్వానికి వినతులు సమర్పించినప్పటికీ ఎలాంటి న్యాయం జరగలేదని, దీంతో గత 12 సంవత్సరాలుగా అనేక మంది కళాకారులు ఉపాధి లేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రస్తుతం ప్రజా ప్రభుత్వం అధికారంలో ఉన్న నేపథ్యంలో ఉద్యమ కళాకారులకు న్యాయం చేస్తూ సాంస్కృతిక సారథిలో ఉద్యోగ, ఉపాధి అవకాశాలను తక్షణమే కల్పించాలని ఎమ్మెల్యే ద్వారా ప్రభుత్వాన్ని కోరారు. ఈ కార్యక్రమంలో టీపీసీసీ సాంస్కృతిక సేన పెద్దపల్లి జిల్లా ప్రధాన కార్యదర్శి తూండ్ల రాజయ్య, గౌరవ అధ్యక్షుడు బుర్రగడ్డ రవి, దాసరి శ్రీనివాస్, పెనుగొండ ఎల్లయ్య, పూసల రమణాచారి, కన్నూరి రాజయ్య, పోలవేణి శ్రీనివాస్, తాండ్ర మహేష్ తదితర కళాకారులు పాల్గొన్నారు.