- District News
- Ranga Reddy
- హైదరాబాద్ కాటేదాన్ పరిధిలో హెచ్-ఫాస్ట్ అధికారులు అత్యంత ప్రమాదకరమైన రీతిలో నకిలీ, కల్తీ
హైదరాబాద్ కాటేదాన్ పరిధిలో హెచ్-ఫాస్ట్ అధికారులు అత్యంత ప్రమాదకరమైన రీతిలో నకిలీ, కల్తీ
మసాలా దినుసులను తయారు చేస్తున్న కంపెనీలపై దాడులు చేశారు.
రంగారెడ్డి జిల్లా బ్యూరో, ( లోకల్ గైడ్ ): హైదరాబాద్ కాటేదాన్ పరిధిలో హెచ్-ఫాస్ట్ అధికారులు అత్యంత ప్రమాదకరమైన రీతిలో నకిలీ, కల్తీ మసాలా దినుసులను తయారు చేస్తున్న కంపెనీలపై దాడులు చేశారు. కల్తీ పదార్థాలను తయారుచేసి వివిధ ప్రాంతాలకు అక్రమంగా విక్రయిస్తున్న ముఠా గుట్టును రట్టు చేసీ పట్టుకున్నారు. హెచ్ ఫాస్ట్ అధికారులు భారీ ఆపరేషన్ నిర్వహించారు. ఈ దాడుల్లో అధికారులు 25 టన్నుల నకిలీ మసాలా దినుసులతో పాటు తయారీకి సిద్ధంగా ఉంచిన మరో 89 టన్నుల కల్తీ నిల్వలను స్వాధీనం చేసుకున్నారు. విచారణలో దిగ్భ్రాంతికరమైన విషయాలు వెలుగులోకి వచ్చాయి. నిత్యం మనం వాడే జీలకర్ర, లవంగాలు, షాజీరా, ఆవాలు, మెంతులు, సోంపు, చిన్న ఆవాలను ఈ ముఠా రసాయనాలతో కల్తీ చేస్తోంది. ముఖ్యంగా బట్టలకు రంగులు అద్దేందుకు వాడే అత్యంత ప్రమాదకరమైన ఫ్యాబ్రిక్ డై లను ఈ మసాలాల తయారీకి ఉపయోగిస్తున్నట్లు అధికారులు గుర్తించారు. లవంగాల నుంచి నూనె తీసేసిన తర్వాత మిగిలే నాసిరకం చెత్తను సేకరించి దానికి హానికర కేమికల్స్ కలిపి ప్రాసెస్ చేస్తున్నారు. అనంతరం వాటిపై ప్రముఖ బ్రాండెడ్ ముద్రలు వేసి మార్కెట్లో విక్రయిస్తున్నారు. ఈ కల్తీ ప్రాసెసింగ్ కోసం ఇండోర్ నుంచి ప్రత్యేకమైన యంత్రాలు, పరికరాలను తెప్పించి మరీ వ్యాపారం సాగిస్తున్నట్లు తేలింది. తక్కువ ధరలకే లభిస్తున్నాయనే ఆశతో స్థానిక మార్కెట్ల ద్వారా వీటిని విక్రయిస్తూ ప్రజారోగ్యంతో చెలగాటమాడుతున్న ఈ ముఠాపై అధికారులు తీవ్ర స్థాయిలో చర్యలకు ఉపక్రమించారు. ఈ దాడుల వివరాలను హైదరాబాద్ సీపీ సజ్జనార్ వెల్లడిస్తూ ప్రజల నుంచి వచ్చిన సమాచారం ఆధారంగా 13 మసాలా వ్యాపార సంస్థల్లో సోదాలు నిర్వహించినట్లు* తెలిపారు. వాము, జీలకర్ర, లవంగం, షాజీరా, ఆవాలు వంటి నిత్యం వాడే మసాలాలకు రంగు మెరుపు తీసుకురావడానికి ఇండస్ట్రియల్ ఫ్యాబ్రిక్ డైలు, సింథటిక్ కలర్స్, టాల్కమ్ పౌడర్, రైస్ బ్రాన్ ఆయిల్స్, కొన్ని చోట్ల ఏకంగా హెయిర్ కలర్ కూడా ఉపయోగిస్తున్నారని సీపీ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఇటువంటి కేమికల్ కల్తీ ఆహారం తీసుకోవడం వల్ల ప్రజలకు కాలేయం, మూత్రపిండాల సమస్యలతో పాటు క్యాన్సర్, జీర్ణకోశ వ్యాధులు, తీవ్రమైన అలర్జీలు వచ్చే ప్రమాదం ఉందని హెచ్చరించారు. స్వాధీనం చేసుకున్న నమూనాలను ల్యాబ్ పరీక్షలకు పంపామని, ఆహార భద్రతా చట్టం కింద కల్తీదారులపై అత్యంత కఠిన చర్యలు తీసుకుంటామని సీపీ స్పష్టం చేశారు. హెచ్-ఫాస్ట్ రూపుదిద్దుకున్న 140 రోజుల్లోనే ఇప్పటివరకు 659 ప్రాంతాల్లో దాడులు జరిపి, 202 ఎఫ్‌ఐఆర్‌లు నమోదు చేశామని, మొత్తం 246 టన్నుల కల్తీ ఆహారాన్ని స్వాధీనం చేసుకున్నామని వివరించారు. ప్రజలు ఎక్కడైనా అనుమానాస్పద ఆహార పదార్థాలు లేదా కల్తీ తయారీ కేంద్రాలను గమనిస్తే వెంటనే పోలీసులకు ఫిర్యాదు చేయాలని ఈ సందర్భంగా సీపీ కోరారు.
