- District News
- Ranga Reddy
- మహేశ్వరం పోలీస్ స్టేషన్‌లో వార్షిక తనిఖీ నిర్వహించిన మహేశ్వరం జోన్ డీసీపీ
మహేశ్వరం పోలీస్ స్టేషన్‌లో వార్షిక తనిఖీ నిర్వహించిన మహేశ్వరం జోన్ డీసీపీ
ఫుచర్ సిటీ పోలీస్ కమిషనర్ ఆదేశాల మేరకు డీసీపీ, మహేశ్వరం జోన్ డీసీపీ కే. నారాయణ రెడ్డి మంగళవారం మహేశ్వరం పోలీస్ స్టేషన్‌లో వార్షిక తనిఖీ నిర్వహించారు.
తనిఖీలో భాగంగా డీసీపీ పోలీస్ పరేడ్, సిబ్బంది టర్నౌట్‌ను పరిశీలించారు. అనంతరం పోలీస్ స్టేషన్ ఆవరణలో మొక్కను నాటారు. పోలీస్ స్టేషన్ ప్రాంగణంలో ఉన్న నేరాలకు సంబంధించిన, వదిలివేయబడిన వాహనాలను పరిశీలించారు. అలాగే కొత్తగా పునరుద్ధరించిన పురుషుల బ్యారక్‌ను పరిశీలించారు.
పోలీస్ స్టేషన్‌లోని శాంతిభద్రతల పరిస్థితి, నేర పరిస్థితి, పెండింగ్ దర్యాప్తులు, సి సి టి ఎన్ ఎస్ స్టేషన్ రికార్డులు, పెట్రోలింగ్, నిఘా, మహిళలు, పిల్లల భద్రత, రోడ్డు ప్రమాదాలు, ప్రజల ఫిర్యాదులు, వారెంట్లు, కోర్టు కేసులు స్టేషన్ పరిపాలన తదితర అంశాలను ఇన్స్పెక్టర్, ఏసీపీ లను అడిగి తెలుసుకొన్నారు.
అనంతరం స్టేషన్ ప్రాంగణం, రికార్డ్స్ రూమ్, మాల్ఖానా మరియు ఇతర సౌకర్యాలను పరిశీలించి, పోలీస్ సిబ్బందితో మాట్లాడారు. కేసులపై వేగంగా దర్యాప్తు పూర్తి చేసి పరిష్కరించడం, సమర్థవంతమైన పెట్రోలింగ్ నిర్వహించడం, నేరాల నివారణకు చర్యలు తీసుకోవడం, రికార్డులను సక్రమంగా నిర్వహించడం, క్రమశిక్షణ మరియు పరిశుభ్రత పాటించడం, ప్రజల ఫిర్యాదులను త్వరగా పరిష్కరించడం, ప్రజలకు మెరుగైన పోలీస్ సేవలు అందించడం వంటి అంశాలపై డీసీపీ సిబ్బందికి అవసరమైన సూచనలు ఇచ్చారు.
ప్రజలకు పోలీస్ సేవలు మరింత వేగంగా, సమర్థవంతంగా అందేలా వృత్తిపరమైన ప్రమాణాలను పాటిస్తూ, నేరాల నివారణ, ప్రజా భద్రతకు ప్రాధాన్యత ఇవ్వాలని డీసీపీ సూచించారు.
