- District News
- Khammam
- ఎస్‌ఐఆర్ ప్రక్రియకు గాదెపాడులో భారీ స్పందన
ఎస్‌ఐఆర్ ప్రక్రియకు గాదెపాడులో భారీ స్పందన
మిగిలిన ఓటర్లు వెంటనే ప్రక్రియ పూర్తి చేసుకోవాలి: సర్పంచ్ భూక్యా రంజిత్ కుమార్ విజ్ఞప్తి
గాదెపాడు గ్రామ పంచాయతీలో మంగళవారం ఎస్‌ఐఆర్ ప్రక్రియలో భాగంగా ఓటర్ల వివరాల నమోదు కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమానికి గ్రామ ఓటర్ల నుంచి విశేష స్పందన లభించింది. మొత్తం 260 మంది ఓటర్లు తమ కుల ధ్రువీకరణ పత్రాలను సమర్పించడంతో పాటు ఆన్‌లైన్‌లో ఫొటోలు నమోదు చేసుకున్నారు.
ఈ సందర్భంగా సర్పంచ్ భూక్యా రంజిత్ కుమార్ మాట్లాడుతూ, ఎస్‌ఐఆర్ ప్రక్రియలో అర్హత కలిగిన ప్రతి ఓటరు భాగస్వామ్యం కావడం ఎంతో అవసరమన్నారు. ఇప్పటికే పెద్ద సంఖ్యలో ఓటర్లు తమ ధ్రువీకరణ పత్రాలు సమర్పించి ప్రక్రియను పూర్తి చేసుకున్నారని తెలిపారు. ఇంకా ఎవరైనా ఓటర్లు ప్రక్రియలో పాల్గొనకుండా మిగిలి ఉంటే ఏమాత్రం నిర్లక్ష్యం చేయకుండా, ఈరోజు జరిగే కార్యక్రమానికి తప్పనిసరిగా హాజరై తమ కుల ధ్రువీకరణ పత్రాలను సమర్పించి ఆన్‌లైన్ నమోదు పూర్తి చేసుకోవాలని ఆయన విజ్ఞప్తి చేశారు.
ఒక్క ఓటరు కూడా ఈ ప్రక్రియలో మిగిలిపోకుండా చూడటమే లక్ష్యంగా గ్రామ పంచాయతీ తరఫున అవసరమైన సహకారం అందిస్తామని సర్పంచ్ స్పష్టం చేశారు. ఓటర్లు తమకు సంబంధించిన ధ్రువీకరణ పత్రాలను సకాలంలో అందజేసి అధికారులకు సహకరించాలని కోరారు. ప్రతి అర్హత కలిగిన ఓటరు వివరాలు సక్రమంగా నమోదు కావడం ద్వారా భవిష్యత్తులో ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా ఉంటాయని ఆయన పేర్కొన్నారు.
గ్రామ ప్రజల భాగస్వామ్యంతో ఎస్‌ఐఆర్ ప్రక్రియను విజయవంతంగా పూర్తి చేయాలని సర్పంచ్ పిలుపునిచ్చారు. అవకాశాన్ని సద్వినియోగం చేసుకుని మిగిలిన ప్రతి ఓటరు నేడు తప్పనిసరిగా హాజరై ప్రక్రియను పూర్తి చేసుకోవాలని మరోసారి విజ్ఞప్తి చేశారు.
ఈ కార్యక్రమంలో పిఆర్ఏఈ రాజశేఖర్ స్పెషల్ ఆఫీసర్‌గా, జీపీవో కె. శ్రీనివాస్, కోమట్లగూడెం కార్యదర్శి, ఉపసర్పంచ్ నన్నెబోయిన ఉపేందర్, గ్రామ పెద్దలు, ఓటర్లు తదితరులు పాల్గొన్నారు.
