- District News
- Ranga Reddy
- పాలిటెక్నిక్ విద్యను యథావిధిగా కొనసాగించాలి
పాలిటెక్నిక్ విద్యను యథావిధిగా కొనసాగించాలి
జి ఓ 97ను తక్షణమే రద్దు చేయాలి

తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం తీసుకొచ్చిన జీ ఒ .97 ద్వారా రాష్ట్రంలోని పాలిటెక్నిక్ విద్యా వ్యవస్థను స్కిల్ యూనివర్సిటీ పరిధిలోకి తీసుకువచ్చే చర్యలను నిరసిస్తూ, మాజీ ఎమ్మెల్యే అంజయ్య యాదవ్ సూచన మేరకు షాద్‌నగర్ నియోజకవర్గ బీఆర్ఎస్వీ ఆధ్వర్యంలో షాద్‌నగర్ పట్టణంలోని అంబేద్కర్ విగ్రహానికి వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా బీఆర్ఎస్వీ షాద్‌నగర్ నియోజకవర్గ అధ్యక్షులు శీలం శ్రీకాంత్ మాట్లాడుతూ.. పాలిటెక్నిక్ విద్య పేద, మధ్యతరగతి కుటుంబాలకు చెందిన వేలాది మంది విద్యార్థులకు సాంకేతిక విద్యను అందిస్తూ, డిప్లొమా అనంతరం ఉద్యోగ అవకాశాలతో పాటు ఈసెట్ బీటెక్ లో లేటరల్ ఎంట్రీకి అవకాశం కల్పిస్తోందన్నారు. పాలిటెక్నిక్ విద్యను స్కిల్ యూనివర్సిటీ పరిధిలోకి తీసుకురావడం వల్ల డిప్లొమా గుర్తింపు, ఈసెట్ ఎంట్రీ, ప్రభుత్వ ఉద్యోగాల్లో అర్హత, ఫీజు రీయింబర్స్‌మెంట్, స్కాలర్‌షిప్‌లు, పరీక్షా విధానం, సీట్లు, అధ్యాపకులు, మౌలిక వసతుల విషయంలో విద్యార్థుల్లో అనిశ్చితి నెలకొనే అవకాశం ఉందని ఆందోళన వ్యక్తం చేశారు. విద్యార్థుల భవిష్యత్తును ప్రభావితం చేసే ఇలాంటి కీలక నిర్ణయాలను ఏకపక్షంగా తీసుకోకుండా విద్యార్థులు, తల్లిదండ్రులు, అధ్యాపకులు, సాంకేతిక విద్యా నిపుణులతో విస్తృతంగా చర్చించిన అనంతరం నిర్ణయం తీసుకోవాలని డిమాండ్ చేశారు. విద్యార్థుల భవిష్యత్తును కాపాడేందుకు జీ ఓ 97ను తక్షణమే రద్దు చేసి, పాలిటెక్నిక్ కళాశాలలను ప్రస్తుత సాంకేతిక విద్యా వ్యవస్థలోనే యథావిధిగా కొనసాగించాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో సర్పంచ్ సోని శేఖర్, ఉప సర్పంచ్ ధీమ గణేష్, బీఆర్ఎస్వి నాయకులు తుప్పుడు నరసింహా, వడ్డె మహేష్, సంజు నాయక్, ప్రవీణ్, సత్యం, సతీష్, సాయితేజ, తేజ, శివ నాయక్, నవీన్, ఉదయ్, నగేష్, వరుణ్ తదితరులు పాల్గొన్నారు..
