- District News
- కొత్తగూడెం ప్రభుత్వ వైద్య కళాశాల పనులను వేగవంతం చేయాలి : కలెక్టర్ అంకిత్
కొత్తగూడెం ప్రభుత్వ వైద్య కళాశాల పనులను వేగవంతం చేయాలి : కలెక్టర్ అంకిత్
డిసెంబర్ నాటికి నిర్మాణ పనులు పూర్తి చేయాలి
పాల్వంచ : లోకల్ గైడ్ న్యూస్ :
పాల్వంచ మండలంలో నిర్మిస్తున్న కొత్తగూడెం ప్రభుత్వ వైద్య కళాశాల నిర్మాణ పనులను వేగవంతం చేసి, డిసెంబర్ నాటికి పూర్తయ్యేలా ప్రణాళికాబద్ధంగా చర్యలు చేపట్టాలని జిల్లా కలెక్టర్ అంకిత్ అధికారులను ఆదేశించారు. శుక్రవారం ఆయన వైద్య కళాశాల నిర్మాణ పనులను క్షేత్రస్థాయిలో పరిశీలించి పనుల పురోగతిని అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా బాయ్స్ హాస్టల్, గర్ల్స్ హాస్టల్, తరగతి గదులు, ప్రయోగశాలల భవనం తదితర నిర్మాణాలను పరిశీలించిన కలెక్టర్.. పనుల పురోగతిపై అధికారులను వివరాలు అడిగి తెలుసుకున్నారు. నిర్మాణ పనులను నిర్దేశిత ప్రమాణాల మేరకు నాణ్యతతో చేపట్టడంతో పాటు ఎలాంటి జాప్యం లేకుండా వేగవంతంగా పూర్తి చేయాలని సూచించారు. ప్రస్తుతం వైద్య కళాశాల ప్రధాన భవనాలు, హాస్టల్ భవనాలు, ఆసుపత్రి, తరగతి
గదులు, ప్రయోగశాలల భవనం తదితర పనులు కొనసాగుతున్నాయని అధికారులు వివరించారు. బాయ్స్, గర్ల్స్ హాస్టళ్ల నిర్మాణ పనులు దాదాపు తుది దశకు చేరుకున్నాయని, మిగిలిన పనులను వేగంగా పూర్తి చేస్తున్నట్లు తెలిపారు. వైద్య కళాశాల నిర్మాణానికి సంబంధించిన మ్యాప్‌ను పరిశీలించిన కలెక్టర్.. అంతర్గత రహదారులు, గ్రంథాలయం, తరగతి గదులు, ప్రయోగశాలలు, విద్యార్థుల వసతి తదితర మౌలిక సదుపాయాలపై అధికారులను అడిగి తెలుసుకున్నారు. విద్యార్థులకు అవసరమైన అన్ని సౌకర్యాలు అందుబాటులో ఉండేలా నిర్మాణ పనులు చేపట్టాలని సూచించారు. కొత్తగూడెం ప్రభుత్వ వైద్య కళాశాలలో ప్రతి సంవత్సరం 150 ఎంబీబీఎస్ సీట్లు అందుబాటులో ఉన్నట్లు అధికారులు తెలిపారు. ప్రస్తుతం నర్సింగ్ కళాశాలలో బోధన కొనసాగుతున్నట్లు వివరించారు. నర్సింగ్ విద్యార్థులకు అందుతున్న బోధన, వసతి, తరగతి గదులు, ప్రయోగశాలలు, తాగునీరు, ఇతర మౌలిక సదుపాయాలపై కలెక్టర్ ఆరా తీశారు. విద్యార్థులకు అవసరమైన అన్ని సదుపాయాలు అందుతున్నాయా, అదనంగా ఏవైనా వసతులు అవసరమా అనే అంశాలను తెలుసుకున్నారు. ఈ సందర్భంగా కలెక్టర్ అంకిత్ మాట్లాడుతూ ప్రభుత్వ వైద్య కళాశాల నిర్మాణం జిల్లాకు అత్యంత ప్రాధాన్యత కలిగిన ప్రాజెక్టు అని అన్నారు. నిర్మాణ పనులను వేగవంతం చేసి, ప్రతి పనికి నిర్దిష్ట కాలపరిమితిని నిర్ణయించుకుని ముందుకు సాగాలని సూచించారు. బాయ్స్, గర్ల్స్ హాస్టల్ నిర్మాణ పనులను నెల రోజుల్లోగా పూర్తి చేయాలని ఆదేశించారు. మిగిలిన నిర్మాణ పనులను కూడా డిసెంబర్ నాటికి పూర్తిచేసేలా ప్రణాళికాబద్ధంగా చర్యలు చేపట్టాలని స్పష్టం చేశారు. పనుల పురోగతిని నిరంతరం పర్యవేక్షిస్తూ, ఎదురయ్యే సమస్యలను ఎప్పటికప్పుడు పరిష్కరించాలని అధికారులను ఆదేశించారు. సుమారు 25 ఎకరాల విస్తీర్ణంలో నిర్మిస్తున్న ప్రభుత్వ వైద్య కళాశాలలో విద్యార్థులు, బోధనా సిబ్బంది, వైద్య సిబ్బందికి అవసరమైన అన్ని మౌలిక వసతులు అందుబాటులో ఉండేలా చర్యలు చేపట్టాలని కలెక్టర్ సూచించారు. నిర్మాణ పనుల్లో నాణ్యతా ప్రమాణాలను తప్పనిసరిగా పాటించాలని, భవిష్యత్ అవసరాలను దృష్టిలో ఉంచుకుని పనులు చేపట్టాలని స్పష్టం చేశారు. ఈ పరిశీలనలో సంబంధిత వైద్య, ఇంజినీరింగ్, నిర్మాణ శాఖల అధికారులు, నర్సింగ్ కళాశాల అధికారులు, నిర్మాణ సంస్థ ప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు.
