- District News
- Ranga Reddy
- పట్టభద్రుల ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ గెలుపుకు కృషి చేయాలి.
పట్టభద్రుల ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ గెలుపుకు కృషి చేయాలి.
మండల ఇన్చార్జి, సింగిల్ విండో చైర్మన్ శ్రీధర్ రెడ్డి .కాంగ్రెస్ శ్రేణులకు పిలుపు
జిల్లేడు చౌదరిగూడెం (లోకల్ గైడ్ )
రాబోయే పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థుల విజయానికి పార్టీ శ్రేణులు సమష్టిగా కృషి చేయాలని కాంగ్రెస్ నాయకులు పిలుపునిచ్చారు. ఈ మేరకు చౌదరిగూడ మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు జకారం శేఖర్ ఆధ్వర్యంలో పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల సన్నాహక సమావేశంతో పాటు పట్టభద్రుల నమోదు కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో మండల ఇన్చార్జి, సింగిల్ విండో చైర్మన్ శ్రీధర్ రెడ్డి, తాలూకా సమన్వయ కమిటీ సభ్యుడు, వ్యవసాయ మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ బాబర్ ఖాన్, రఘు నాయక్, ఇబ్రహీం, డైరెక్టర్ కరుణాకర్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ రాబోయే పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థులకు మద్దతు కూడగట్టేందుకు ప్రతి నాయకుడు, కార్యకర్త క్షేత్రస్థాయిలో పనిచేయాలని సూచించారు. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత నిరుద్యోగులకు ఉపాధి అవకాశాలు కల్పించేందుకు చర్యలు చేపట్టిందని, ఇప్పటివరకు 70 వేల ఉద్యోగాలను భర్తీ చేసినట్లు తెలిపారు. త్వరలో మరిన్ని ఉద్యోగ నియామకాలకు సంబంధించి ప్రకటనలు వెలువడనున్నాయని పేర్కొన్నారు. నిరుద్యోగుల సమస్యల పరిష్కారానికి ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలను పట్టభద్రులకు వివరించాలని సూచించారు.
ప్రభుత్వంపై ఆర్థిక భారం ఉన్నప్పటికీ ఉద్యోగుల సంక్షేమానికి ప్రాధాన్యమిస్తున్నామని సింగిల్ విండో చైర్మన్ శ్రీధర్ రెడ్డి తెలిపారు. పదవీ విరమణ చేసిన ఉద్యోగులకు సంబంధించిన బకాయిల చెల్లింపుల కోసం రూ.9 వేల కోట్లు వెచ్చించినట్లు వెల్లడించారు. ఉద్యోగ నియామకాలు, ఉద్యోగుల సంక్షేమానికి సంబంధించి ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాలను పట్టభద్రులకు వివరించాల్సిన బాధ్యత పార్టీ నాయకులు, కార్యకర్తలపై ఉందన్నారు. పట్టభద్రుల నమోదు కార్యక్రమాన్ని విస్తృతంగా చేపట్టి అర్హులైన ప్రతి ఒక్కరూ తమ పేర్లు నమోదు చేసుకునేలా కృషి చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో మండల మాజీ అధ్యక్షుడు రాజు, మహిళా అధ్యక్షురాలు రజిత, సర్పంచులు శ్వేత, చంద్రబాబు, రామచంద్రయ్య, నర్సింలు, శివ, పార్టీ నాయకులు నర్సింహా, బాలరాజు, రవి, ఆంజనేయులు, అమృత, దామోదర్తో పాటు పలువురు కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.
