శభాష్ వెంకన్న…
ఏఈ అత్యవసర సేవలకు అభినందనలు
విద్యుత్ సమస్యలకు వెంటనే పరిష్కారం
కారేపల్లి, మహా: విద్యుత్ సమస్యలకు వెంటనే పరిష్కారం చూపుతూ అత్యవసర సేవలను ప్రజలకు అందుబాటులో ఉండే విధంగా చొరవ చూపుతున్న విద్యుత్ శాఖ కారేపల్లి మండల ఏఈ వెంకన్న పలువురి అభినందనలు పొందుతున్నారు.. ప్రజాపాలన ప్రగతి ప్రణాళి క కార్యక్రమాల్లో భాగంగా ఇటీవల కారేపల్లి మండలంలో వైరా ఎమ్మెల్యే రాందాస్ నాయక్ నిర్వహించిన సభల్లో కూడా విద్యుత్ సమస్యల పట్ల అవగాహన కలిగి ఉండి సమస్యల పరిష్కారానికి ఏఈ చూపుతున్న చొరవ వినియోగదారులను సంతృప్తి పరచడమే కాకుండా ఎమ్మెల్యే కూడా అభినందనలు తెలిపిన సందర్భాలు ఉన్నాయి.. నెల రోజుల క్రితం అప్పా యిగూడెం పంచాయతీ పరిధిలోని వెంకట సాయి నగర్ లో ట్రాన్స్ఫార్మర్ సమస్య తలెత్తగా ఏఈ వెంకన్న స్పందించిన తీరు ఆ కాలనీవాసులను ఎంతగానో ఆకట్టుకుంది. రాత్రంతా పనిచేసి తెల్లవారుజాము వరకు ట్రాన్స్ఫార్మర్ బిగించిన తర్వాతనే ఇంటికి వెళ్లడం ఈ అధికారి అత్యవసర సేవలకు ఎంతటి ప్రాధాన్యతనిస్తున్నారో అర్థమవుతుంది. ఏఈ దృష్టికి వచ్చిన ప్రతి సమస్యపై వెంటనే స్పందిస్తూ విషయాన్ని పై అధికారుల దృష్టికి కూడా తీసుకెళ్తూ చేస్తున్న పనులు గత అధికారుల తీరు కంటే భిన్నంగానే కనిపిస్తున్నాయి. కారేపల్లి లోని శివాలయం వీధిలో మిడిల్ పోల్స్ లేక వైర్లు వేలాడబడి చాలా ఏళ్లుగా ఈ సమస్య ఆ ప్రాంతంలో ఇబ్బందిగానే ఉంది. గతంలో అనేకమార్లు గత అధికారులకు చెప్పినా చేస్తామని హామీలు ఇచ్చారు కానీ చేయలేకపోయారు. ఇక్కడి సమస్యను ఏఈ వెంకన్న దృష్టికి నాలుగు రోజుల క్రితం శివాలయం వీధివాసులు తీసుకెళ్లగా వెంటనే స్పందించిన ఏఈ ప్రమాదకరంగా ఉన్న పాత పోల్ ను తొలగించి దాని స్థానంలో కొత్త పోల్ వేయడంతో పాటు మరో మిడిల్ పోల్ కూడా గురువారం వేయించారు. ఈ పనులతో ఏళ్ల తరబడి పెండింగ్ లో ఉన్న సమస్య కు పరిష్కారం లభించింది. మండలంలో ఇలాంటి ఎన్నో పెండింగ్ సమస్యలకు పరిష్కారం చూపుతూ విద్యుత్ శాఖ ఏ ఈ వెంకన్న శభాష్ అనిపించుకుంటున్నాడు.
