ప్రత్యేక సమగ్ర ఓటరు జాబితా సవరణ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలి —

రంగారెడ్డి జిల్లా కలెక్టర్ సి.నారాయణ రెడ్డి.

ప్రత్యేక సమగ్ర ఓటరు జాబితా సవరణ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలి —

 

రంగారెడ్డి జిల్లా బ్యూరో, ( లోకల్ గైడ్ ):                    తెలంగాణ రాష్ట్ర ఎన్నికల సంఘం విడుదల చేసిన ప్రత్యేక సమగ్ర ఓటరు జాబితా సవరణ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని రంగారెడ్డి జిల్లా కలెక్టర్ సి. నారాయణ రెడ్డి సూచించారు. గురువారం రాత్రి షెడ్యూల్ అమలుపై రంగారెడ్డి జిల్లా కలెక్టర్ జిల్లాలోని అన్ని ఎన్నికల నమోదు అధికారులతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు.
ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ, ప్రజాస్వామ్య వ్యవస్థలో ఓటరు జాబితా అత్యంత కీలకమైందని, పారదర్శకంగా, ఖచ్చితత్వంతో, సమగ్రతతో ఓటరు జాబితా తయారు చేయడం ప్రతి ఎన్నికల అధికారుల బాధ్యత అని పేర్కొన్నారు. రాష్ట్ర ఎన్నికల సంఘం జారీ చేసిన మార్గదర్శకాలను కచ్చితంగా పాటిస్తూ  కార్యక్రమాన్ని సమర్థవంతంగా నిర్వహించాలని ఆదేశించారు.
జిల్లాలో ఎలెక్టర్ మ్యాపింగ్ ప్రక్రియను మరింత వేగవంతం చేయాలని, ప్రతి పోలింగ్ స్టేషన్ పరిధిలో ఇంటింటి సర్వే ద్వారా అర్హులైన ప్రతి ఓటరిని గుర్తించాలని సూచించారు. కొత్త ఓటర్ల నమోదు, చిరునామా మార్పులు, పేరు సవరణలు, మరణించిన లేదా ఇతర ప్రాంతాలకు మారిన ఓటర్ల తొలగింపు వంటి అంశాలలో ప్రత్యేక శ్రద్ధ వహించాలని తెలిపారు.
ఓటరు జాబితా సవరణలో ఎటువంటి పొరపాట్లు చోటుచేసుకోకుండా అధికారులు అత్యంత జాగ్రత్తగా వ్యవహరించాలని కలెక్టర్ స్పష్టం చేశారు. డూప్లికేట్ ఎంట్రీలు, తప్పుడు వివరాలు, అర్హత లేని పేర్లు జాబితాలో చేరకుండా తగిన పరిశీలన చర్యలు చేపట్టాలని సూచించారు. ప్రతి దరఖాస్తును సమగ్రంగా పరిశీలించి మాత్రమే ఆమోదించాలని ఆదేశించారు.
అదేవిధంగా, పోలింగ్ బూత్ స్థాయి అధికారులతో బి ఎల్ ఓ లు సమన్వయం పెంచుకుని, గ్రామాలు, కాలనీలు, అపార్ట్మెంట్లు, పట్టణ ప్రాంతాల్లో విస్తృత అవగాహన కార్యక్రమాలు నిర్వహించి అర్హులైన ప్రతి ఓటరును మ్యాప్ అయ్యే విధంగా చర్యలు తీసుకోవాలని తెలిపారు. ముఖ్యంగా యువ ఓటర్లు, మహిళలు, దివ్యాంగులు, వృద్ధులు పైన ప్రత్యేక దృష్టి పెట్టాలని సూచించారు.
ఓటర్లు, రాజకీయ పార్టీలు, ప్రజాప్రతినిధులు మరియు అన్ని వర్గాల ఎలెక్టర్లు ఈ ప్రత్యేక సమగ్ర ఓటరు జాబితా సవరణ కార్యక్రమంలో చురుకుగా పాల్గొని సహకరించాలని కలెక్టర్ విజ్ఞప్తి చేశారు. ఓటరు జాబితా పరిశుభ్రత, పారదర్శకత మరియు ప్రజాస్వామ్య బలోపేతానికి ప్రతి ఒక్కరూ తమ వంతు బాధ్యత నిర్వర్తించాలని కోరారు.
ఈ వీడియో కాన్ఫరెన్స్‌లో జిల్లా ఎన్నికల విభాగ అధికారులు, ఈ ఆర్ ఓ లు, ఏ ఈ ఆర్ ఓలు  సంబంధిత అధికారులు పాల్గొన్నారు.

Tags:

About The Author

Latest News