- District News
- విద్యా వ్యవస్థ అభివృద్ధిపై ప్రత్యేక దృష్టి
విద్యా వ్యవస్థ అభివృద్ధిపై ప్రత్యేక దృష్టి
జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్.
మంచిర్యాల జిల్లా ప్రతినిధి (లోకల్ గైడ్)
విద్యా వ్యవస్థను బలోపేతం చేస్తూ మరింత అభివృద్ధి చేసేందుకు ప్రభుత్వం ప్రత్యేక చర్యలు తీసుకుంటుందని జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్ అన్నారు.గురువారం కాసిపేట మండల కేంద్రంలోని కస్తూరిబా గాంధీ బాలికల విద్యాలయాన్ని సందర్శించి అదనపు గదుల నిర్మాణ పనులను పరిశీలించారు.ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతు ప్రభుత్వ పాఠశాలలను బలోపేతం చేసే చర్యలలో భాగంగా చేపడుతున్న అభివృద్ధి కార్యక్రమాలను వేగవంతం చేయాలని తెలిపారు.అదనంగా నిర్మిస్తున్న గదులు,భోజనశాల పనులను త్వరగా పూర్తి చేయాలని,వంటశాలలు,తరగతి గదులను పరిశీలించి విద్యార్థులకు కల్పిస్తున్న సౌకర్యాలపై వివరాలు అడిగి తెలుసుకున్నారు.విద్యార్థులకు నాణ్యమైన విద్యతో పాటు మెనూ ప్రకారం సకాలంలో పోషకాహారం అందించాలని,విద్యార్థుల ఆరోగ్యం పట్ల ప్రత్యేక శ్రద్ధ వహించాలని తెలిపారు.ఉపాధ్యాయులు,సిబ్బంది విధుల పట్ల సమయపాలన పాటించాలని,విద్యార్థుల గైర్హాజరును ప్రతిరోజు పర్యవేక్షిస్తు విద్యార్థులు ప్రతిరోజు క్రమం తప్పకుండా పాఠశాలకు హాజరయ్యేలా చర్యలు తీసుకోవాలని తెలిపారు.మండలంలోని పల్లంగూడ గ్రామంలో గ్రామపంచాయతీ కార్యాలయం,నూతనంగా నిర్మిస్తున్న విఓ భవనాల పనులను పరిశీలించారు.నిర్మాణ పనులను త్వరగా పూర్తి చేయాలని సంబంధిత అధికారులకు సూచించారు.గ్రామంలోని డంప్ కంపోస్ట్ పిట్ ను పరిశీలించి,వ్యర్థాల నిర్వహణను సమర్థవంతంగా చేపట్టాలని సూచించారు.ఉద్యానవన శాఖ ఆధ్వర్యంలో చేపడుతున్న శాశ్వత కూరగాయల పందిరి సాగును పరిశీలించి అధికారులకు పలు సూచనలు చేశారు.తాళ్లపల్లి మౌనిక యూనిట్‌లో చేపట్టిన ఈ సాగుకు యూనిట్ వ్యయం 2లక్షల 50వేల రూపాయలు కాగా ఉద్యానవన శాఖ ద్వారా 1లక్ష రూపాయల రాయితీ అందించనున్నట్లు తెలిపారు.రైతులు ఇలాంటి ఆధునిక సాగు పద్ధతులను వినియోగించుకుని అదనపు ఆదాయం పొందేలా ప్రోత్సహించాలని సూచించారు.గ్రామంలో నిర్మించిన ఇందిరమ్మ ఇల్లు,ప్రాథమిక పాఠశాల,అంగన్‌వాడీ కేంద్రం,పల్లె దవాఖాన,ఆయుష్మాన్ ఆరోగ్య కేంద్రాలను పరిశీలించారు.ప్రాథమిక పాఠశాలలో విద్యార్థుల విద్యా ప్రమాణాలు,హాజరు,బోధన విధానంపై వివరాలు తెలుసుకుని,విద్యార్థులకు నాణ్యమైన విద్య అందేలా చర్యలు తీసుకోవాలని తెలిపారు.అంగన్‌వాడీ కేంద్రం,ఆరోగ్య కేంద్రాల ద్వారా ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందించాలని,వైద్యులు,సిబ్బంది విధుల పట్ల సమయపాలన పాటించాలని,ప్రజలకు అందుబాటులో ఉంటు వైద్య సేవలు అందించాలని తెలిపారు.వర్షాకాలం దృష్ట్యా అవసరమైన మందులను అందుబాటులో ఉంచుకోవాలని,వ్యాధులు వ్యాప్తి చెందకుండా పాటించవలసిన జాగ్రత్తలను ప్రజలకు వివరించాలని తెలిపారు.అదేవిదంగా మండలంలోని రేకులగూడలో గల తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ గిరిజన సంక్షేమ శాఖ ఆధ్వర్యంలోని ప్రభుత్వ గిరిజన బాలుర ఆశ్రమ ఉన్నత పాఠశాలను సందర్శించారు.పాఠశాలలో అదనంగా నిర్మిస్తున్న గదులు,వంటశాలను పరిశీలించి నిర్మాణ పనుల పురోగతిపై వివరాలు తెలుసుకున్నారు.పాఠశాలలో విద్యార్థుల సంఖ్యను పెంచేందుకు అవసరమైన చర్యలు చేపట్టాలని అధికారులను ఆదేశించారు.విద్యార్థులకు మెరుగైన వసతులు,నాణ్యమైన విద్య అందేలా చర్యలు తీసుకోవాలని సూచించారు.ఈ కార్యక్రమంలోమండల పరిషత్ అభివృద్ధి అధికారి
సత్యనారాయణ సింగ్,మండల పంచాయతీ అధికారి సప్తర్ అలీ,సంబంధిత అధికారులు తదితరులు పాల్గొన్నారు.
