- District News
- పోలీస్–ప్రజల మధ్య బంధం బలోపేతమే ‘సహచరి’ లక్ష్యం
పోలీస్–ప్రజల మధ్య బంధం బలోపేతమే ‘సహచరి’ లక్ష్యం
మేడ్చల్ జిల్లా ప్రతినిధి, లోకల్ గైడ్, ఆగస్టు 8:-
పోలీస్–ప్రజల మధ్య పరస్పర అవగాహన, నమ్మకాన్ని పెంపొందించడమే ‘సహచరి’ కార్యక్రమం ప్రధాన ఉద్దేశమని డీసీపీ ట్రాఫిక్–I కె. రాహుల్‌రెడ్డి, ఐపీఎస్ అన్నారు. మల్కాజిగిరిలోని శుభం కన్వెన్షన్ హాల్‌లో నిర్వహించిన ‘సహచరి’ కార్యక్రమంలో ఆయన పాల్గొని ప్రజలకు భద్రత, పోలీస్ సేవలపై అవగాహన కల్పించారు.
ఈ సందర్భంగా పోలీస్‌స్టేషన్ పనితీరు, పోలీసుల విధులు, ప్రజలు పోలీసులను సంప్రదించే విధానం తదితర అంశాలను వివరించారు. సైబర్ నేరాల పట్ల అప్రమత్తంగా ఉండాలని, అనుమానాస్పద లింకులు, సందేశాలు, ఫోన్‌కాల్స్‌కు స్పందించవద్దని సూచించారు. ట్రాఫిక్ నిబంధనలు పాటించడం ద్వారా ప్రమాదాలను నివారించవచ్చని తెలిపారు.
సమాజ భద్రతలో ‘సహచరి’ సభ్యులు కీలక పాత్ర పోషించాలని సూచించారు. అత్యవసర పరిస్థితుల్లో పోలీసుల సహాయం కోసం డయల్–112, సైబర్ మోసాలకు గురైనప్పుడు ఫిర్యాదు చేసేందుకు 1930 హెల్ప్‌లైన్‌ను వినియోగించాలని అవగాహన కల్పించారు.
