- District News
- Khammam
- సాంకేతిక భారత నిర్మాణానికి బాటలు వేసిన మహానేత రాజీవ్ గాంధీ
సాంకేతిక భారత నిర్మాణానికి బాటలు వేసిన మహానేత రాజీవ్ గాంధీ
ఐటీ, టెలికమ్యూనికేషన్ రంగాల అభివృద్ధికి పునాదులు వేశారు
ఖమ్మం జిల్లా, కారేపల్లి : ఆగస్టు 20 (లోకల్ గైడ్) :
భారతరత్న, మాజీ ప్రధాని స్వర్గీయ రాజీవ్ గాంధీ జయంతి సందర్భంగా యువజన కాంగ్రెస్ మండల అధ్యక్షుడు గుగులోత్ హర్ష నాయక్ ఆయన చిత్రపటానికి పూలమాల వేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా రాజీవ్ గాంధీ దేశానికి అందించిన సేవలను స్మరించుకున్నారు.
హర్ష నాయక్ మాట్లాడుతూ భారతదేశంలో ఐటీ, టెలికమ్యూనికేషన్ రంగాల అభివృద్ధికి రాజీవ్ గాంధీ బలమైన పునాదులు వేశారని పేర్కొన్నారు. దేశాన్ని ఆధునిక సాంకేతికత వైపు నడిపించిన దార్శనిక నాయకుడిగా ఆయన చిరస్మరణీయుడని అన్నారు. టెలికమ్యూనికేషన్స్, వాణిజ్యం, రక్షణ, విమానయాన రంగాల్లో సంస్కరణలకు శ్రీకారం చుట్టి దేశ అభివృద్ధికి నూతన దిశానిర్దేశం చేశారని తెలిపారు.
విద్యావకాశాల్లో సమానత్వం కోసం జాతీయ విద్యా విధానానికి ప్రాధాన్యత కల్పించడంతో పాటు యువత, మహిళలు రాజకీయాల్లో మరింతగా భాగస్వాములు కావడానికి రాజీవ్ గాంధీ ప్రోత్సాహం అందించారని అన్నారు. పంచాయతీరాజ్ వ్యవస్థ ద్వారా అధికార వికేంద్రీకరణకు బలమైన పునాది వేసి, గ్రామీణ స్థాయిలో ప్రజాస్వామ్యాన్ని మరింత బలోపేతం చేసిన ఘనత ఆయనకే దక్కుతుందని పేర్కొన్నారు.
దేశాన్ని సాంకేతికంగా ముందుకు తీసుకెళ్లేందుకు రాజీవ్ గాంధీ వేసిన బాటలు నేటి ఆధునిక భారత అభివృద్ధిలో స్పష్టంగా కనిపిస్తున్నాయని హర్ష నాయక్ అన్నారు. ఆయన ఆశయాలను కొనసాగిస్తూ యువత దేశ నిర్మాణంలో చురుకైన పాత్ర పోషించాలని పిలుపునిచ్చారు. రాజీవ్ గాంధీ అమూల్య సేవలను స్మరించుకుంటూ ఆయనకు ఘన నివాళులు అర్పిస్తున్నట్లు తెలిపారు.
