- District News
- ధాన్యం కొనుగోలుపై కేంద్రాల ఇన్చార్జులకు శిక్షణ
ధాన్యం కొనుగోలుపై కేంద్రాల ఇన్చార్జులకు శిక్షణ
నాణ్యత ప్రమాణాలు పాటిస్తూ ధాన్యం కొనుగోలు చేయాలి : జీసీసీ డీఎం రామనందం
భద్రాచలం, లోకల్ గైడ్ న్యూస్ :
ధాన్యం కొనుగోలు కేంద్రాలకు రైతులు తీసుకొచ్చే వరి ధాన్యాన్ని నాణ్యత ప్రమాణాల ప్రకారం పూర్తిస్థాయిలో పరిశీలించిన తర్వాతే కొనుగోలు చేయాలని జీసీసీ డీఎం రామనందం సూచించారు. ధాన్యంలో తేమ శాతాన్ని తనిఖీ చేయడంతో పాటు, తడిసిన ధాన్యాన్ని కొనుగోలు చేయకుండా జాగ్రత్తలు తీసుకోవాలని కేంద్రాల ఇన్చార్జులకు ఆదేశించారు. గురువారం భద్రాచలం ఐటీడీఏ కార్యాలయంలోని సమావేశ మందిరంలో పౌరసరఫరాల శాఖ ఆధ్వర్యంలో జీసీసీ మేనేజర్లు, ధాన్యం కొనుగోలు కేంద్రాల ఇన్చార్జులకు నిర్వహించిన ఒకరోజు శిక్షణ కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా రామనందం మాట్లాడుతూ, కొనుగోలు కేంద్రాల పరిధిలోని రైతులు ధాన్యాన్ని విక్రయించేందుకు తీసుకొచ్చినప్పుడు దాని నాణ్యతను పూర్తిస్థాయిలో పరిశీలించాలని తెలిపారు. తేమ శాతాన్ని సాంకేతిక పద్ధతుల్లో తనిఖీ చేసి, నాణ్యత ప్రమాణాలకు అనుగుణంగా ఉన్న ధాన్యాన్ని మాత్రమే కొనుగోలు చేయాలని సూచించారు. కొనుగోలు చేసిన ధాన్యాన్ని జాగ్రత్తగా భద్రపరచాలని స్పష్టం చేశారు. అనంతరం పౌరసరఫరాల శాఖ సాంకేతిక ఇన్చార్జి సతీష్ మాట్లాడుతూ, రైతులు ధాన్యం తీసుకొచ్చిన వెంటనే తేమ శాతాన్ని పరీక్షించాలని, ధాన్యం తడిసిందా లేదా అనే విషయాన్ని క్షుణ్ణంగా పరిశీలించాలని అన్నారు. ధాన్యం నాణ్యతను సాంకేతికంగా ఏ విధంగా తనిఖీ చేయాలో పవర్పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా వివరించారు. ఈ కార్యక్రమంలో జీసీసీ మేనేజర్లు సమ్మయ్య, ధాన్యం కొనుగోలు కేంద్రాల 30 మంది ఇన్చార్జులు, జీసీసీ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.
