- District News
- ప్రజల భద్రతకు పోలీసులతో కలిసి పనిచేయాలి
ప్రజల భద్రతకు పోలీసులతో కలిసి పనిచేయాలి
నేరాల నియంత్రణకు సీసీ కెమెరాలు కీలకం : డీఎస్పీ అరుణ్ కుమార్
దుమ్ముగూడెం, లోకల్ గైడ్ న్యూస్ :
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా దుమ్ముగూడెం పోలీస్ స్టేషన్ పరిధిలోని లక్ష్మీనగర్, ములకపాడు గ్రామాల్లో ఏర్పాటు చేసిన సీసీ కెమెరాల పర్యవేక్షణ వ్యవస్థను భద్రాచలం డీఎస్పీ అరుణ్ కుమార్ గురువారం ప్రారంభించారు. ఈ వ్యవస్థ ద్వారా గ్రామాల్లో ఏర్పాటు చేసిన సీసీ కెమెరాలను నేరుగా పోలీస్ స్టేషన్ నుంచే పర్యవేక్షించే సదుపాయం కల్పించారు. ఈ సందర్భంగా డీఎస్పీ మాట్లాడుతూ గ్రామాల్లో జరిగే అనుమానాస్పద కార్యకలాపాలను ఎప్పటికప్పుడు గుర్తించేందుకు, నేరాల నియంత్రణకు, నేరాల ఛేదనకు సీసీ కెమెరాలు ఎంతో ఉపయోగపడతాయని తెలిపారు. సీసీ కెమెరాల ఏర్పాటుతో ప్రజల భద్రతను మరింత బలోపేతం చేయడంతో పాటు శాంతిభద్రతల పరిరక్షణకు సమర్థవంతమైన చర్యలు చేపట్టవచ్చని పేర్కొన్నారు. సీసీ కెమెరాల ఏర్పాటుకు ఆర్థికంగా సహకరించిన వ్యాపారులను డీఎస్పీ సన్మానించి అభినందించారు. ప్రజలు, వ్యాపారులు పోలీసులకు సహకరిస్తూ గ్రామాల్లో నేరాల నివారణలో భాగస్వాములు కావాలని పిలుపునిచ్చారు. ప్రజల సహకారంతో గ్రామాల్లో నిఘా వ్యవస్థను మరింత బలోపేతం చేస్తామని తెలిపారు. అనంతరం దుమ్ముగూడెం పోలీస్ స్టేషన్లోని రికార్డులు, పరిసరాలను డీఎస్పీ పరిశీలించారు. విధులు నిర్వహిస్తున్న పోలీస్ అధికారులు, సిబ్బందితో మాట్లాడి వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. సిబ్బంది సంక్షేమానికి ప్రాధాన్యతనిస్తూ సమస్యల పరిష్కారానికి కృషి చేస్తానని హామీ ఇచ్చారు. పోలీస్ స్టేషన్కు వచ్చే బాధితుల సమస్యలను బాధ్యతాయుతంగా పరిష్కరించి, ప్రజలకు మెరుగైన పోలీస్ సేవలు అందించాలని అధికారులకు, సిబ్బందికి సూచించారు. ఈ కార్యక్రమంలో దుమ్ముగూడెం సీఐ వెంకటప్పయ్య, ఎస్ఐ జగన్మోహన్ చారి, పోలీస్ అధికారులు, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.
