- District News
- ఒంటరి వికలాంగ మహిళకు ‘మీకోసం మేమున్నాం’ అండ
ఒంటరి వికలాంగ మహిళకు ‘మీకోసం మేమున్నాం’ అండ
వైద్య చికిత్స కోసం రూ.8 వేల ఆర్థిక సాయం అందజేత
చర్ల, లోకల్ గైడ్ న్యూస్ :
విజయకాలనీకి చెందిన శ్రీమతి కొంగూరు సత్యవతి (62), భర్త దివంగత పిల్లి దాసు, వికలాంగురాలు. సంతానం లేక ఒంటరిగా జీవిస్తూ సదరం పెన్షన్‌తో తన జీవనాన్ని కొనసాగిస్తున్నారు. ఇటీవల తీవ్ర కడుపునొప్పి రావడంతో ఖమ్మంలోని ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో చికిత్స చేయించుకోగా, గాల్ బ్లాడర్‌లో రాళ్లు ఉన్నట్లు వైద్యులు నిర్ధారించి శస్త్రచికిత్స అవసరమని సూచించారు. ఆర్థిక పరిస్థితి అంతంతమాత్రంగా ఉండటంతో పాటు తనకు అండగా నిలిచే వారు ఎవరూ లేకపోవడంతో సత్యవతి ఆర్థిక సహాయం కోసం ‘మీకోసం మేమున్నాం టీం’ను ఆశ్రయించారు. దీంతో సంస్థ ఆధ్వర్యంలో ఫండ్ రైజింగ్ పోస్టు ఏర్పాటు చేసి ఆర్థిక సహాయం సేకరించారు. సేకరించిన రూ.8,000 నగదును శుక్రవారం ఉదయం 11.30 గంటలకు ‘మీకోసం మేమున్నాం’ టీం కార్యాలయంలో సంస్థ కార్యవర్గ సభ్యులు గొట్టిపాటి శ్రీనివాసరావు చేతుల మీదుగా సత్యవతికి అందజేశారు. ఈ సందర్భంగా సంస్థ చైర్మన్ లయన్ నీలి ప్రకాష్ మాట్లాడుతూ కష్టాల్లో ఉన్న పేదలకు భరోసాగా నిలిచేందుకు ‘మీకోసం మేమున్నాం’ సంస్థ ఎల్లప్పుడూ ముందుంటుందని తెలిపారు. ఆపదలో ఉన్న వారికి తమ వంతు సహాయం అందించడం సంస్థ లక్ష్యమని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో బీవీ ప్రతాప్, కవ్వాల రాము, దొడ్డి సూరిబాబు, సింగ సంతోష్, అక్కినేని నెహ్రూ, గుద్దేటి బాలు, దొడ్డి రామ్మోహన్ తదితరులు పాల్గొన్నారు.
