- District News
- దివ్యాంగులు, వయోవృద్ధులు, ఆటో డ్రైవర్ల సమస్యలు పరిష్కరిస్తా
దివ్యాంగులు, వయోవృద్ధులు, ఆటో డ్రైవర్ల సమస్యలు పరిష్కరిస్తా
భద్రాచలం సబ్ కలెక్టర్ మృణాల శ్రేష్ట
భద్రాచలం, లోకల్ గైడ్ న్యూస్ :
కార్యాలయానికి వివిధ సమస్యల పరిష్కారం కోసం వచ్చే దరఖాస్తుదారుల సమస్యలను నిబంధనల ప్రకారం పరిష్కరించేందుకు కృషి చేస్తానని భద్రాచలం సబ్ కలెక్టర్ మృణాల శ్రేష్ట తెలిపారు. శనివారం పౌర కేంద్రీకృత పరిపాలనలో భాగంగా తన కార్యాలయం వెలుపల వయోవృద్ధులు, దివ్యాంగుల నుంచి వ్యక్తిగతంగా వినతిపత్రాలను స్వీకరించి, సమస్యలపై తక్షణ చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. అనంతరం భద్రాచలంలోని జెడ్‌పీహెచ్‌ఎస్ బాలికల పాఠశాలను సందర్శించిన సబ్ కలెక్టర్ 8 నుంచి 10వ తరగతి విద్యార్థినులతో వారి చదువులు, మధ్యాహ్న భోజనం, పాఠశాలలోని సౌకర్యాలపై మాట్లాడారు. విద్యార్థినులకు పలు సూచనలు, సలహాలు అందించారు. 12వ తరగతి అనంతరం ఉన్నత విద్య, ఉద్యోగ అవకాశాల కోసం ఐఐటీ-జేఈఈ, నీట్, సీయూఈటీ వంటి ప్రవేశ పరీక్షలకు సన్నద్ధం కావాలని సూచించారు. ఆన్‌లైన్ వనరులను వినియోగించుకోవడంతో పాటు ఏఐ, మైక్రోసాఫ్ట్ ఆఫీస్ వంటి ప్రాథమిక కంప్యూటర్ నైపుణ్యాలను నేర్చుకునేందుకు కంప్యూటర్ ల్యాబ్‌ను పూర్తిస్థాయిలో వినియోగించుకోవాలని ప్రోత్సహించారు. శారీరక, మానసిక దృఢత్వం కోసం క్రీడల్లో తప్పనిసరిగా పాల్గొనాలని సూచించారు. తదుపరి బ్రిడ్జ్ పాయింట్ ఆటో స్టాండ్‌ను సందర్శించి ఆటో డ్రైవర్లతో మాట్లాడారు. వారికి ఉన్న బీమా సదుపాయాలు, సురక్షిత డ్రైవింగ్, పిల్లల విద్య, స్టాండ్ సమీపంలో తాగునీరు, మరుగుదొడ్ల లభ్యతతో పాటు ఇతర సమస్యలను అడిగి తెలుసుకున్నారు. వారి సమస్యల పరిష్కారానికి అవసరమైన చర్యలు తీసుకుంటామని తెలిపారు. ఈ కార్యక్రమంలో పాఠశాల ఉపాధ్యాయులు, రెవెన్యూ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.
