- District News
- Khammam
- రాంబాబు 20 ఏళ్ల సేవకు అరుదైన గౌరవం!
రాంబాబు 20 ఏళ్ల సేవకు అరుదైన గౌరవం!
బొక్కల తండా అధ్యాపకుడికి తమిళనాడులో ఉత్తమ అధ్యాపక పురస్కారం.. పుదుచ్చేరి ఎమ్మెల్యే డా. వి. విగ్నేశ్వరన్ చేతుల మీదుగా అవార్డు ప్రదానం
కారేపల్లి (సింగరేణి), సెప్టెంబర్ 20 (లోకల్ గైడ్ న్యూస్) : సింగరేణి మండలం మారుమూల బొక్కల తండాకు చెందిన వాంకుడోత్ రాంబాబు రెండు దశాబ్దాలుగా అందిస్తున్న అధ్యాపక సేవలకు అరుదైన గుర్తింపు లభించింది. తమిళనాడు రాష్ట్రంలో నిర్వహించిన కార్యక్రమంలో ఆయనకు ఉత్తమ అధ్యాపక పురస్కారం అందజేశారు. తమిళనాడు రాష్ట్ర రిజిస్టర్డ్ సంస్థ అయిన తమిళనాడు ఎక్సలెంట్ ఉపాధ్యాయ సంఘం, శ్రీ శంకర–శారద ఇన్‌స్టిట్యూట్ ఆధ్వర్యంలో ప్రైవేట్ పాఠశాలల్లో సేవలందిస్తున్న ఉత్తమ అధ్యాపకులను గుర్తిస్తూ ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు. తిరువారూర్ జిల్లా పేరాళం పట్టణంలోని శంకర మెట్రిక్ హయ్యర్ సెకండరీ పాఠశాలలో జరిగిన ఈ కార్యక్రమంలో రాంబాబుకు పురస్కారం అందజేశారు. పుదుచ్చేరి ఎమ్మెల్యే డా. వి. విగ్నేశ్వరన్ చేతుల మీదుగా వాంకుడోత్ రాంబాబు ఉత్తమ అధ్యాపక అవార్డును స్వీకరించారు. రెండు దశాబ్దాలుగా విద్యారంగంలో అందిస్తున్న సేవలు, విద్యార్థుల పట్ల చూపుతున్న అంకితభావాన్ని గుర్తించి ఈ పురస్కారానికి ఎంపిక చేసినట్లు నిర్వాహకులు తెలిపారు. ఈ కార్యక్రమానికి విశిష్ట అతిథిగా డా. మహేశ్వరీ నారాయణన్ హాజరయ్యారు. గౌరవ అతిథులుగా తమిళనాడు రాష్ట్ర మాత్యు శాఖ కార్యదర్శి వి.ఆర్. ఇళయరాజా, నాగపట్నం జిల్లా కార్యదర్శి ఎన్.ఆర్. అరుల్ కుమార్, మదర్ గ్లోరీ వ్యవస్థాపకులు ఎం. అంటోయిన్, ఈజీపీఎస్ ఇంటర్నేషనల్ స్కూల్ ఎండీ కరీకులన్ సుబ్రహ్మణ్యం తదితరులు పాల్గొన్నారు. మారుమూల బొక్కల తండా నుంచి అధ్యాపకుడిగా తన ప్రస్థానాన్ని ప్రారంభించి 20 ఏళ్లపాటు విద్యారంగంలో కొనసాగిన రాంబాబుకు తమిళనాడు వేదికగా అవార్డు లభించడం పట్ల స్థానికులు, విద్యాభిమానులు హర్షం వ్యక్తం చేశారు. ఈ పురస్కారం తన బాధ్యతను మరింత పెంచిందని, విద్యార్థుల భవిష్యత్తు కోసం మరింత అంకితభావంతో పనిచేస్తానని రాంబాబు తెలిపారు.
