- District News
- అర్హులైన గిరిజనులకు సంక్షేమ పథకాలు అందించాలి.
అర్హులైన గిరిజనులకు సంక్షేమ పథకాలు అందించాలి.
ఐటీడీఏ సహాయ ప్రాజెక్టు అధికారి జనరల్ డేవిడ్ రాజ్
భద్రాచలం : లోకల్ గైడ్ న్యూస్ :
గిరిజన దర్బార్‌లో అర్జీలు సమర్పించిన ఆదివాసీ గిరిజనుల్లో అర్హులను గుర్తించి, ప్రభుత్వ సంక్షేమ పథకాలు అందేలా సంబంధిత అధికారులు ప్రత్యేక చొరవ చూపాలని ఐటీడీఏ సహాయ ప్రాజెక్టు అధికారి జనరల్ డేవిడ్ రాజ్ ఆదేశించారు. సోమవారం భద్రాచలంలోని ఐటీడీఏ సమావేశ మందిరంలో నిర్వహించిన గిరిజన దర్బార్‌లో ఐటీడీఏ ప్రాజెక్టు అధికారి బి. రాహుల్ అధికారిక పనుల నిమిత్తం అందుబాటులో లేకపోవడంతో, ఆర్‌సీఓ గురుకులం అరుణకుమారి, ఏడీఎంహెచ్‌వో సైదుతో కలిసి డేవిడ్ రాజ్ గిరిజనుల నుంచి అర్జీలు స్వీకరించారు. అనంతరం వాటిని సంబంధిత అధికారులకు పంపించి, అర్జీదారులకు జీవనోపాధి పెంపొందించేలా ప్రభుత్వ సంక్షేమ పథకాలు అందించాలని సూచించారు. గిరిజనులు సమర్పించిన అర్జీల్లో పోడు భూముల సమస్యలు, భూ వివాదాలు, వ్యక్తిగత సమస్యలు, కిరాణా దుకాణాలు, ఫ్యాన్సీ స్టోర్ల ఏర్పాటుకు రుణాలు, సౌర విద్యుత్ ద్వారా విద్యుత్ సౌకర్యం కల్పించడం, స్వయం ఉపాధి రుణాలు, గిరిజన గ్రామాల్లో విద్యుత్ సౌకర్యం, ఒంటరి మహిళలు, వితంతువులకు ప్రోత్సాహకాలు, గిరిజన రైతులకు రుణాలు, కల్యాణలక్ష్మి ఆర్థిక సాయం, ఉన్నత విద్యకు ఆర్థిక సహాయం, దీర్ఘకాలిక వ్యాధులకు ఆర్థిక సాయం తదితర అంశాలు ఉన్నాయని అధికారులు తెలిపారు. అలాగే ప్రభుత్వ, ప్రైవేటు రంగాల్లో ఉపాధి అవకాశాలు పొందేందుకు శిక్షణలు ఇప్పించాలని పలువురు గిరిజనులు దరఖాస్తులు సమర్పించినట్లు పేర్కొన్నారు. గిరిజన దర్బార్‌లో సుమారు 150కి పైగా అర్జీలు అందినట్లు డేవిడ్ రాజ్ తెలిపారు. వచ్చిన ప్రతి అర్జీని ప్రత్యేకంగా ఆన్‌లైన్‌లో నమోదు చేసి, విడతల వారీగా అర్హులైన ప్రతి ఒక్కరికీ ప్రభుత్వ పథకాలు అందేలా చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో ఉద్యానవన అధికారి ఉదయ్ కుమార్, ఏపీవో పవర్ వేణు, ఏవో సున్నం రాంబాబు, మేనేజర్ ఆదినారాయణ, మిషన్ భగీరథ ఏఈఈ, హౌసింగ్ ఏఈ హేమంత్, వివిధ విభాగాల సిబ్బంది మోహన్, నాగేశ్వరరావు, ప్రమీల భాయ్, జోగారావు, వెంకటేశ్వర్లు, విజయ్, స్వాతి తదితరులు పాల్గొన్నారు.
