- District News
- నంబర్ ప్లేట్లు లేని వాహనాలపై చర్యలేవి?
నంబర్ ప్లేట్లు లేని వాహనాలపై చర్యలేవి?
విచ్చలవిడిగా రోడ్లపై తిరుగుతున్న వాహనాలు.....
మంచిర్యాల జిల్లా ప్రతినిధి (లోకల్ గైడ్)
వాహనం రోడ్డుపైకి రావాలంటే తప్పనిసరిగా రిజిస్ట్రేషన్ నంబర్ ఉండాలి.వాహనం ముందు,వెనుక భాగాల్లో నిబంధనలకు అనుగుణంగా నంబర్ ప్లేట్లు ఏర్పాటు చేసుకోవాలి.అయితే మంచిర్యాల జిల్లాలోని పలు పట్టణాల్లో ఈ నిబంధనలు కాగితాలకే పరిమితమవుతున్నాయనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.నంబర్ ప్లేట్లు లేకుండా,స్పష్టంగా కనిపించని నంబర్ ప్లేట్లతో వాహనాలు విచ్చలవిడిగా రోడ్లపై సంచరిస్తున్నా సంబంధిత అధికారులు ఎందుకు చర్యలు తీసుకోవడం లేదన్న ప్రశ్నలు ప్రజల్లో వ్యక్తమవుతున్నాయి.జిల్లాలోని పలు పట్టణాలలో ప్రధాన రహదారులు,మార్కెట్ ప్రాంతాలు,రద్దీ కూడళ్లలో నంబర్ ప్లేట్లు లేని ద్విచక్ర వాహనాలు,ఇతర వాహనాలు కనిపిస్తున్నాయని స్థానికులు చెబుతున్నారు.కొందరు వాహనదారులు తమది ఈ శాఖ అని ఆ శాఖ అని ఆ సంస్థ ఈ సంస్థ అధికారులం అంటు నంబర్ ప్లేట్లు ఏర్పాటు చేసుకోకుండానే వాహనాలను నడుపుతున్నప్పటికీ తనిఖీ చేసే అధికారుల దృష్టికి అవి ఎందుకు రావడం లేదని ప్రజలు ప్రశ్నిస్తున్నారు.హెల్మెట్,సీట్ బెల్ట్,రిజిస్ట్రేషన్,ఇన్సూరెన్స్,పొల్యూషన్,త్రిబుల్ రైడింగ్,రాంగ్ రూట్లు అంటు జరిమానాలు విధించే సంబంధిత అధికారులకు ఇలాంటి వాహనాలు కనిపించడం లేదా అనే ప్రశ్నలు తలెత్తుతున్నాయి.
నంబర్ ప్లేట్ లేకుండా వాహనం ఎలా రోడ్డుపైకి?
వాహనం కొనుగోలు చేసిన అనంతరం రిజిస్ట్రేషన్ ప్రక్రియ పూర్తయి నిబంధనలకు అనుగుణంగా నంబర్ ప్లేట్ ఏర్పాటు చేసుకున్న తర్వాతే వాహనాన్ని రహదారిపై వినియోగించాల్సి ఉంటుంది.కానీ కొంతమంది వాహనదారులు నంబర్ ప్లేట్లు లేకుండానే వాహనాలను రోడ్లపైకి తీసుకువస్తున్నారనే ఆరోపణలు ఉన్నాయి.కొత్త వాహనాల విషయంలోను తాత్కాలిక రిజిస్ట్రేషన్ లేదా సంబంధిత నిబంధనలను పాటించకుండా తిరుగుతున్న వాహనాలను అధికారులు గుర్తించి తగిన చర్యలు తీసుకోవాల్సి ఉంది.కానీ ఆయా పట్టణాల్లో పరిస్థితి చూస్తే తనిఖీలు ఎంతవరకు జరుగుతున్నాయనే సందేహాలు తలెత్తుతున్నాయి.నేరాల నియంత్రణలో నంబర్ ప్లేట్ కీలకం
వాహనానికి సంబంధించిన నంబర్ ప్లేట్ కేవలం గుర్తింపు కోసం మాత్రమే కాదు,అనేక సందర్భాల్లో నేరాల నియంత్రణలో కూడా కీలక పాత్ర పోషిస్తుంది.రోడ్డు ప్రమాదం జరిగినప్పుడు వాహనాన్ని గుర్తించడానికి,వాహనం దొంగతనానికి గురైనప్పుడు ఆచూకీ తెలుసుకోవడానికి,నేరాలకు వాహనాన్ని ఉపయోగించినప్పుడు దర్యాప్తు చేయడానికి రిజిస్ట్రేషన్ నంబర్ ఎంతో ఉపయోగపడుతుంది.ఇలాంటి పరిస్థితుల్లో నంబర్ ప్లేట్ లేకుండా వాహనాలు తిరగడం వల్ల వాహనాన్ని గుర్తించడం పోలీసులకు సైతం కష్టతరంగా మారే అవకాశం ఉంది.ముఖ్యంగా రోడ్డు ప్రమాదాలు చేసి వాహనాన్ని ఆపకుండా వెళ్లిపోయే ఘటనల్లో నంబర్ ప్లేట్ లేకపోవడం దర్యాప్తుకు మరింత ఇబ్బందిగా మారుతుందని ప్రజలు విస్మయం వ్యక్తం చేస్తున్నారు.
ప్రమాదాలు జరిగితే బాధ్యత ఎవరిది?
నంబర్ ప్లేట్ లేని వాహనం ప్రమాదానికి కారణమైతే ఆ వాహనాన్ని గుర్తించడం ఎలా,ప్రమాద బాధితులకు న్యాయం ఎలా జరుగుతుంది అనే ప్రశ్నలు తలెత్తుతున్నాయి.ఒకవైపు రోడ్డు ప్రమాదాలను అరికట్టేందుకు అధికారులు అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తున్నామని చెబుతున్నప్పటికీ,మరోవైపు నంబర్ ప్లేట్లు లేని వాహనాలు రోడ్లపై తిరుగుతున్నా చర్యలు తీసుకోకపోతే ఆ కార్యక్రమాల ఉద్దేశమేంటని ప్రజలు ప్రశ్నిస్తున్నారు.ట్రాఫిక్ నిబంధనలు ఉల్లంఘిస్తున్న వారిపై కొరడా ఝళిపించాలి
హెల్మెట్,సీటు బెల్ట్,డ్రంక్ అండ్ డ్రైవ్ వంటి అంశాలపై అధికారులు తనిఖీలు నిర్వహించడం ఎంత ముఖ్యమో.. నంబర్ ప్లేట్ లేని వాహనాలపై చర్యలు తీసుకోవడం కూడా అంతే ముఖ్యమని ప్రజలు వాపోతున్నారు.వాహనం నంబర్ స్పష్టంగా కనిపించేలా ఉండాలి.నంబర్ ప్లేట్‌ను వంకరగా, అస్పష్టంగా నిబంధనలకు విరుద్ధంగా ఏర్పాటు చేసుకున్నా అధికారులు గుర్తించి చర్యలు తీసుకోవాలని ప్రజలు కోరుతున్నారు.
తనిఖీలు ఎక్కడ...
జిల్లా వ్యాప్తంగా ప్రతిరోజు వందలాది వాహనాలు రాకపోకలు సాగిస్తున్నాయి.ప్రధాన కూడళ్ల వద్ద ట్రాఫిక్ సిబ్బంది,పోలీసులు తనిఖీలు నిర్వహిస్తున్నప్పటికీ నంబర్ ప్లేట్ లేని వాహనాలు వారి కంటపడకపోవడంపై ప్రజలు విస్మయం వ్యక్తం చేస్తున్నారు.తనిఖీలు కేవలం హెల్మెట్,ఇతర చిన్నపాటి ఉల్లంఘనలకే పరిమితం కాకుండా వాహనం పూర్తి పత్రాలు,రిజిస్ట్రేషన్,నంబర్ ప్లేట్ తదితర అంశాలను కూడా పరిశీలించాలని ప్రజలు కోరుతున్నారు.నిబంధనలు అందరికీ సమానంగా ఉండాలి
చట్టం ముందు అందరు సమానమే,సాధారణ వాహనదారుడు చిన్న తప్పు చేసినా జరిమానా విధించే అధికారులు నంబర్ ప్లేట్ లేకుండా తిరుగుతున్న వాహనాల విషయంలోను అదే కఠినత్వాన్ని ప్రదర్శించాలని ప్రజలు కోరుతున్నారు.ఎవరైనా సరే నంబర్ ప్లేట్ లేకుండా వాహనం నడిపితే నిబంధనల ప్రకారం చర్యలు తీసుకోవాలని,పదేపదే ఉల్లంఘించే వారిపై మరింత కఠిన చర్యలు చేపట్టాలని స్థానికులు డిమాండ్ చేస్తున్నారు.
సీసీ కెమెరాలతో గుర్తించాలి...
పట్టణాలలోని ప్రధాన కూడళ్లు,రద్దీ ప్రాంతాల్లో సీసీ కెమెరాల ద్వారా నంబర్ ప్లేట్ లేని వాహనాలను గుర్తించే విధానాన్ని అధికారులు పరిశీలించాలని ప్రజలు సూచిస్తున్నారు.ట్రాఫిక్ ఉల్లంఘనలను సాంకేతిక పరిజ్ఞానంతో గుర్తించి చర్యలు తీసుకుంటే నిబంధనలు ఉల్లంఘించే వాహనదారుల్లో భయం ఏర్పడుతుందని అంటున్నారు.నంబర్ ప్లేట్ లేకుండా వాహనాలు తిరగడం సాధారణ విషయంగా మారితే భవిష్యత్తులో ఇది మరింత పెద్ద సమస్యగా మారే అవకాశం ఉందని ప్రజలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.వాహనాల రాకపోకలు పెరుగుతున్న ప్రస్తుత పరిస్థితుల్లో ట్రాఫిక్ నిబంధనల అమలుపై అధికారులు మరింత దృష్టి పెట్టాల్సిన అవసరం ఉంది.నంబర్ ప్లేట్లు లేని వాహనాలు రోడ్లపై తిరుగుతుంటే వాటిని ఎవరు నియంత్రించాలి,తనిఖీ చేయాల్సిన అధికారులు ఎందుకు పట్టించుకోవడం లేదు,నిబంధనలు ఉల్లంఘిస్తున్న వాహనదారులపై ఎన్ని కేసులు నమోదు చేశారు,ఎన్ని వాహనాలపై జరిమానాలు విధించారు అనే ప్రశ్నలకు సంబంధిత అధికారులు సమాధానం చెప్పాల్సిన అవసరం ఉంది.ప్రజల భద్రత,నేరాల నియంత్రణ,రోడ్డు ప్రమాదాల నివారణను దృష్టిలో పెట్టుకుని నంబర్ ప్లేట్ లేని,నిబంధనలకు విరుద్ధంగా నంబర్ ప్లేట్లు ఏర్పాటు చేసుకున్న వాహనాలపై ప్రత్యేక డ్రైవ్ నిర్వహించి కఠిన చర్యలు తీసుకోవాలని ప్రజలు కోరుతున్నారు.ఇకనైనా అధికారులు స్పందించి రహదారులపై నంబర్ ప్లేట్ లేని వాహనాలకు అడ్డుకట్ట వేస్తారా,లేక ఈ ఉల్లంఘనలు ఇలాగే కొనసాగుతాయా అనేది వేచి చూడాలి.
