- District News
- చర్ల పీహెచ్‌సీలో ఆశా డే కార్యక్రమం
చర్ల పీహెచ్‌సీలో ఆశా డే కార్యక్రమం
సూచనలు చేసిన డీఎంహెచ్‌ఓ డాక్టర్ తుకారాం రాథోడ్
చర్ల : లోకల్ గైడ్ న్యూస్ :
ప్రజలకు పోషకాహారం, నేత్రదానం, టీబీ, వ్యాధి నిరోధక టీకాలు, సీజనల్ వ్యాధులపై విస్తృతంగా అవగాహన కల్పించాలని జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి డాక్టర్ తుకారాం రాథోడ్ ఆశా ఆరోగ్య కార్యకర్తలకు సూచించారు. మంగళవారం చర్ల ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో నిర్వహించిన ఆశా డే కార్యక్రమాన్ని ఆయన సందర్శించి పలు సూచనలు చేశారు. ఈ సందర్భంగా డాక్టర్ తుకారాం రాథోడ్ మాట్లాడుతూ.. పోషకాహార లోపం నివారణపై ప్రజల్లో అవగాహన పెంచాలని సూచించారు. ఆకుకూరలు, కూరగాయలు, పప్పులు తదితర సమతుల్య ఆహారం ద్వారా శరీరానికి అవసరమైన విటమిన్లు, మినరల్స్, ప్రొటీన్లు అందుతాయని వివరించాలని తెలిపారు. ఆగస్టు 20 నుంచి సెప్టెంబర్ 5 వరకు నిర్వహిస్తున్న నేత్రదాన పక్షోత్సవాల సందర్భంగా నేత్రదానం ప్రాముఖ్యతను ప్రజలకు తెలియజేయాలని చెప్పారు. స్వచ్ఛందంగా నేత్రదానానికి ముందుకు వచ్చేలా అవగాహన కార్యక్రమాలు నిర్వహించాలని సూచించారు. జిల్లా టీబీ ప్రోగ్రాం ఆఫీసర్ ప్రసాద్ మాట్లాడుతూ.. రెండు వారాలకు మించి దగ్గు, జ్వరం, బరువు తగ్గడం, రాత్రిపూట చెమటలు వంటి లక్షణాలు ఉన్నవారు వెంటనే సమీప ఆరోగ్య కేంద్రంలో టీబీ పరీక్షలు చేయించుకునేలా ప్రజలను చైతన్యపరచాలని సూచించారు. టీబీ మందులను ప్రభుత్వం ఉచితంగా అందిస్తోందని, వైద్యుల సూచనల మేరకు క్రమం తప్పకుండా మందులు వాడితే వ్యాధిని పూర్తిగా నయం చేసుకోవచ్చని తెలిపారు. డిప్యూటీ డీఎంహెచ్‌ఓ, డీఐఓ డాక్టర్ ప్రతాప్ మాట్లాడుతూ.. ప్రతి చిన్నారికి జాతీయ వ్యాధి నిరోధక టీకాల కార్యక్రమం ప్రకారం అన్ని టీకాలను నిర్ణీత సమయంలో వేయించాలని సూచించారు. ఒక్క టీకా కూడా మిస్ కాకుండా తల్లిదండ్రులకు అవగాహన కల్పించాలని, పోలియో వంటి వ్యాధుల నియంత్రణలో టీకాలు కీలకపాత్ర పోషించాయని తెలిపారు. సీజనల్ వ్యాధుల నివారణకు పరిసరాలను పరిశుభ్రంగా ఉంచాలని, దోమల ద్వారా వ్యాపించే వ్యాధులను అరికట్టేందుకు ఇళ్లలో, పరిసరాల్లో నీరు నిల్వ ఉండకుండా ప్రజలకు సూచించాలని చెప్పారు. ప్రతి శుక్రవారం నిర్వహించే ‘ఫ్రైడే డ్రై డే’ కార్యక్రమాన్ని సమర్థవంతంగా నిర్వహించాలని ఆశా కార్యకర్తలకు సూచించారు. ఈ కార్యక్రమంలో వైద్య సిబ్బంది, ఆశా ఆరోగ్య కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.
