- District News
- మహాదేవపూర్‌లో బీఆర్ఎస్ పార్టీ ధర్నా
మహాదేవపూర్‌లో బీఆర్ఎస్ పార్టీ ధర్నా
గ్యాస్ ఏజెన్సీ పునరుద్ధరించాలి.. లేదంటే ఉద్యమం తప్పదు
భూపాలపల్లి: (లోకల్ గైడ్ ప్రతినిధి)
జయశంకర్ భూపాలపల్లి జిల్లా మహాదేవపూర్ మండల కేంద్రంలోని గ్యాస్ ఏజెన్సీని పునరుద్ధరించాలని డిమాండ్ చేస్తూ బీఆర్ఎస్ పార్టీ శ్రీపతి బాపు ఆధ్వర్యంలో శనివారం నిరసన ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ గ్యాస్ ఏజెన్సీ ఎత్తివేతతో స్థానిక ప్రజలు, ముఖ్యంగా గిరిజనులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని పేర్కొన్నారు.
ఒకప్పుడు తాలూకా కేంద్రంగా ఉన్న మహాదేవపూర్‌లోని పలు కీలక కార్యాలయాలు క్రమంగా ఇతర ప్రాంతాలకు తరలిపోతుండడం ఆందోళన కలిగించే విషయమని అన్నారు. మహాదేవపూర్‌కు వచ్చిన కోర్టును కూడా కాటారం మండలానికి తరలించారని, ఎస్‌టీఓ కార్యాలయాన్ని సైతం ఇతర ప్రాంతానికి మార్చారని నాయకులు ఆరోపించారు. గిరిజన సహకార సంస్థను బలోపేతం చేయాల్సిన సమయంలో గ్యాస్ ఏజెన్సీని తొలగించడం వల్ల సంస్థతో పాటు స్థానిక ఉపాధి అవకాశాలు కూడా దెబ్బతింటున్నాయని విమర్శించారు.
మహాదేవపూర్ ప్రాంతంలోని గోదావరి నుంచి ఇసుక హైదరాబాద్ తదితర ప్రాంతాలకు తరలిపోతున్నప్పటికీ, ఈ ప్రాంత అభివృద్ధిపై ప్రభుత్వం దృష్టి సారించడం లేదని నాయకులు ఆరోపించారు. తెలంగాణ ప్రభుత్వానికి ఇంతటి సంపదను అందిస్తున్న ప్రాంతంలో అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టకుండా, ఇప్పటికే ఉన్న కార్యాలయాలను కూడా తరలించడం అన్యాయమని అన్నారు. రానున్న రోజుల్లో మహాదేవపూర్ మండలాన్ని కూడా తొలగించే ప్రమాదం ఉందని వారు ఆవేదన వ్యక్తం చేశారు.
ప్రస్తుతం గ్యాస్ సిలిండర్ల కోసం వినియోగదారులు దూర ప్రాంతాలకు వెళ్లాల్సి వస్తోందని, అదనపు రవాణా ఖర్చులతో ప్రజలపై భారం పడుతోందని తెలిపారు. ప్రజా సమస్యల పరిష్కారంపై ప్రభుత్వం, ప్రజాప్రతినిధులు తక్షణమే స్పందించి గ్యాస్ ఏజెన్సీని తిరిగి మహాదేవపూర్‌లో ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు.
గ్యాస్ ఏజెన్సీని తక్షణమే మహాదేవపూర్ ప్రజలకు అప్పగించి, గిరిజన సహకార సంస్థను కాపాడాలని నాయకులు కోరారు. డిమాండ్‌ను నెరవేర్చని పక్షంలో ప్రతిరోజూ ఆందోళనలు నిర్వహిస్తామని, ప్రజలతో కలిసి పెద్ద ఎత్తున ఉద్యమాలు చేపడతామని హెచ్చరించారు.
ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ మండల నాయకులు శ్రీపతి బాపు, కేదారి గీత, పోత వెంకటస్వామి, వెన్నంపల్లి మహేష్, అలీం ఖాన్, సాజిద్ అలీ, కూరతోట రాకేష్, కలికోట దేవేందర్, సుంకే మధు, అన్నమనేని అరుణ, ఒడేటి స్వప్న, దుర్గం పోచం, శ్రీపతి అర్జున్, రెవెల్లి రాజశేఖర్ తదితర నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.
