- District News
- మట్టి వినాయకుని పూజిద్దాం..పర్యావరణాన్ని కాపాడుదాం* - కృష్ణవేణి టాలెంట్ స్కూల్‌లో మట్టి వినాయకుల తయా...
మట్టి వినాయకుని పూజిద్దాం..పర్యావరణాన్ని కాపాడుదాం* - కృష్ణవేణి టాలెంట్ స్కూల్‌లో మట్టి వినాయకుల తయారీపై విద్యార్థులకు అవగాహన
ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ విగ్రహాలతో నీటి కాలుష్యం. - మట్టి విగ్రహాలతో పర్యావరణ పరిరక్షణ
లోకల్ గైడ్/తాండూర్:
మట్టి వినాయకుని పూజించి.. పర్యావరణాన్ని కాపాడుకోవాలని కృష్ణవేణి టాలెంట్ స్కూల్ డైరెక్టర్ ధ్యావరి జయవర్ధన్ రెడ్డి పిలుపునిచ్చారు.వినాయక చవితి సందర్భంగా విద్యార్థుల్లో పర్యావరణ పరిరక్షణపై అవగాహన కల్పించేందుకు తాండూర్ పట్టణంలోని కృష్ణవేణి టాలెంట్ స్కూల్లో శనివారం మట్టి వినాయకుల తయారీ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ప్రత్యేకంగా మట్టి వినాయకుల తయారీలో నైపుణ్యం కలిగిన కళాకారుడిని పాఠశాలకు ఆహ్వానించి, విద్యార్థులకు మట్టి విగ్రహాల తయారీ విధానాన్ని ప్రత్యక్షంగా వివరించారు.
కళాకారుడు మట్టిని సిద్ధం చేయడం నుంచి వినాయక విగ్రహాలను వివిధ ఆకృతుల్లో రూపొందించే వరకు ప్రతి దశను విద్యార్థులకు వివరించారు. విద్యార్థులు ఎంతో ఆసక్తిగా కార్యక్రమంలో పాల్గొని, స్వయంగా మట్టి వినాయకులను తయారు చేశారు. ఈ సందర్భంగా
పాఠశాల చైర్మన్ విష్ణువర్ధన్ రెడ్డి మాట్లాడుతూ ... ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్‌తో తయారు చేసిన విగ్రహాలను నిమజ్జనం చేయడం వల్ల నీటి వనరులు కలుషితమయ్యే అవకాశం ఉందన్నారు. రసాయన రంగులు నీటిలో కలవడం వల్ల జలచరాలకు, పర్యావరణానికి హాని కలిగే ప్రమాదం ఉందని తెలిపారు. మట్టి వినాయకులను పూజించి నిమజ్జనం చేయడం ద్వారా పర్యావరణానికి హాని తక్కువగా ఉంటుందని, అందువల్ల ప్రతి ఒక్కరూ పర్యావరణహితమైన మట్టి వినాయకులను పూజించాలని సూచించారు.
విద్యార్థుల్లో చిన్ననాటి నుంచే పర్యావరణ పరిరక్షణపై బాధ్యతను పెంపొందించడంతో పాటు, వారి సృజనాత్మకతను వెలికితీయాలనే ఉద్దేశంతో ఈ కార్యక్రమాన్ని నిర్వహించినట్లు తెలిపారు. అంతేకాకుండా మట్టి వినాయకుల తయారీ ద్వారా సంప్రదాయాలను కాపాడటంతో పాటు పర్యావరణాన్ని పరిరక్షించవచ్చని వివరించారు. ఈ నేపథ్యంలో విద్యార్థుల మంగళహారతులు, భక్తిగీతాలు, నృత్యాలతో సందడి చేయడంతో పాఠశాల ఆధ్యాత్మిక శోభను సంతరించుకుంది. పాఠశాల డైరెక్టర్ జయవర్ధన్ రెడ్డి మాట్లాడుతూ ...గణపతి పూజా విశిష్టతను, వినాయక చవితి పండుగ ప్రాముఖ్యతను విద్యార్థులకు వివరించారు. అదేవిధంగా విద్యార్థుల్లో సృజనాత్మకతను పెంపొందించేందుకు, పర్యావరణహితమైన ఆలోచనలను ప్రోత్సహించేందుకు ఇలాంటి కార్యక్రమాలు ఎంతో ఉపయోగకరంగా ఉంటాయని తెలిపారు. ఈ కార్యక్రమంలో ప్రిన్సిపాల్ ఎన్.రమేష్ ఉపాధ్యాయులు పి చంద్రశేఖర్ రెడ్డి అనిల్ కుమార్, సునీత, ఉపాధ్యాయుల సిబ్బంది, విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు.
