తొగుట్ట, ఆగస్టు 12( లోకల్ గైడ్):
సిద్దిపేట పోలీస్ కమిషనర్ రష్మీ పెరుమాళ్, IPS ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ‘సిద్దిపేట సురక్ష నేత్ర’ కార్యక్రమంలో భాగంగా తొగుట్ట మండలం కాన్గల్ గ్రామంలో సీసీ కెమెరాలను సీఐ లతీఫ్ ప్రారంభించారు. శాంతిభద్రతల పరిరక్షణ, నేరాల నియంత్రణలో సీసీ కెమెరాలు కీలకపాత్ర పోషిస్తాయని ఆయన తెలిపారు.సీసీ కెమెరాలు శాంతిభద్రతల పరిరక్షణలో ‘మూడో కన్ను’గా పనిచేస్తాయని, నేరస్థులను త్వరగా గుర్తించి పట్టుకోవడంలో ఇవి ఎంతో ఉపయోగపడతాయని సీఐ లతీఫ్ అన్నారు. ప్రజలు సీసీ కెమెరాల డీవీఆర్ బాక్సులను ఇతరులకు సులభంగా అందుబాటులో లేకుండా భద్రంగా ఉంచాలని సూచించారు. అనుమానాస్పద వ్యక్తులు లేదా కార్యకలాపాలు కనిపిస్తే వెంటనే 112కు సమాచారం అందించాలని కోరారు.సైబర్ నేరాలపై ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచిస్తూ, ఓటీపీ, బ్యాంకు వివరాలను ఎవరితోనూ పంచుకోవద్దని, తెలియని లింకులను క్లిక్ చేయకూడదని, నకిలీ APK ఫైళ్లను ఇన్‌స్టాల్ చేయవద్దని హెచ్చరించారు. సైబర్ మోసం జరిగితే వెంటనే 1930కు ఫిర్యాదు చేస్తే, పోగొట్టుకున్న నగదును ఫ్రీజ్ చేసే అవకాశం ఉంటుందని తెలిపారు. ప్రభుత్వ ఉద్యోగాలు ఇప్పిస్తామని చెప్పి డబ్బులు వసూలు చేసే మోసగాళ్లను నమ్మవద్దని, అలాంటి సమాచారం ఉంటే పోలీసులకు తెలియజేయాలని కోరారు.నిరుద్యోగ యువత కోసం ‘సిద్దిపేట ఉద్యోగమిత్ర’ ఆన్‌లైన్ పోర్టల్ ద్వారా ఉపాధి, ఉద్యోగ అవకాశాలు అందుబాటులో ఉన్నాయని, యువత వాటిని సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. యువత మత్తు పదార్థాలు, డ్రగ్స్‌కు దూరంగా ఉండేలా తల్లిదండ్రులు, ప్రజలు ప్రత్యేక శ్రద్ధ వహించాలని పిలుపునిచ్చారు.ప్రజల భాగస్వామ్యంతోనే ‘సిద్దిపేట సురక్ష నేత్ర’ కార్యక్రమం విజయవంతమవుతుందని, తోగుట్ట మండలం లోని కాలనీలు, ప్రధాన కూడళ్లు, గ్రామాలు నిరంతరం నిఘా పరిధిలోకి వచ్చేలా ప్రజలు స్వచ్ఛందంగా ముందుకు వచ్చి సీసీ కెమెరాలు ఏర్పాటు చేసుకోవాలని సీఐ కోరారు.ఈ కార్యక్రమంలో తొగుట్ట ఎస్సై నవీన్, పోలీస్ సిబ్బంది రమేష్, గ్రామ సర్పంచ్ పిట్ల సత్తయ్య, గ్రామ ప్రజలు పాల్గొన్నారు. సీసీ కెమెరాల ఏర్పాటుకు సహకరించిన ప్రజాప్రతినిధులకు గ్రామ ప్రజలకు పోలీసుల తరఫున కృతజ్ఞతలు తెలిపారు.