- District News
- తాగునీటి పథకాన్ని అడ్డుకునేందుకు ప్రతిపక్షాల కుట్ర.* - ప్రజల అవసరాలకు మద్దతుగా నిలవాల్సింది పోయి. -...
తాగునీటి పథకాన్ని అడ్డుకునేందుకు ప్రతిపక్షాల కుట్ర.* - ప్రజల అవసరాలకు మద్దతుగా నిలవాల్సింది పోయి. - వాటిని అడ్డుకోవడం సిగ్గుచేటు
ఎమ్మెల్యే బుయ్యని మనోహర్ రెడ్డి.
లోకల్ గైడ్/తాండూర్:
తాండూర్ పట్టణానికి శాశ్వతంగా తాగునీరు అందించేందుకు ప్రభుత్వం చేపడుతున్న కాగ్నా తాగునీటి పథకాన్ని అడ్డుకునేందుకు ప్రతిపక్షాలు కుట్రలు చేస్తున్నాయని తాండూర్ ఎమ్మెల్యే బుయ్యని మనోహర్ రెడ్డి ఆరోపించారు. పట్టణ సమగ్ర అభివృద్ధికి మున్సిపల్ పాలకవర్గం ప్రణాళికాబద్ధంగా పనిచేయాలని ఆయన సూచించారు. బుధవారం
తాండూర్ మున్సిపల్ కార్యాలయంలో మున్సిపల్ చైర్‌పర్సన్ నీరజబాల్ రెడ్డి అధ్యక్షతన సాధారణ కౌన్సిల్ సమావేశం ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమానికి ఎమ్మెల్యే బుయ్యని మనోహర్ రెడ్డి హాజరయ్యారు.కాగా 18 అంశాలతో కూడిన ఎజెండాపై కౌన్సిల్ సభ్యులు చర్చించారు. అనంతరం ఎమ్మెల్యే మీడియాతో మాట్లాడారు.ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రత్యేక కృషితో తాండూర్ పట్టణానికి శాశ్వతంగా తాగునీరు అందించేందుకు రూ.110 కోట్ల నిధులు మంజూరయ్యాయని తెలిపారు. ప్రజలకు ఉపయోగపడే తాగునీటి పథకానికి ప్రతిపక్షాలు మద్దతు ఇవ్వాల్సింది పోయి అడ్డంకులు సృష్టించేందుకు ప్రయత్నించడం సిగ్గుచేటని విమర్శించారు. గత 30 ఏళ్లుగా కాగ్నా నీరు కొడంగల్ ప్రాంతానికి వెళ్తోందని, తాండూర్ తాగునీటి పథకం మరింత మెరుగుపడేలా ప్రభుత్వం ద్వారా అదనపు నిధులు తీసుకొచ్చామని చెప్పారు.
తాండూర్‌లో నిర్మించాల్సిన ఇంటిగ్రేటెడ్ స్కూల్ ఎక్కడికీ వెళ్లలేదని, తాండూర్‌లోనే నిర్మించి చూపిస్తామని ఎమ్మెల్యే స్పష్టం చేశారు. విద్యా రంగంపై తమ ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించిందని, ప్రభుత్వం ఏర్పాటు చేసిన ఏటీసీ (ATC) సెంటర్లు, ప్రభుత్వ పాఠశాలల్లో ప్రారంభించిన అల్పాహార పథకం ఇందుకు నిదర్శనమన్నారు.
ప్రభుత్వ ఆసుపత్రి విషయంలో కొంతమంది ప్రైవేట్ ఆసుపత్రుల యాజమాన్యాలతో కుమ్మక్కై కుట్రలు చేస్తున్నారని ఆయన ఆరోపించారు. గత పదేళ్ల పాలనలో ప్రభుత్వ ఆసుపత్రిలో ఐసీయూ యూనిట్ ఏర్పాటు చేయలేకపోయారని, ప్రభుత్వ ఆసుపత్రుల్లో పనిచేసే కాంట్రాక్ట్ ఉద్యోగులకు సకాలంలో జీతాలు అందించడంతో పాటు వారి ఉద్యోగ భద్రతకు కూడా సరైన చర్యలు తీసుకోలేదని విమర్శించారు.
కౌన్సిల్ సమావేశాలు ప్రజా సమస్యలపై చర్చించి పరిష్కారాలు కనుగొనే వేదికగా ఉండాలని, విమర్శలు–ప్రతివిమర్శలతో కాలయాపన చేసే వేదికగా మారకూడదని ఎమ్మెల్యే అన్నారు. గతంలో ఎన్నికల సమయంలో శిలాఫలకాలు వేయడానికే ఎక్కువ ప్రాధాన్యత ఇచ్చారని, తమ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత శిలాఫలకాల కంటే అభివృద్ధి పనులకే అధిక ప్రాధాన్యత ఇస్తోందని పేర్కొన్నారు. ఆ అభివృద్ధి పనులు ప్రస్తుతం ప్రజల కళ్లముందే కనిపిస్తున్నాయని తెలిపారు.
ప్రజాప్రతినిధులు, కౌన్సిల్ సభ్యుల సూచనలు, సలహాలను పరిగణనలోకి తీసుకుంటూ తాండూర్ పట్టణ సమగ్ర అభివృద్ధికి ప్రణాళికాబద్ధంగా ముందుకు సాగాలని ఎమ్మెల్యే సూచించారు. ప్రజల భాగస్వామ్యంతో అన్ని రంగాల్లో అభివృద్ధి చెందిన ఆదర్శవంతమైన తాండూర్ పట్టణాన్ని నిర్మించడమే లక్ష్యంగా కౌన్సిలర్లు పనిచేయాలని కోరారు. ఈ
సమావేశంలో మున్సిపల్ చైర్‌పర్సన్ నీరజబాల్ రెడ్డి, వైస్ చైర్మన్ అబ్దుల్ రజాక్, కౌన్సిలర్లు, మున్సిపల్ కమిషనర్ రాకేష్ రెడ్డి, మున్సిపల్ కార్యాలయ సిబ్బంది పాల్గొన్నారు.
