ఖమ్మం జిల్లా, కారేపల్లి (సింగరేణి ) : లోకల్ గైడ్, ఆగస్టు 10: కార్మికులు, రైతులు, వ్యవసాయ కార్మికులు కేంద్ర ప్రభుత్వ ప్రజా వ్యతిరేక విధానాలకు నిరసనగా కారేపల్లిలో చేపట్టిన జైల్‌భరో కార్యక్రమానికి భారత ప్రజాతంత్ర యువజన సమాఖ్య (డీవైఎఫ్ఐ) సింగరేణి మండల కమిటీ మద్దతు తెలిపింది. ఈ సందర్భంగా డీవైఎఫ్ఐ మండల కార్యదర్శి ఆదేర్ల వినయ్ కుమార్ మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం కార్పొరేట్ పెట్టుబడిదారులకు అనుకూలంగా వ్యవహరిస్తూ కార్మికుల హక్కులను కాలరాస్తోందని విమర్శించారు. కార్మిక చట్టాలను బలహీనపరుస్తూ నాలుగు లేబర్ కోడ్‌లను తీసుకురావడం ద్వారా కార్మిక శ్రమను దోపిడీ చేసేందుకు మార్గం సుగమం చేస్తున్నారని ఆరోపించారు. ఉపాధి హామీ చట్టాన్ని నిర్వీర్యం చేసే వీబీజీ రాంజీ చట్టాన్ని ఉపసంహరించుకోవాలని, మహాత్మాగాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకాన్ని బలోపేతం చేసి 200 రోజుల పనిదినాలు, రోజుకు రూ.600 కూలీ అమలు చేయాలని డిమాండ్ చేశారు. రైతులకు గిట్టుబాటు ధర కల్పించేందుకు కనీస మద్దతు ధరకు చట్టబద్ధత కల్పించాలని కోరారు. అదేవిధంగా పేదలు, రైతులకు అందుతున్న విద్యుత్ సౌకర్యాలను దూరం చేసే విద్యుత్ సవరణ చట్టాన్ని వ్యతిరేకించాలని, ప్రజలపై అదనపు భారాలు మోపే విధానాలను తిప్పికొట్టాలని అన్నారు. యువతకు తగిన ఉపాధి అవకాశాలు కల్పించకుండా నిరుద్యోగాన్ని పెంచుతున్న ప్రభుత్వ విధానాలను కూడా ఆయన తీవ్రంగా విమర్శించారు. కార్మికులు, రైతులు, యువత హక్కుల పరిరక్షణ కోసం యువత పెద్ద ఎత్తున ఉద్యమాల్లో భాగస్వాములు కావాలని ఆదేర్ల వినయ్ కుమార్ పిలుపునిచ్చారు. కార్యక్రమంలో గాదె నరేష్, చిలుముల భరత్, కాకాటి పృద్వి తదితరులు పాల్గొన్నారు.