సీఎం రేవంత్ రెడ్డి పర్యటనకు ముమ్మర ఏర్పాట్లు

ఈ నెల 15న సంగారెడ్డిలో నూతన స్మార్ట్ రేషన్ కార్డుల పంపిణీ

సభాస్థలి, హెలిపాడ్ ను పరిశీలించిన జగ్గారెడ్డి, కలెక్టర్ ప్రతీక్ జైన్, ఎస్పీ పరితోష్ పంకజ్
Published On
సీఎం రేవంత్ రెడ్డి పర్యటనకు ముమ్మర ఏర్పాట్లు

 

 

 

 లోకల్ గైడ్ /సంగారెడ్డి:

సంగారెడ్డి జిల్లా కేంద్రానికి ఈ నెల 15వ తేదీన ముఖ్యమంత్రి  రేవంత్ రెడ్డి  రానున్నారు.   నూతన స్మార్ట్ రేషన్ కార్డుల పంపిణీ కార్యక్రమాన్ని ముఖ్యమంత్రి  రేవంత్ రెడ్డి సంగారెడ్డి లో అధికారికంగా ప్రారంభించనున్నారు. సీఎం పర్యటన నేపథ్యంలో పట్టణంలోని తారా ప్రభుత్వ డిగ్రీ కళాశాల ఆవరణలో ఏర్పాటు చేస్తున్న హెలిప్యాడ్‌ను, అంబేద్కర్ స్టేడియంలోని బహిరంగ సభ స్థలిని టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ జగ్గారెడ్డి, జిల్లా కలెక్టర్ ప్రతీక్ జైన్, జిల్లా ఎస్పీ పరితోష్ పంకజ్ తో కలిసి పరిశీలించారు. అధికారులకు, నిర్వాహకులకు పలు సూచనలు చేశారు.
ఈ సందర్భంగా టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ జగ్గారెడ్డి మీడియాతో మాట్లాడుతూ, గత పదేళ్ల బీఆర్‌ఎస్ పాలనలో ప్రజలకు అరకొరగా మాత్రమే రేషన్ కార్డులు అందాయని విమర్శించారు. ప్రజా ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత అర్హులైన ప్రతి ఒక్కరికీ న్యాయం చేయాలనే సంకల్పంతో రాష్ట్రవ్యాప్తంగా కోటి 5 లక్షల మందికి నూతన స్మార్ట్ రేషన్ కార్డులను అందించబోతున్నామని తెలిపారు. పౌరసరఫరాల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి, సీఎం రేవంత్ రెడ్డి తీసుకున్న ఈ నిర్ణయం పట్ల హర్షం వ్యక్తం చేశారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన మాట కు కట్టుబడి పనిచేస్తుందని స్పష్టం చేశారు.ఇది ప్రభుత్వ కార్యక్రమం అయినప్పటికీ, కాంగ్రెస్ పార్టీ తరపున ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి సంగారెడ్డి గడ్డపై ఘన స్వాగతం పలుకుతామని జగ్గారెడ్డి తెలిపారు. సుమారు 50 వేల మంది జనసమీకరణతో ఈ బహిరంగ సభను అత్యంత ప్రతిష్టాత్మకంగా, విజయవంతంగా నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తున్నట్లు ఆయన వెల్లడించారు.

Tags:

About The Author

Latest News