- District News
- అంగన్‌వాడీ కేంద్రాలకు విద్యుత్ వెలుగులు
అంగన్‌వాడీ కేంద్రాలకు విద్యుత్ వెలుగులు
8,977 కేంద్రాలకు విద్యుత్ కనెక్షన్లు.. అర్హత ఉన్న కేంద్రాలన్నింటికీ 100 శాతం విద్యుదీకరణ
మహిళలు, చిన్నారుల సంక్షేమానికి రాష్ట్ర ప్రభుత్వం చేపడుతున్న చర్యల్లో భాగంగా అంగన్‌వాడీ కేంద్రాల విద్యుదీకరణను తెలంగాణ దక్షిణ ప్రాంత విద్యుత్ పంపిణీ సంస్థ (TGSPDCL) పూర్తి చేసింది. సంస్థ పరిధిలో విద్యుత్ సౌకర్యం లేని 9,234 అంగన్‌వాడీ కేంద్రాలను గుర్తించగా.. 257 కేంద్రాలు అవసరం లేనివి, విలీనమైనవి, ఉనికిలో లేనివి లేదా గుర్తించలేనివిగా తేలాయి. మిగిలిన 8,977 అర్హత కలిగిన కేంద్రాలకు విద్యుత్ కనెక్షన్లు మంజూరు చేసి 100 శాతం విద్యుదీకరణ సాధించినట్లు సంస్థ వెల్లడించింది.
డీఏ–జీజీయూఏ పథకం కింద చేపట్టిన ఈ కార్యక్రమాన్ని రెండు దశల్లో పూర్తి చేశారు. తొలి దశలో గుర్తించిన 7,297 కేంద్రాల్లో 7,073 కేంద్రాలకు విద్యుత్ కనెక్షన్లు ఇచ్చి జూలైలో పనులు పూర్తి చేశారు. రెండో దశలో 1,937 కేంద్రాల్లో 1,904 కేంద్రాలకు కనెక్షన్లు అందించి ఈ నెల 10న పనులు ముగించారు.
ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి నేతృత్వంలో, ఉప ముఖ్యమంత్రి, ఇంధన శాఖ మంత్రి మల్లు భట్టి విక్రమార్క ప్రత్యేక చొరవతో, మహిళా–శిశు సంక్షేమ శాఖ మంత్రి దనసరి అనసూయ (సీతక్క) మార్గదర్శకత్వంలో కార్యక్రమాన్ని చేపట్టినట్లు అధికారులు తెలిపారు.
కేంద్రాల నిర్వహణ మెరుగవుతుంది
అంగన్‌వాడీ కేంద్రాల్లో విద్యుత్ సౌకర్యం అందుబాటులోకి రావడంతో చిన్నారులకు మెరుగైన అభ్యసన వాతావరణం, గర్భిణులు, బాలింతలకు అందించే సేవల్లో సౌలభ్యం కలగనుందని TGSPDCL సీఎండీ జితేష్ వి. పాటిల్, ఐఏఎస్ తెలిపారు. విద్యుత్ సౌకర్యం వల్ల కేంద్రాల్లో మౌలిక వసతులు, ఆరోగ్య–పోషకాహార సేవలు, సిబ్బంది పనితీరు మెరుగుపడతాయని పేర్కొన్నారు.
నిర్దేశిత గడువులో విద్యుదీకరణ పూర్తి చేసేందుకు కృషి చేసిన చీఫ్ ఇంజినీర్లు, సూపరింటెండింగ్ ఇంజినీర్లు, డివిజనల్ ఇంజినీర్లు, ఏఈలు, లైన్ సిబ్బంది, ఇతర ఉద్యోగులను సీఎండీ అభినందించారు. మహిళలు, చిన్నారుల సంక్షేమానికి ప్రభుత్వం చేపడుతున్న కార్యక్రమాలకు నాణ్యమైన విద్యుత్ మౌలిక వసతులతో TGSPDCL నిరంతరం సహకరిస్తుందని ఆయన తెలిపారు.
