అర్హులైన ప్రతి ఒక్కరికీ ఓటు హక్కు కల్పించాలి: ఏ. శ్రీ దేవసేన

కమిషనర్‌ ఆఫ్‌ కాలేజియేట్‌ అండ్‌ టెక్నికల్‌ ఎడ్యుకేషన్‌, ఎస్‌ఐఆర్‌ రోల్‌ అబ్జర్వర్‌ ఏ శ్రీ దేవసేన ఐఏఎస్‌ అధికారులను ఆదేశం కొత్తగూడెం : లోకల్ గైడ్ న్యూస్ :

Published On
అర్హులైన ప్రతి ఒక్కరికీ ఓటు హక్కు కల్పించాలి: ఏ. శ్రీ దేవసేన

 


ప్రత్యేక సమగ్ర ఓటర్ల జాబితా సవరణ (ఎస్‌ఐఆర్‌) ప్రక్రియలో అర్హత కలిగిన ప్రతి ఒక్కరికీ ఓటు హక్కు కల్పించేలా చర్యలు చేపట్టాలని కమిషనర్‌ ఆఫ్‌ కాలేజియేట్‌ అండ్‌ టెక్నికల్‌ ఎడ్యుకేషన్‌, ఎస్‌ఐఆర్‌ రోల్‌ అబ్జర్వర్‌ ఏ. శ్రీ దేవసేన ఐఏఎస్‌ అధికారులను ఆదేశించారు. అర్హులైన ఓటర్ల పేర్లు జాబితా నుంచి తొలగిపోకుండా, అనర్హుల పేర్లు జాబితాలో కొనసాగకుండా ఎన్నికల సంఘం మార్గదర్శకాలు, నిబంధనల మేరకు సమగ్ర పరిశీలన చేపట్టాలని సూచించారు. జిల్లాకు వచ్చిన ఏ. శ్రీ దేవసేనకు జిల్లా కలెక్టర్‌ అంకిత్‌ పూల మొక్క అందించి స్వాగతం పలికారు. అనంతరం సోమవారం ఐడీఓసీలోని సమావేశ మందిరంలో కలెక్టర్‌ అంకిత్‌తో కలిసి ఎన్నికల నమోదు అధికారులు, సహాయ ఎన్నికల నమోదు అధికారులు, వివిధ రాజకీయ పార్టీల ప్రతినిధులతో ఎస్‌ఐఆర్‌ ప్రక్రియ పురోగతిపై సమీక్ష నిర్వహించారు. ఓటర్లకు నోటీసుల జారీ, పంపిణీ, విచారణలు, పెండింగ్‌ కేసులు, ధ్రువపత్రాల పరిశీలన, క్షేత్రస్థాయిలో బూత్‌ స్థాయి అధికారులు చేపడుతున్న కార్యక్రమాలపై సమగ్రంగా సమీక్షించారు. జిల్లాలోని ఐదు అసెంబ్లీ నియోజకవర్గాల్లో మొత్తం 8,63,413 మంది సాధారణ ఓటర్లు ఉన్నట్లు అధికారులు తెలిపారు. ఎన్నికల సంఘం షెడ్యూల్‌ ప్రకారం ఆగస్టు 17న ముసాయిదా ఓటర్ల జాబితా ప్రచురించినట్లు కలెక్టర్‌ అంకిత్‌ వివరించారు. వివరాల్లో వ్యత్యాసాలు ఉన్న, అదనపు పరిశీలన అవసరమైన ఓటర్లకు నోటీసులు జారీ చేసి, అభ్యంతరాలు, ఆధారాల స్వీకరణ, విచారణ ప్రక్రియను నిబంధనల మేరకు కొనసాగిస్తున్నట్లు తెలిపారు. ఎస్‌ఐఆర్‌లో భాగంగా జిల్లాలో 2,40,438 నోటీసులు జారీ చేయాల్సి ఉండగా, సెప్టెంబర్‌ 7 మధ్యాహ్నం 12 గంటల వరకు 2,40,435 నోటీసులు సిద్ధం చేసినట్లు అధికారులు తెలిపారు. ఇందులో 1,42,392 నోటీసులు ఓటర్లకు అందజేయగా, ఇంకా 98,043 నోటీసులు అందజేయాల్సి ఉందని వెల్లడించారు. మిగిలిన నోటీసులను త్వరితగతిన అందజేసి నిర్ణీత సమయంలో ప్రక్రియ పూర్తి చేయాలని దేవసేన ఆదేశించారు. నియోజకవర్గాల వారీగా ఎల్లందులో 43,317 నోటీసులకు గాను 31,653 (73.07 శాతం), అశ్వారావుపేటలో 36,354కు గాను 25,051 (68.91 శాతం), కొత్తగూడెంలో 70,174కు గాను 40,163 (57.23 శాతం), భద్రాచలంలో 34,502కు గాను 18,901 (54.78 శాతం), పినపాకలో 56,091కు గాను 26,624 (47.47 శాతం) నోటీసులు పంపిణీ చేసినట్లు అధికారులు వివరించారు. నోటీసు అందజేసిన అనంతరం బూత్‌ స్థాయి అధికారి తప్పనిసరిగా రసీదు వివరాలను యాప్‌లో నమోదు చేయాలని దేవసేన స్పష్టం చేశారు. యాప్‌లో రసీదు నమోదు చేసిన తర్వాతనే నోటీసు అందజేత పూర్తయినట్లుగా పరిగణించాలని పేర్కొన్నారు. మిగిలిన నోటీసుల పంపిణీపై క్షేత్రస్థాయిలో నిరంతర పర్యవేక్షణ చేపట్టాలని సూచించారు. జిల్లాలో ఇప్పటివరకు 8,275 విచారణలు నిర్వహించినట్లు అధికారులు తెలిపారు. విచారణ తేదీలు గడిచిపోయిన కేసులు పెద్ద సంఖ్యలో ఉన్న నేపథ్యంలో వాటిని వెంటనే పరిశీలించి నిబంధనల ప్రకారం చర్యలు తీసుకోవాలని దేవసేన ఆదేశించారు. విచారణకు హాజరయ్యే వారిలో చాలామంది సరైన ధ్రువపత్రాలు లేకుండా వస్తున్నందున, విచారణ తేదీకి ముందుగానే సమర్పించాల్సిన పత్రాల వివరాలను స్పష్టంగా తెలియజేయాలని సూచించారు. బీఎల్‌ఓలు, బీఎల్‌ఏలకు ఎస్‌ఐఆర్‌ ప్రక్రియపై క్షేత్రస్థాయి శిక్షణ ఇవ్వాలని, వివిధ రకాల కేసుల్లో ఏయే ధ్రువపత్రాలు అవసరమో, వాటిని ఎలా పరిశీలించాలో అవగాహన కల్పించాలని ఆదేశించారు. ప్రతి ఇంటినీ సందర్శించి ఓటర్లకు అవసరమైన ధ్రువపత్రాలపై అవగాహన కల్పించేలా బీఎల్‌ఓల పనితీరును పర్యవేక్షించాలని సూచించారు. ప్రస్తుతం జిల్లా ఎన్నికల అధికారి పరిశీలనకు 1,725 కేసులు పెండింగ్‌లో ఉండగా, వాటిలో 309 కేసులు ఐదు రోజులకు పైగా పెండింగ్‌లో ఉన్నట్లు అధికారులు తెలిపారు. వీటిని ప్రాధాన్యతా క్రమంలో పరిశీలించి త్వరితగతిన పరిష్కరించాలని దేవసేన ఆదేశించారు. తుది ఓటర్ల జాబితా ప్రచురణకు సంబంధించి 16,307 కేసులను తదుపరి పరిశీలన కోసం తాత్కాలికంగా నిలిపి ఉంచినట్లు తెలిపారు. అర్హులైన ఓటర్లకు ఓటు హక్కు నిరాకరించబడకుండా చూడటంతో పాటు, అనర్హుల పేర్లు ఓటర్ల జాబితాలో కొనసాగకుండా చర్యలు తీసుకోవడమే ఎస్‌ఐఆర్‌ ప్రక్రియ ప్రధాన ఉద్దేశమని దేవసేన పేర్కొన్నారు. ఓటర్ల పేర్ల తొలగింపుకు సంబంధించిన ప్రతి కేసును నిబంధనల మేరకు సమగ్రంగా పరిశీలించి కారణాలను స్పష్టంగా నమోదు చేయాలని అధికారులను ఆదేశించారు. రాజకీయ పార్టీల ప్రతినిధులు కూడా తమ పరిధిలోని ఓటర్లకు ఎస్‌ఐఆర్‌పై అవగాహన కల్పించి అధికారులతో సమన్వయంతో పనిచేయాలని కోరారు. అక్టోబర్‌ 1, 2026 నాటికి 18 సంవత్సరాలు పూర్తి చేసుకునే అర్హత కలిగిన, ఏ అసెంబ్లీ నియోజకవర్గంలోనూ ఓటరుగా నమోదు కాని వారు ఫారం-6 ద్వారా కొత్తగా ఓటరుగా నమోదు చేసుకోవచ్చని అధికారులు తెలిపారు. ఎస్‌ఐఆర్‌ ప్రక్రియ అనంతరం తుది ఓటర్ల జాబితాను అక్టోబర్‌ 19, 2026న ప్రచురించనున్నట్లు వెల్లడించారు. ఓటర్లకు సందేహాలు, సమస్యలు ఉంటే బీఎల్‌ఓ, ఏఈఆర్‌ఓ, ఈఆర్‌ఓలను సంప్రదించడంతో పాటు 1950 టోల్‌ఫ్రీ నంబర్‌ ద్వారా సమాచారం పొందవచ్చని తెలిపారు. సమావేశంలో అదనపు కలెక్టర్‌ వేణుగోపాల్‌, ఐటీడీఏ పీఓ రాహుల్‌, స్పెషల్‌ డిప్యూటీ కలెక్టర్‌ వెంకట్రావు, తహసీల్దార్లు, సీపీఐ నాయకుడు వెంకటేశ్వర్లు, బీజేపీ డాక్టర్‌ వెంకన్న నాయక్‌, ఆమ్‌ ఆద్మీ పార్టీ రాంబాబు, కాంగ్రెస్‌ పార్టీ లక్ష్మణ్‌ అగర్వాల్‌, కార్తిక్‌, బీఎస్‌ రెడ్డి, టీఆర్‌ఎస్‌ అనుదీప్‌తో పాటు వివిధ రాజకీయ పార్టీల ప్రతినిధులు, సంబంధిత శాఖల అధికారులు పాల్గొన్నారు.

Tags:

About The Author

Latest News