నేడు జిల్లాల్లో ప్రత్యేక వనమహోత్సవ కార్యక్రమం... రాష్ట్ర అటవీ, పర్యావరణ, దేవాదాయ శాఖ మంత్రి కొండా సురేఖ* వన మహోత్సవంలో నిర్దేశించిన లక్ష్యాలను సెప్టెంబర్ చివరి నాటికి పూర్తి చేయాలి

మొక్కలు నాటడంతో పాటు వాటి సంరక్షణకు ప్రత్యేక కార్యాచరణ రూపొందించాలి ఖమ్మం జిల్లాలో 31.30 లక్షల లక్ష్యానికి గాను 20.90 లక్షల మొక్కలు నాటి 67 శాతం లక్ష్యం పూర్తి

ఆగస్టు 25న మంగళవారం ఖమ్మం జిల్లాలో ఒకే రోజు లక్ష మొక్కలు నాటేలా కార్యాచరణ
Published On
నేడు జిల్లాల్లో ప్రత్యేక వనమహోత్సవ కార్యక్రమం... రాష్ట్ర అటవీ, పర్యావరణ, దేవాదాయ శాఖ మంత్రి కొండా సురేఖ*  వన మహోత్సవంలో నిర్దేశించిన లక్ష్యాలను సెప్టెంబర్ చివరి నాటికి పూర్తి చేయాలి

 

 

 

ఖమ్మం, ఆగస్టు -24: లోకల్ గైడ్:

రాష్ట్ర వ్యాప్తంగా వన మహోత్సవం కార్యక్రమంలో భాగంగా ఆగస్టు 25న మంగళవారం భారీ స్థాయిలో మొక్కలు నాటే ప్రత్యేక వనమహోత్సవ కార్యక్రమాన్ని నిర్వహించి, ప్రజల్లో పచ్చదనం, పర్యావరణ పరిరక్షణపై అవగాహన కల్పించాలని రాష్ట్ర అటవీ, పర్యావరణ, దేవాదాయ శాఖ మంత్రి కొండా సురేఖ జిల్లా కలెక్టర్లను, డిఎఫ్ఓ లను ఆదేశించారు.

వన మహోత్సవ కార్యక్రమంపై సోమవారం అన్ని జిల్లాల కలెక్టర్లు, డిఎఫ్ఓలతో మంత్రి వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఖమ్మం కలెక్టరేట్ నుండి జిల్లా కలెక్టర్ దివాకర టిఎస్, డిఎఫ్ఓ అనూజ్ అగర్వాల్ తో కలిసి వీడియో కాన్ఫరెన్స్‌లో పాల్గొన్నారు.WhatsApp Image 2026-08-24 at 15.34.16

మంత్రి కొండా సురేఖ మాట్లాడుతూ ప్రస్తుత సంవత్సరంలో వన మహోత్సవం కార్యక్రమం క్రింద రాష్ట్ర వ్యాప్తంగా 16.06 కోట్ల మొక్కలు నాటాలని లక్ష్యంగా నిర్దేశించగా, ఇప్పటి వరకు 9.06 కోట్ల మొక్కలు నాటినట్లు తెలిపారు. తక్కువ ప్రగతి సాధించిన జిల్లాలు, ప్రాంతాలపై ప్రత్యేక దృష్టి సారించి, నిర్దేశించిన లక్ష్యాలను వేగంగా పూర్తి చేయాలని సూచించారు. మేడ్చల్ జిల్లాలో ఇప్పటి వరకు కేవలం 9 శాతం లక్ష్యం మాత్రమే పూర్తయిందని, హెచ్‌ఎండీఏ, సూర్యాపేట, 3 గ్రేటర్ మున్సిపల్ కార్పొరేషన్లు, సంగారెడ్డి ప్రాంతాల్లో 50 శాతం కంటే తక్కువ లక్ష్యం పూర్తయిందని తెలిపారు. ఆయా ప్రాంతాల్లో లక్ష్య సాధనకు ప్రత్యేక ప్రణాళిక రూపొందించి వేగంగా మొక్కలు నాటాలని ఆదేశించారు.

వన మహోత్సవంలో మొక్కలు నాటడంతో పాటు వాటి సంరక్షణకు కూడా ప్రత్యేక కార్యాచరణ రూపొందించాలని మంత్రి సూచించారు. మొక్కల మనుగడ శాతం అధికంగా ఉండేలా చర్యలు తీసుకోవాలని, ఎక్కడైనా మొక్కలు చనిపోతే వెంటనే వాటి స్థానంలో కొత్త మొక్కలను నాటాలని అన్నారు. ప్రతి మొక్కకు జియో ట్యాగింగ్ చేయాలని, మొక్కల పరిస్థితిపై ప్రతిరోజూ పర్యవేక్షణ ఉండాలని ఆదేశించారు.

ఇటీవల కురుస్తున్న వర్షాలు, రానున్న రోజుల్లో వర్షాలు కురిసే అవకాశం ఉన్న నేపథ్యంలో ఈ అనుకూల వాతావరణాన్ని పూర్తిగా వినియోగించుకొని పెద్ద ఎత్తున మొక్కలు నాటాలని మంత్రి సూచించారు. సెప్టెంబర్ చివరి నాటికి అన్ని లక్ష్యాలను పూర్తి చేసేలా కలెక్టర్లు అవసరమైన కార్యాచరణ ప్రణాళిక సిద్ధం చేసుకోవాలని ఆదేశించారు.

వన మహోత్సవంలో భాగంగా ఆగస్టు 25న మంగళవారం జిల్లా వ్యాప్తంగా అన్ని మండలాలు, గ్రామాలు, పట్టణ ప్రాంతాల్లో భారీ స్థాయిలో సామూహికంగా మొక్కలు నాటే కార్యక్రమాన్ని ప్రణాళికాబద్ధంగా నిర్వహించాలని ఆదేశించారు. ప్రతి ప్రాంతానికి స్పష్టమైన లక్ష్యాలు నిర్దేశించి, ప్రజా ప్రతినిధులు, అంగన్‌వాడీ సిబ్బంది, స్వయం సహాయక సంఘాల మహిళలు, ఎన్‌ఎస్‌ఎస్‌, ఎన్‌సీసీ విద్యార్థులు, యువత, ప్రజలను పెద్ద సంఖ్యలో భాగస్వామ్యం చేయాలని సూచించారు. మంగళవారం నిర్వహించే సామూహిక మొక్కలు నాటే కార్యక్రమం ద్వారా జిల్లాలో చేపడుతున్న వన మహోత్సవ కార్యక్రమాలపై ప్రజలకు మంచి సందేశం వెళ్లేలా విస్తృత ప్రచారం కల్పించాలని అన్నారు.

ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, మంత్రులు, ఇతర ప్రజాప్రతినిధులను వ్యక్తిగతంగా ఆహ్వానించి కార్యక్రమంలో పాల్గొనేలా చూడాలని ఆదేశించారు. అటవీ ప్రాంతాల్లో ఖాళీగా ఉన్న భూములను గుర్తించి మొక్కలు నాటాలని, పట్టణ ప్రాంతాల్లో సాధ్యమైన చోట అర్బన్ ఫారెస్ట్రీని ప్రోత్సహించాలని మంత్రి సూచించారు. దేవాలయ పరిసర ప్రాంతంలో, పాఠశాలలు, ప్రభుత్వ కార్యాలయాలు, ఇతర ప్రభుత్వ సంస్థల ప్రాంగణాల్లో కూడా ప్రణాళికా బద్ధంగా మొక్కలు నాటాలని అన్నారు.

బ్లాక్ ప్లాంటేషన్ ప్రాంతాల్లో నీటి సౌకర్యం కల్పించాలని, అవసరమైన మొక్కలను సకాలంలో తరలించాలని, నాణ్యమైన మొక్కలను మాత్రమే నాటాలని మంత్రి ఆదేశించారు. వన మహోత్సవం కార్యక్రమానికి విస్తృత ప్రచారం కల్పించి, మీడియాను కూడా భాగస్వామ్యం చేయాలని సూచించారు.

ఖమ్మం జిల్లాలో 67 శాతం లక్ష్యం పూర్తి
జిల్లాకలెక్టర్ దివాకర టిఎస్ మాట్లాడుతూ  ఖమ్మం జిల్లాలో వన మహోత్సవం క్రింద 31.30 లక్షల మొక్కలు నాటాలని లక్ష్యం కాగా, ఇప్పటివరకు సుమారు 20.90 లక్షల మొక్కలు నాటి 67 శాతం లక్ష్యాన్ని పూర్తి చేసినట్లు తెలిపారు.

మంత్రి సూచనల మేరకు మంగళవారం జిల్లాలో భారీ స్థాయిలో మొక్కలు నాటే కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నామని, ఇప్పటికే 2 లక్షలకు పైగా గుంతలు సిద్ధం చేసినట్లు తెలిపారు. మంగళవారం ఒకే రోజు 1 లక్ష మొక్కలు నాటేలా లక్ష్యంగా పెట్టుకున్నామని, ఖమ్మం నుంచి వ్యవసాయ శాఖ మంత్రి మొక్కలు నాటే కార్యక్రమంలో పాల్గొంటారని తెలిపారు.

మండల, గ్రామ స్థాయిల్లో కూడా ప్రత్యేకంగా మొక్కలు నాటే కార్యక్రమాలను నిర్వహిస్తున్నామని, పాఠశాల విద్యార్థులు, ఎన్‌ఎస్‌ఎస్‌, ఎన్‌సీసీ, అంగన్‌వాడీ సిబ్బంది, స్వయం సహాయక సంఘాల మహిళలు తదితరులను కార్యక్రమంలో భాగస్వామ్యం చేస్తున్నామని కలెక్టర్ తెలిపారు.

అనంతరం జిల్లా కలెక్టర్ అధికారులతో మాట్లాడుతూ  మంగళవారం 1 లక్ష మొక్కలు నాటే లక్ష్యాన్ని తప్పనిసరిగా సాధించాలని ఆదేశించారు. మండలాల వారీగా స్పష్టమైన లక్ష్యాలు కేటాయించి, ముందస్తు ప్రణాళికతో కార్యక్రమాన్ని నిర్వహించాలని డిఎఫ్ఓకు సూచించారు. కార్యక్రమంలో ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా అవసరమైన ఏర్పాట్లను ముందుగానే పూర్తి చేయాలని, అన్ని వర్గాల ప్రజలను కార్యక్రమంలో భాగస్వామ్యం చేయాలని ఆదేశించారు.

ఈ వీడియో కాన్ఫరెన్స్‌లో అడిషనల్ డీఆర్‌డీఓ బి. శిరీష, సంబంధిత అధికారులు, తదితరులు పాల్గొన్నారు.

Tags:

About The Author

Latest News