12వ వార్డులో రూ.25 లక్షలతో సీసీ రోడ్డు పనులు

నాణ్యతతో పనులు పూర్తి చేసి ప్రజలకు అందుబాటులోకి తీసుకురావాలి: మున్సిపల్ చైర్మన్ పత్యా నాయక్

Published On
12వ వార్డులో రూ.25 లక్షలతో సీసీ రోడ్డు పనులు

 

లోకల్ గైడ్ ఆమనగల్లు, ఆగస్టు 24:
రంగారెడ్డి జిల్లా
ఆమనగల్లు మున్సిపాలిటీ పరిధిలో అభివృద్ధి పనులకు ప్రాధాన్యత ఇస్తూ ప్రజలకు మెరుగైన మౌలిక వసతులు కల్పించేందుకు చర్యలు కొనసాగుతున్నాయి. ఇందులో భాగంగా మున్సిపాలిటీ 12వ వార్డులో కల్వకుర్తి ఎమ్మెల్యే కసిరెడ్డి నారాయణరెడ్డి సహకారంతో రూ.25 లక్షల వ్యయంతో నిర్మిస్తున్న సీసీ రోడ్డు పనులను మున్సిపల్ చైర్మన్ పత్యా నాయక్ పరిశీలించారు.WhatsApp Image 2026-08-24 at 15.51.03
మున్సిపల్ కమిషనర్ రాఘవేందర్ రెడ్డి, 12వ వార్డు కౌన్సిలర్ నాగిళ్ల జగన్, కోఆప్షన్ సభ్యులు చుక్క అల్లాజీ గౌడ్, స్థానిక నాయకులు రాజు, వెంకటేష్లతో కలిసి చైర్మన్ పత్యా నాయక్ నిర్మాణ పనులను క్షేత్రస్థాయిలో పరిశీలించారు. రోడ్డు నిర్మాణంలో నాణ్యతా ప్రమాణాలు పాటిస్తున్నారా? పనులు ఏ మేరకు పూర్తయ్యాయి? అనే అంశాలను అధికారులను అడిగి తెలుసుకున్నారు.
ఈ సందర్భంగా మున్సిపల్ చైర్మన్ పత్యా నాయక్ మాట్లాడుతూ.. ప్రజలకు ఉపయోగపడే అభివృద్ధి పనులను నాణ్యతతో చేపట్టడం తమ ప్రధాన బాధ్యత అని అన్నారు. రూ.25 లక్షలతో చేపడుతున్న సీసీ రోడ్డు పనులను ఎలాంటి జాప్యం లేకుండా, నాణ్యతా ప్రమాణాలకు అనుగుణంగా త్వరితగతిన పూర్తి చేయాలని సంబంధిత అధికారులకు సూచించారు. రోడ్డు నిర్మాణంలో నాణ్యత విషయంలో రాజీ పడకుండా పనులను పర్యవేక్షించాలని మున్సిపల్ కమిషనర్ రాఘవేందర్ రెడ్డిని కోరారు.
వినాయక చవితి నాటికి ప్రజలకు అందుబాటులోకి తీసుకురావాలి
వినాయక చవితి పండుగను దృష్టిలో ఉంచుకుని రోడ్డు పనులను వీలైనంత త్వరగా పూర్తి చేసి ప్రజలకు అందుబాటులోకి తీసుకురావాలని చైర్మన్ సూచించారు. పండుగ సమయంలో ప్రజలకు రాకపోకల్లో ఎలాంటి ఇబ్బందులు కలగకుండా పనులను సమన్వయంతో పూర్తి చేయాలని అన్నారు.
మున్సిపల్ కమిషనర్ రాఘవేందర్ రెడ్డి మాట్లాడుతూ.. పనుల పురోగతిని ఎప్పటికప్పుడు పరిశీలిస్తూ, నిర్దేశిత ప్రమాణాల ప్రకారం రోడ్డు నిర్మాణం పూర్తయ్యేలా చర్యలు తీసుకుంటామని తెలిపారు. వార్డు ప్రజలకు ఉపయోగకరంగా ఉండేలా పనులను వేగవంతం చేస్తామని పేర్కొన్నారు.
కౌన్సిలర్ నాగిళ్ల జగన్, కోఆప్షన్ సభ్యులు చుక్క అల్లాజీ గౌడ్ మాట్లాడుతూ.. వార్డులో సీసీ రోడ్డు నిర్మాణంతో ప్రజలకు రాకపోకల సౌకర్యం మరింత మెరుగుపడుతుందని తెలిపారు. ప్రజల అవసరాలను దృష్టిలో ఉంచుకుని అభివృద్ధి పనులు చేపడుతున్న మున్సిపల్ పాలకవర్గానికి, ఎమ్మెల్యే కసిరెడ్డి నారాయణరెడ్డికి వారు కృతజ్ఞతలు తెలిపారు.
కార్యక్రమంలో స్థానిక నాయకులు, మున్సిపల్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.

Tags:

About The Author

Latest News