- District News
- అనంతగిరి ఘాట్ రోడ్డులో ప్రైవేట్ బస్సు బోల్తా: ఐదుగురు దుర్మరణం, 40 మందికి తీవ్ర గాయాలు
అనంతగిరి ఘాట్ రోడ్డులో ప్రైవేట్ బస్సు బోల్తా: ఐదుగురు దుర్మరణం, 40 మందికి తీవ్ర గాయాలు
సంఘటనా స్థలాన్ని పరిశీలించి, బాధితులను పరామర్శించిన వికారాబాద్ జిల్లా కలెక్టర్ దీపక్ తివారి జిల్లా ఎస్పీ స్నేహ మెహ్రా,

వికారాబాద్ జిల్లా బ్యూరో :
వికారాబాద్ అనంతగిరి ఘాట్ రోడ్డులో ఘోర రహదారి ప్రమాదం సంభవించింది. ప్రయాణికులతో వెళ్తున్న ఒక ప్రైవేట్ బస్సు నియంత్రణ తప్పి బోల్తా పడిన ఘటనలో ఐదుగురు ప్రాణాలు కోల్పోగా, దాదాపు 40 మంది తీవ్రంగా గాయపడ్డారు. ప్రమాద సమాచారం అందుకున్న వెంటనే వికారాబాద్ జిల్లా పోలీస్ యంత్రాంగం తక్షణమే స్పందించి ఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టింది.
అంత్యక్రియలకు వెళ్తుండగా తలపడిన విషాదం:
సంగారెడ్డి జిల్లా పటాన్‌చెరు మండలం కేసారం గ్రామానికి చెందిన ప్రయాణికులు వికారాబాద్ జిల్లా దారూర్ మండలం చింతకుంట గ్రామంలో జరుగుతున్న అంత్యక్రియలకు హాజరయ్యేందుకు ప్రైవేట్ బస్సులో బయలుదేరారు. మార్గమధ్యలో అనంతగిరి ఘాట్ రోడ్డులోని మలుపు వద్ద బస్సు ప్రయాణిస్తుండగా అకస్మాత్తుగా అదుపుతప్పి బోల్తా పడింది. ఈ ప్రమాదంలో ఐదుగురు అక్కడికక్కడే మృతి చెందగా, 40 మంది ప్రయాణికులు తీవ్ర గాయాలపాలయ్యారు.
సంఘటనా స్థలంలో ఎస్పీ సమీక్ష:
ప్రమాద వార్త తెలిసిన వెంటనే వికారాబాద్ జిల్లా ఎస్పీ స్నేహ మెహ్రా స్వయంగా సంఘటనా స్థలానికి చేరుకుని పరిస్థితిని సమీక్షించారు. విధుల్లో ఉన్న పోలీసు అధికారులను అడిగి ప్రమాద వివరాలను తెలుసుకున్నారు. క్షతగాత్రులను వెంటనే అంబులెన్సుల్లో ఆసుపత్రులకు తరలించడం, ఘాట్ రోడ్డులో ట్రాఫిక్‌కు అంతరాయం కలగకుండా వాహనాల రాకపోకలను పునరుద్ధరించడం మరియు సహాయక చర్యలను వేగవంతం చేయడంపై అధికారులకు స్పష్టమైన ఆజ్ఞలు జారీ చేశారు.
ఆసుపత్రిలో బాధితులకు పరామర్శ:
అనంతరం ఎస్పీ స్నేహ మెహ్రా, జిల్లా కలెక్టర్‌తో కలిసి వికారాబాద్ జిల్లా ప్రభుత్వ ఆసుపత్రితో పాటు క్షతగాత్రులు చికిత్స పొందుతున్న వివిధ ఆసుపత్రులను సందర్శించారు. చికిత్స పొందుతున్న బాధితులను పరామర్శించి, వారి ఆరోగ్య పరిస్థితిని, అందుతున్న వైద్య సేవల వివరాలను వైద్యులను అడిగి తెలుసుకున్నారు.
బాధితులందరికీ అత్యవసర మరియు మెరుగైన వైద్య చికిత్స అందేలా చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్ వైద్య సిబ్బందిని ఆదేశించారు. క్షేత్రస్థాయిలో బాధితులకు అవసరమైన అన్ని సహాయ సహకారాలు అందించేందుకు పోలీసు శాఖ నిరంతరం అందుబాటులో ఉంటుందని ఎస్పీ తెలిపారు. ప్రమాదానికి గల ఖచ్చితమైన కారణాలపై పోలీసులు కేసు నమోదు చేసి సమగ్ర దర్యాప్తు జరుపుతున్నారు.
