- District News
- Khammam
- పేదల జీవితాలకు కొత్త వెలుగు.. డాక్టర్ బాదావత్ రవి సేవా సంకల్పం!
పేదల జీవితాలకు కొత్త వెలుగు.. డాక్టర్ బాదావత్ రవి సేవా సంకల్పం!
ఖమ్మంలో మిషన్ వాక్ రిహాబిలిటేషన్ సెంటర్ సిద్ధం
కారేపల్లి (సింగరేణి ), అక్టోబర్ 13 (లోకల్ గైడ్ న్యూస్ ) : పేదలు, దివ్యాంగులు, పక్షవాతం, బ్రెయిన్ స్ట్రోక్ బాధితులకు మెరుగైన పునరావాస సేవలు అందించాలనే లక్ష్యంతో మిషన్ వాక్ ఫౌండేషన్ వ్యవస్థాపకులు డాక్టర్ బాదావత్ రవి చేపట్టిన సేవా సంకల్పం కార్యరూపం దాల్చింది. ఖమ్మంలోని కపిల్ భవన్‌లో ఏర్పాటు చేసిన మిషన్ వాక్ రిహాబిలిటేషన్ సెంటర్ నవంబర్‌లో ప్రారంభానికి సిద్ధమైంది.
మూడు విభాగాలు.. ప్రత్యేక పునరావాస సేవలు!
🔹 న్యూరో రిహాబిలిటేషన్: పక్షవాతం, బ్రెయిన్ స్ట్రోక్, నరాల సమస్యలతో బాధపడేవారికి నడక, చేతులు–కాళ్ల కదలికలు, కండరాల బలాన్ని మెరుగుపరిచే పునరావాస చికిత్సలు.
🔹 ఆర్థో రిహాబిలిటేషన్: ఎముకలు, కీళ్ల సమస్యలు, ప్రమాదాలు, శస్త్రచికిత్సల అనంతరం కదలికలు మెరుగుపరుచుకోవడానికి, కండరాల బలాన్ని పెంపొందించుకోవడానికి అవసరమైన ఫిజియోథెరపీ సేవలు.
🔹 పీడియాట్రిక్ రిహాబిలిటేషన్: ఎదుగుదలలో ఆలస్యం, కూర్చోవడం, నిలబడటం, నడవడంలో ఇబ్బందులున్న చిన్నారులకు శారీరక కదలికలు, సమతుల్యత మెరుగుపరిచే పునరావాస సేవలు.
గ్రామీణ, గిరిజన ప్రజలకు చేరువలో వైద్యం!
ఇల్లందు, వైరా, సింగరేణి, కారేపల్లి, గార్ల, కామేపల్లి తదితర ప్రాంతాల ప్రజలు పునరావాస చికిత్సల కోసం హైదరాబాద్ వంటి నగరాలకు వెళ్లాల్సిన అవసరాన్ని తగ్గించడంలో ఈ కేంద్రం కీలకంగా నిలవనుంది. పేదలకు అందుబాటులో వైద్యం.. బాధితులకు ఆత్మవిశ్వాసం.. తిరిగి సాధారణ జీవనానికి చేరేందుకు తోడ్పాటు అందించాలనే లక్ష్యంతో డాక్టర్ బాదావత్ రవి చేపట్టిన ఈ ప్రయత్నం ఖమ్మం ప్రాంతంలో వైద్య పునరావాస సేవలకు కొత్త దిశ చూపనుంది.
