- District News
- ఎస్సై, పోలీస్ ఉచిత శిక్షణకు 100 మంది గిరిజన అభ్యర్థుల ఎంపిక
ఎస్సై, పోలీస్ ఉచిత శిక్షణకు 100 మంది గిరిజన అభ్యర్థుల ఎంపిక
మెరిట్ ఆధారంగా అభ్యర్థుల ఎంపిక : డీడీ ట్రైబల్ వెల్ఫేర్ చందన
భద్రాచలం, లోకల్ గైడ్ న్యూస్ :
భద్రాచలం ఐటీడీఏ ఆధ్వర్యంలో ఎస్సై, పోలీస్ ఉద్యోగాల ఉచిత శిక్షణకు గిరిజన అభ్యర్థుల ఎంపిక ప్రక్రియను విజయవంతంగా పూర్తి చేసినట్లు డిప్యూటీ డైరెక్టర్ ట్రైబల్ వెల్ఫేర్ చందన తెలిపారు. ఐటీడీఏ ప్రాజెక్టు అధికారి బి. రాహుల్ ఆదేశాల మేరకు పీఈటీసీ ప్రిన్సిపాల్ డాక్టర్ వీరు నాయక్ ఆధ్వర్యంలో సర్టిఫికెట్ల పరిశీలన, శారీరక దారుఢ్య పరీక్షలను ఎలాంటి పొరపాట్లకు తావులేకుండా నిర్వహించినట్లు పేర్కొన్నారు. మంగళవారం భద్రాచలం ఐటీడీఏ ప్రాంగణంలోని పీఎంఆర్సీ భవనంలో అధికారుల పర్యవేక్షణలో అభ్యర్థుల సర్టిఫికెట్ల పరిశీలన, శారీరక దారుఢ్య పరీక్షలు నిర్వహించారు. ఈ ఎంపిక ప్రక్రియలో భాగంగా మొత్తం 100 మంది గిరిజన అభ్యర్థులను ఎంపిక చేసినట్లు చందన వెల్లడించారు. వీరిలో 67 మంది బాలురు, 33 మంది బాలికలు ఉన్నారని తెలిపారు. సర్టిఫికెట్ల పరిశీలన, శారీరక దారుఢ్య పరీక్షల్లో ప్రతిభ, మెరిట్ ఆధారంగా అభ్యర్థులను ఎంపిక చేసినట్లు ఆమె వివరించారు. ఎంపికైన అభ్యర్థులకు ఎస్సై, పోలీస్ ఉద్యోగాల ఉచిత శిక్షణ అందించనున్నారు. ఈ కార్యక్రమంలో ఏసీఎంఓ రమేష్, పీజీహెచ్ఎం మోతేరు, క్రీడల అధికారి గోపాలరావు, శారీరక విద్యా దర్శకులు రాంబాబు, నాగేశ్వరరావు, పార్వతి, కృష్ణారావు, పీఎంఆర్సీ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.
