ఐటీసీ నుంచి భద్రాచలం బ్రిడ్జి వరకు రహదారి సుందరీకరణకు వారం రోజుల్లో ప్రణాళిక

ఆలయ అభివృద్ధి, పుష్కర ఘాట్ల నిర్మాణ పనుల్లో వేగం పెంచాలి : కలెక్టర్ అంకిత్

Published On
ఐటీసీ నుంచి భద్రాచలం బ్రిడ్జి వరకు రహదారి సుందరీకరణకు వారం రోజుల్లో ప్రణాళిక

 

 

భద్రాచలం, లోకల్ గైడ్ న్యూస్ :

గోదావరి పుష్కరాలను దృష్టిలో ఉంచుకొని భద్రాచలం శ్రీ సీతారామచంద్రస్వామి ఆలయ అభివృద్ధి పనులు, పుష్కర ఘాట్ల నిర్మాణం, భక్తులకు అవసరమైన మౌలిక సదుపాయాల కల్పన పనులను యుద్ధ ప్రాతిపదికన పూర్తి చేయాలని జిల్లా కలెక్టర్ అంకిత్ అధికారులను ఆదేశించారు. మంగళవారం సబ్ కలెక్టర్ మృణాల్ శ్రేష్ఠ, సంబంధిత శాఖల అధికారులు, ఇంజినీర్లతో కలిసి వివిధ ప్రాంతాల్లో జరుగుతున్న అభివృద్ధి పనులను క్షేత్రస్థాయిలో పరిశీలించి పురోగతిని సమీక్షించారు. ముందుగా శ్రీ సీతారామచంద్రస్వామి ఆలయాన్ని సందర్శించిన కలెక్టర్, ఉత్తర ద్వారం వద్ద జరుగుతున్న అభివృద్ధి పనులను పరిశీలించారు. ఆలయ ఉత్తర, దక్షిణ ప్రాంతాల్లో చేపట్టిన స్లాబ్ నిర్మాణం, రక్షణ గోడలు, మట్టి నింపే పనులను నిర్దేశిత గడువులోగా పూర్తి చేయాలని సూచించారు. అనంతరం ఆలయం నుంచి గోదావరి స్నాన ఘాట్లకు వెళ్లే రహదారిని పరిశీలించి, భక్తుల రాకపోకలకు ఇబ్బందులు కలగకుండా ప్రస్తుతం సుమారు 25 అడుగుల వెడల్పు ఉన్న రహదారిని 30 అడుగులకు విస్తరించే ప్రతిపాదనపై అధికారులతో చర్చించారు. రహదారి విస్తరణకు అవసరమైన భూమి, అనుమతులు, నిధులు, బిల్లుల పరిష్కారానికి రెవెన్యూ, రోడ్లు భవనాల శాఖలు సమన్వయంతో పనిచేయాలని ఆదేశించారు. వైకుంఠధామానికి వెళ్లే మార్గాన్ని పరిశీలించిన కలెక్టర్, పుష్కరాల సమయంలో భక్తుల రద్దీని దృష్టిలో ఉంచుకొని ప్రత్యామ్నాయ రహదారి ఏర్పాటు కోసం ప్రణాళిక సిద్ధం చేయాలని సూచించారు. ట్రాఫిక్ నియంత్రణకు చర్యలు చేపట్టడంతో పాటు వైకుంఠధామం చుట్టూ ప్రహరీ నిర్మాణానికి ప్రతిపాదనలు రూపొందించాలని తెలిపారు. విద్యుత్ దహనవాటికకు సంబంధించిన అనుమతులు, ఇతర అభివృద్ధి పనుల టెండర్ ప్రక్రియను వేగవంతం చేయాలని ఆదేశించారు. అనంతరం గోదావరి పుష్కర ఘాట్ల నిర్మాణ పనులను పరిశీలించారు. ఉత్తర వైపు సుమారు 270 మీటర్లు, దక్షిణ వైపు 230 మీటర్ల పొడవున చేపడుతున్న ఘాట్ల నిర్మాణాలను నిర్ణీత గడువులోగా పూర్తి చేయాలని స్పష్టం చేశారు. ఘాట్ల వద్ద మెట్లు, దిగే ప్రాంతాలు, రక్షణ గోడలను పటిష్టంగా నిర్మించాలని, పాత గోడలకు పగుళ్లు ఏర్పడిన చోట మరమ్మతులు చేపట్టాలని సూచించారు. పర్ణశాల వద్ద టెండర్ ప్రక్రియను త్వరగా పూర్తి చేసి పనులు ప్రారంభించాలని ఆదేశించారు. పుష్కరాలకు వచ్చే భక్తుల వసతి కోసం దేవాదాయ శాఖ ఆధ్వర్యంలో నిర్మిస్తున్న వసతి గృహం, గోశాల అభివృద్ధి పనులను కూడా కలెక్టర్ సమీక్షించారు. భద్రాచలంతో పాటు చర్ల, అశ్వాపురం, దుమ్ముగూడెం, పర్ణశాల, కిన్నెరసాని పరిసర ప్రాంతాల్లో భక్తులకు అవసరమైన మౌలిక సదుపాయాలు కల్పించేందుకు రూపొందించిన ప్రతిపాదనలపై అధికారులతో చర్చించారు. సారపాక బ్రిడ్జి ప్రాంతాన్ని పరిశీలించిన కలెక్టర్, ఐటీసీ నుంచి భద్రాచలం బ్రిడ్జి వరకు సుమారు మూడు కిలోమీటర్ల మేర రహదారి సుందరీకరణ చేపట్టాలని సూచించారు. రహదారి మధ్య విభాజకాలతో పాటు ఇరువైపులా పుష్పించే మొక్కలు నాటేందుకు అనువైన ప్రాంతాలను గుర్తించాలని, బౌగెన్‌విల్లియా వంటి రంగురంగుల పూల మొక్కలతో సుందరీకరణ చేపట్టేందుకు సమగ్ర ప్రణాళికను వారం రోజుల్లో సిద్ధం చేయాలని ఆదేశించారు. ఈ సందర్భంగా కలెక్టర్ అంకిత్ మాట్లాడుతూ, గత మార్చిలో ముఖ్యమంత్రి చేతుల మీదుగా శంకుస్థాపన చేసిన అనంతరం ఇరిగేషన్, దేవాదాయ, రోడ్లు భవనాల శాఖల ఆధ్వర్యంలో ఆలయ అభివృద్ధి, పుష్కరాల ఏర్పాట్ల పనులు కొనసాగుతున్నాయని తెలిపారు. ముక్కోటి ఏకాదశి, శ్రీరామనవమి, గోదావరి పుష్కరాల గడువులను దృష్టిలో ఉంచుకొని పనులను వేగవంతం చేయాలని పేర్కొన్నారు. నిర్మాణ పనుల కోసం సుమారు 200 మంది కార్మికులతో పాటు 10 ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేసి, ఉదయం 6 గంటల నుంచి రాత్రి 10 గంటల వరకు విద్యుత్ దీపాల వెలుగులో పనులు నిర్వహిస్తున్నట్లు వివరించారు. భద్రాచలం ప్రధాన పుష్కర క్షేత్రం కావడంతో తెలంగాణతో పాటు ఆంధ్రప్రదేశ్, ఛత్తీస్‌గఢ్, మహారాష్ట్ర రాష్ట్రాల నుంచి పెద్ద సంఖ్యలో భక్తులు వచ్చే అవకాశం ఉందని కలెక్టర్ తెలిపారు. భక్తులకు తాగునీరు, మరుగుదొడ్లు, రవాణా, పోలీసు భద్రత, వైద్య సేవలు తదితర సౌకర్యాలు కల్పించేందుకు ముందస్తు ప్రణాళికలు సిద్ధం చేయాలని సూచించారు. మార్చిలో జరిగే శ్రీరామనవమి ఉత్సవాలతో పాటు జూన్ 27 నుంచి జూలై 7 వరకు నిర్వహించనున్న గోదావరి పుష్కరాలను దృష్టిలో ఉంచుకొని నవంబర్, డిసెంబర్ నెలల నుంచే అవసరమైన ఏర్పాట్లను ప్రణాళికాబద్ధంగా ప్రారంభించాలని అధికారులకు దిశానిర్దేశం చేశారు. ఈ పర్యటనలో దేవస్థానం ఈవో దామోదర్ రావు, రోడ్లు భవనాల శాఖ ఈఈ నాగేశ్వరరావు, దేవస్థానం డీఈ రవీందర్ రావు, తహసీల్దార్ రవికుమార్, ఇన్‌చార్జి ఎంపీడీవో, జీపీ ఈవో శ్రీనివాస్, ఇంజినీరింగ్ శాఖ అధికారులు, సంబంధిత శాఖల సిబ్బంది పాల్గొన్నారు.

Tags:

About The Author

Latest News

హకీంపేట్‌లో వ్యవసాయ అనుబంధ శాఖల ఎక్స్‌పో ఏర్పాట్ల పరిశీలన.. హకీంపేట్‌లో వ్యవసాయ అనుబంధ శాఖల ఎక్స్‌పో ఏర్పాట్ల పరిశీలన..
        లోకల్ గైడ్ వికారాబాద్ జిల్లా ప్రతినిధి / కొడంగల్: హకీంపేట్‌లో త్వరలో జరగనున్న వ్యవసాయ అనుబంధ శాఖల ఎక్స్‌పో ఏర్పాట్లను ఉన్నతాధికారులు పరిశీలించారు. అదేవిధంగా కొడంగల్‌లో
ఐటీసీ నుంచి భద్రాచలం బ్రిడ్జి వరకు రహదారి సుందరీకరణకు వారం రోజుల్లో ప్రణాళిక
ధారూర్ నూతన ఎస్‌ఐగా సురేష్ బాధ్యతల స్వీకరణ
ఎస్సై, పోలీస్ ఉచిత శిక్షణకు 100 మంది గిరిజన అభ్యర్థుల ఎంపిక
పేదల జీవితాలకు కొత్త వెలుగు.. డాక్టర్ బాదావత్ రవి సేవా సంకల్పం!
సింగరేణిలో ఎమ్మార్పీఎస్, ఎంఎస్పీ నూతన సారథుల ఎంపిక
గిరిజన ప్రాంతాల్లో మెరుగైన వైద్య సేవలే లక్ష్యం